Guntur Murder: వివాహితుడితో కుమార్తె ప్రేమ వ్యవహారం.. హంతకుడిగా మారిన తండ్రి
Guntur Murder: పెళ్లై భార్యకు దూరంగా ఉంటున్న యువకుడితో తన కుమార్తె ప్రేమలో పడటాన్ని తట్టుకోలేక పోయిన ఓ తండ్రి హంతకుడిగా మారాడు. తన కుమార్తెకు దూరంగా ఉండాలని హెచ్చరించినా వినకపోవడంతో సుత్తితో కొట్టి హతమార్చాడు.
Guntur Murder: కుమార్తె మీద మితిమీరిన ప్రేమ ఓ వ్యక్తని హంతకుడిగా మార్చింది. ఎంత చెప్పినా ప్రియుడి మోజులో కుమార్తె మాట వినడం లేదనే ఆవేశంతో హత్యకు పాల్పడేలా చేసింది. పెళ్లైన వ్యక్తితో ప్రేమాయణం నెరపడం నచ్చని తండ్రి యువకుడికి సుత్తితో కొట్టి హత్య చేశాడు. గుంటూరు జిల్లాలో సంచలనం సృష్టించిన ఫిజియోథెరఫీ వైద్యుడి హత్య కేసులో నిందితుడిని కొత్తపేట పోలీసులు గురువారం అరెస్టు చేశారు.
ఫిరంగిపురం మండలం 113 తాళ్లూరుకు చెందిన శ్రీనివాసరెడ్డి, పల్నాడు జిల్లా నరసరావుపేటలో రీజినల్ సేఫ్టీ డ్రైవింగ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు. శ్రీనివాసర రెడ్డి కుమార్తెను ఫార్మా డి చదివించారు. గుంటూరువారి తోటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో డ్యూటీ డాక్టర్‌గా పని చేశారు.
అక్కడ పనిచేస్తున్న సమయంలో ఫిజియోథెరఫీ వైద్యుడిగా పనిచేస్తున్న పల్నాడు జిల్లా బెల్లంకొండకు చెందిన సత్తెనపల్లి సీతారామాంజనేయులతో పరిచయమై ప్రేమకు దారి తీసింది. సీతారామాంజనేయులుకు అప్పటికే తన బంధువుల అమ్మాయితో పెళ్లయింది. భార్యతో మనస్పర్థలు తలెత్తడంతో విడిగా ఉంటున్నారు.
వీరి ప్రేమ విషయం నచ్చని యువతి తండ్రి శ్రీనివాసరెడ్డి ఆమెను ఉన్నత చదువుల నిమిత్తం గత ఏడాది అమెరికాకు పంపించాడు. రెండేళ్ల కోర్సు పూర్తి కాకుండానే ఇటీవల ఆమె గుంటూరుకు తిరిగి రావడానికి సిద్ధమైంది. కోర్సు పూర్తి చేసిన తర్వాత రావాలని, డిసెంబరులో రమ్మని తండ్రి శ్రీనివాసరెడ్డి ఎంత చెప్పినా వినిపించుకోలేదు. ప్రియుడు సీతారామాంజనేయులు ఏం చెబితే అది చేస్తానని మొండికేసింది.
కూతురు భవిష్యత్తు నాశనం అవుతుందని ఆందోళనకు గురైన శ్రీనివాసరెడ్డి వివాహితుడైన సీతారామాంజనేయులు అడ్డు తొలగించుకోవాలని శ్రీనివాసరెడ్డి పథకం పన్నాడు. ఒక సంచిలో ఇనుప సుత్తి, కారంపొడి పెట్టుకొని గత నెల 29వ తేదీ రాత్రి గుంటూరువారితోటలోని సీతారామాంజనేయులు ఇంటికి వెళ్లాడు. తన కుమార్తెను విదేశాల నుంచి ఇప్పుడు రావద్దని చెప్పాలని కోరాడు.
సీతారామాంజనేయులు నిరాకరించడంతో ఆగ్రహించిన శ్రీనివాసరెడ్డి సంచిలో ఉన్న కారంపొడిని సీతారామాంజనేయులు కంట్లో చల్లి, ఇనుప సుత్తితో తలపై బలంగా కొట్టి చంపాడు. దాడి సమయంలో రక్తం చింది అతని చొక్కాపై పడింది. ఘటనా స్థలంలోనే మరో చొక్కాను మార్చుకున్నాడు. పోలీసు జాగిలాలకు దొరకకుండా మిగిలిన కారం పొడిని ఆ ప్రాంతంలో చల్లాడు.
రక్తంతో తడిసిన చొక్కా, ఇనుప సుత్తిని ఒక కవరులో వేసుకొని, ఫిరంగిపురం మండలం సిరిపురంలోని 30 అడుగుల లోతున్న బావిలో సుత్తి, చొక్కా పడేసి జడ్చర్ల వెళ్లి పోయాడు. గుంటూరులో హత్య కేసు నమోదు చేసిన పోలీసులు సిసిటీవీ ఫుటేజీలు పరిశీలించారు. ఘటనా స్థలంలో లభించిన ఆధారాలతో శ్రీనివాసరెడ్డి హత్య చేసినట్టు గుర్తించారు.
ఏఎస్పీ నచికేట్ షల్కే పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి. బుధవారం మధ్యాహ్నం నిందితుడు 113 తాళ్లూరులోని తన ఇంటికి వెళుతుండగా పోలీసులు అరెస్టు చేశారు. కన్నబిడ్డపై పెంచుకున్న మితిమీరిన ప్రేమ చివరకు హంతకుడిగా మార్చాయని పోలీసులు తెలిపారు.