Constable Killed: తుఫాను గాలులకు చెట్టు విరిగిపడి కానిస్టేబుల్ దుర్మరణం-a constable died when a tree fell due to stormy winds ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Constable Killed: తుఫాను గాలులకు చెట్టు విరిగిపడి కానిస్టేబుల్ దుర్మరణం

Constable Killed: తుఫాను గాలులకు చెట్టు విరిగిపడి కానిస్టేబుల్ దుర్మరణం

Sarath chandra.B HT Telugu
Dec 05, 2023 12:32 PM IST

Constable Killed: మిచాంగ్ తుఫాన్ గాలులకు చెట్టు విరిగిపడి కానిస్టేబుల్ మృతి చెందాడు భాకరాపేట సమీపంలో మలినేని పట్నం వద్ద బైక్‌పై ప్రయాణిస్తున్న కానిస్టేబుల్ చెట్టు విరిగి పడటంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

చెట్టు కూలి కానిస్టేబుల్ మృతి
చెట్టు కూలి కానిస్టేబుల్ మృతి

Constable Killed: ఏపీలో మిచాంగ్ తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. చెట్టు విరిగి కానిస్టేబుల్ దుర్మరణం పాలయ్యాడు. భాకరాపేట సమీపంలో మలినేనిపట్నం వద్ద బైక్ పై వెళ్తున్న కానిస్టేబుల్ పై చెట్టు విరిగిపడింది. ఈ ఘటనలో 2004 బ్యాచ్ కు చెందిన కానిస్టేబుల్ సత్యకుమార్ మృతి చెందారు. కానిస్టేబుల్ మృతదేహాన్ని రిమ్స్ మార్చురీకి తరలించారు.

తిరుపతి జిల్లాలో తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోటలో అత్యధికంగా 388 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మనుబోలు లో 366, చిల్లకూరు లో 350, నాయుడు పేటలో 271, బలయపల్లిలో 239, సైదాపురంలో 223, వెంకటాచలంలో 213 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది.

తిరుపతిలో భారీ వర్షాలు కురుస్తుండటంతో వరద బాధితులకు అండగా అవసరమైన ఏర్పాట్లను టిటిడి చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి చేపట్టారు. వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని, ఏ అవసరమొచ్చిన తక్షణమే తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచించారు. పూలవాని గుంట, గొల్లవాని గుంట ప్రాంతాల్లో వరద బాధితులను పరామర్శించారు.

పునరావాస కేంద్రాలకు తరలించిన వారితో పాటు అవసరమైన ప్రాంత ప్రజలకు పునరావాస కేంద్రాలకు రాలేని పరిస్థితి ఉన్నా సరే అలాంటి వారికి ఆహార పానియాలను అందజేయాలని తహశీల్దార్ వెంకట రమణను ఆదేశించారు.

తిరుపతిలో గత అనుభవాల దృష్ట్యా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టినట్టు చెప్పారు. ముందుస్తుగా వరద కాలువల్లో పూడిక తీయించామన్నారు. మరీ లోతట్టు ప్రాంతాల్లో మినహా వరద నీటి ఉదృతి చాలా వరకు తగ్గిందని, తిరుమలలో కూడా జలాశయాన్ని పూర్తిగా నిండాయని చెప్పారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించామన్నారు.

తిరుపతి చెన్నారెడ్డి కాలనీలో భారీ వర్షానికి రెండు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో రెండు కార్లు ధ్వంసం అయ్యాయి. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలో సున్నపువాగులో చిక్కుకున్న బండారు పల్లెకు చెందిన శివ, వెంకటేష్‌లను రక్షించేందుకు ఫైర్‌, రెవిన్యూ సిబ్బంది చర్యలు చేపట్టారు.

ఏపీలో భారీగా పునరావాస కేంద్రాలు…

తుఫాను నేపథ్యంలో ఏపీలోని ఎనిమిది జిల్లాల్లో 181 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 308 పునరావాస శిబిరాలు ఏర్పాటు చేశారు. సహాయ చర్యల కోసం ఐదు NDRF, ఆరు SDRF బృందాలు సిద్ధంగా ఉంచారు. నెల్లూరు, బాపట్ల, కృష్ణా, తిరుపతి, ప్రకాశంలో సహాయక బృందాలను ప్రభుత్వం మొహరించారు. ఖరీఫ్ పంటల సంరక్షణకు ఏపీ ప్రభుత్వ ప్రత్యేక చర్యలు చేపట్టింది.

తుఫాన్ ప్రభావిత ఎనిమిది జిల్లాలకు సీనియర్ IASల నియమించారు. భోజనం, వసతి, వైద్యంపై దృష్టి పెట్టాలని జగన్ ఆదేశించారు. శిబిరాల నుంచి ఇంటికి వెళ్లే వారికి 25 కిలోల బియ్యంతో పాటు వంట సామాగ్రి ఇవ్వాలని ఆదేశించారు. ఇల్లు కూలిన వారికి తక్షణ సాయంగా రూ.10 వేలు అందించనున్నారు. 192 పునరావాస కేంద్రాలకు 7,361 మంది తరలించారు.

మరోవైపు తుఫాను నష్టంపై సిఎస్ జవహర్ రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. తుఫాన్ ప్రభావం పై అప్రమత్తంగా ఉన్నామని, ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సీఎం వై ఎస్ జగన్ ఆదేశించారని వివరించారు. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అత్యధికంగా వర్షాలు కురుస్తున్నాయని, రాష్ట్రంలో ని అన్ని ప్రాంతాల్లోనూ వర్షపాతం నమోదు అవుతోందని చెప్పారు.

8 జిల్లాలకు సీనియర్ ఐ ఏ ఎస్ అధికారులను పంపించామని చెప్పారు. రేపు సాయంత్రం వరకు వర్షాలు కురుస్తాయని, తుఫాను సహాయ చర్యల కోసం 22 కోట్లు తక్షణ సహాయ చర్యలు కోసం విడుదల చేశామని చెప్పారు. రాష్ట్రంలో లక్ష టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని, 4 లక్షల టన్నుల ధాన్యాన్ని తడవకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు.

రాష్ట్ర వ్యాప్తంగా 11 వేల మంది పునరావాస కేంద్రాల్లో ఉన్నారని, అందరికి ఆహారం, నిత్యావసరాలు, ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు చెప్పారు. తుఫాన్ ప్రభావం తో కలిగే నష్టాన్ని వెంటనే అంచనా వేసి కేంద్రానికి పంపిస్తామని, వర్షాలు అధికంగా ఉన్న చోట పాఠశాలలకు సెలవు ప్రకటించామని చెప్పారు.

Whats_app_banner