LeopardKilled: కోతుల వలలో చిక్కి ప్రాణాలు కోల్పోయిన చిరుత
LeopardKilled: కోతుల నుంచి పంటపొలాలను రక్షించుకోడానికి ఏర్పాటు చేసిన వలలో చిక్కుకున్న చిరుత చివరకు ప్రాణాలు కోల్పోయింది.
LeopardKilled: పంటల్ని నాశనం చేస్తున్న కోతుల నుంచి రక్షణ కోసం రైతులు ఏర్పాటు చేసుకున్న వలలో చిక్కిన చిరుత పులి చివరకు ప్రాణాలు పోగొట్టుకుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం ఎల్లవరం గ్రామ శివారులో ఈ ఘటన చోటుచేసుకుంది.
బుధవారం రాత్రి అడవి జంతువుల కోసం వచ్చిన చిరుత చెట్టుపై ఏర్పాటు చేసిన వలలో చిక్కుకు పోయింది. వల నుంచి విడిపించుకునే క్రమంలో పొలం గట్టుపైనున్న చెట్టు కొమ్మల్లో తలకిందులుగా ఇరుక్కుపోయింది. చెట్టుకు వేలాడుతున్న చిరుతను గమనించిన రైతులు అటవీ అధికారులతో పాటు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు.
రంపచోడవరం డివిజన్ అటవీశాఖ డీఎఫ్‌వో నరేంద్రియన్ పర్యవేక్షణలో విశాఖపట్నం జూ నుంచి వచ్చిన రెస్క్యూ బృందం ఎల్లవరం గ్రామానికి చేరుకొని చిరుతకు మత్తు మందు ఇచ్చి బంధించారు. ఆ తర్వాత వైద్య పరీక్షలు చేసే సమయానికి అది మృతి చెందినట్లు గుర్తించారు.
వలల చిక్కిన తర్వాత పెనుగులాటలో గాయాలతో పాటు నీరు, ఆహారం లేక పోవడంతో నీరసించి ఉంటుందని అటవీ సిబ్బంది వివరించారు. తెల్లవార్లు గాల్లో తలకిందులుగా వేలాడటంతో రక్త సరఫరా సాఫీగా సాగక మృతి చెందిందని అటవీ శాఖ వెటర్నరీ అసిస్టెంట్ పురుషోత్తం తెలిపారు.
చిరుత చిక్కుకున్న పొలానికి దగ్గర్లోనే ఫారెస్ట్ అధికారులు దహన సంస్కారాలు నిర్వహించారు. గ్రామస్తులు సమాచారం అందించిన వెంటనే అటవీ సిబ్బంది స్పందించి ఉంటే చిరుత ప్రాణాలతో ఉండేదని రైతులు ఆరోపిస్తున్నారు. తీవ్ర జాప్యం జరగడం, సకాలంలో వైద్యం అందించకపోవడంతోనే మృతి చెంది ఉంటుందని ఆరోపిస్తున్నారు.