AP Wine Shop Tenders 2024 : వైన్ షాపుల డ్రా ఎలా తీస్తారు.. ఎలా కేటాయిస్తారు.. ముఖ్యమైన 10 అంశాలు ఇవే
AP Wine Shop Tenders 2024 : ఏపీ మద్యం షాపులను దక్కించుకోవడానికి చాలామంది ముందుకొస్తున్నారు. ఇప్పటికే భారీగా దరఖాస్తులు వచ్చాయి. అప్లై చేయడానికి ఇంకా సమయం ఉంది. మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అసలు లాటరీ ఎలా తీస్తారు.. షాపులు ఎలా కేటాయిస్తారో ఓసారి చూద్దాం.
ఆంధ్రప్రదేశ్‌లో వైన్ షాపుల లెసెన్సుల కోసం దరఖాస్తులు భారీగా వస్తున్నాయి. ఇప్పటికే 57 వేల 709 దరఖాస్తులు అందాయి. ఇవాళ, రేపు మరో 40 వేల వరకూ దరఖాస్తులు వచ్చే అవకాశముందని ఎక్సైజ్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రూ. 1,154.18 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. అటు డ్రా తీయడానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో.. అసలు లాటరీ ఎలా తీస్తారు.. మద్యం దుకాణాలను ఎలా కేటాయిస్తారనే చర్చ జరుగుతోంది.
లాటరీ ప్రక్రియ ఇలా..
1.ప్రభుత్వం నోటిఫై చేసిన షాపులకు నంబర్లు కేటాయిస్తారు. జనాభా, ఏరియా ప్రాతిపదిక వాటిని రుసుం నిర్ణయిస్తారు. దాని ప్రకారం టెండర్ వేయాలి.
2.16వ తేదీన లాటరీ (డ్రా) తీయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతీ జిల్లా కేంద్రంలో లాటరీ తీస్తారు.
3.జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, జిల్లా ఎక్సైజ్ అధికారి ఆధ్వర్యంలో డ్రా తీస్తారు. మీడియా ప్రతినిధులకు కూడా అనుమతి ఉంటుంది. (అధికారుల ఆంక్షలు లేకపోతే సాధారణ ప్రజలను కూడా అనుమతిస్తారు.)
4.జిల్లాలో ఉన్న వైన్ షాపుల సీరియల్ నంబర్ ఆధారంగా డ్రా తీయడం మొదలు పెడతారు. ఎవరు ఎక్కువ కోడ్ చేస్తే.. వారికి వైన్ షాప్ దక్కినట్టు ప్రకటిస్తారు. దీనిపై అభ్యంతరం ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి వెంటనే తీసుకెళ్లవచ్చు.
5.లాటరీ బాక్స్‌లలో షాప్‌ల నంబర్లు, వాటికి కోడ్ చేసిన వారి వివరాలు ఉంటాయి. షాప్ దక్కించుకున్న వారి వివరాలను అధికారులు ప్రకటిస్తారు.
6.రెండేళ్ల కాల వ్యవధికి వీటిని కేటాయిస్తారు. మద్యం దుకాణాన్ని దక్కించుకున్నవారు ప్రభుత్వ నిబంధనలు పాటించాలి. లేకపోతే రద్దు చేస్తారు.
7.మద్యం దుకాణం దక్కించుకున్న వారు నాలుగు వాయిదాల్లో కోడ్ చేసిన డబ్బును చెల్లించాలి. రెండేళ్లలో నాలుగు వాయిదాలు ఉంటాయి. మొదటి విడత (1/4) చెల్లించిన తర్వాతే వ్యాపారానికి అనుమతి ఇస్తారు.
8.మొదటి విడత డబ్బు చెల్లించకపోతే.. ఆ దుకాణాన్ని వేరేవారికి కేటాయిస్తారు. (డబ్బులు కోడ్ చేసిన ఆధారంగా)
9.ప్రభుత్వం నోటిఫై చేసిన షాపుల్లో 15 శాతం గౌడ కులస్తులకు కేటాయించారు. వారు ఆసక్తి చూపకపోతే.. వేరే వారికి కేటాయిస్తారు.
10.తొలుత నగరపాలక సంస్థలు, ఆ తర్వాత మున్సిపాలిటీలు, వాటి తర్వాత నగర పంచాయతీలు, ఆ తర్వాత గ్రామాల్లో ఉన్న షాపులకు సంబంధించి డ్రా తీసే అవకాశం ఉంది.
ఎన్టీఆర్ జిల్లాలోనే ఎక్కువ..
ఎన్టీఆర్ జిల్లాలో 113 దుకాణాల లైసెన్స్ కోసం అత్యధికంగా 4 వేల 420 దరఖాస్తులు వచ్చాయి. తర్వాతి స్థానంలో ఏలూరు జిల్లాలో 144 దుకాణాలకు 3 వేల 843 దరఖాస్తులు అందాయి. మూడో స్థానంలో విజయనగరం జిల్లా ఉంది. ఇక్కడ 153 దుకాణాలకు 3 వేల 701 దరఖాస్తులు వచ్చాయి. పశ్చిమగోదావరి జిల్లాలో 175 దుకాణాలకు 3 వేల 513 దరఖాస్తులు వచ్చాయి.
ఈ రెండు షాపులకే డిమాండ్..
ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలంలో రెండు దుకాణాలను నోటిఫై చేశారు. వాటిలో 96వ నంబరు దుకాణానికి 110, 97వ నంబరు దుకాణానికి 107 చొప్పున దరఖాస్తులు వచ్చాయి. కేవలం వీటి దరఖాస్తు రుసుము రూపంలోనే రూ. 4.22 కోట్ల ఆదాయం వచ్చింది. రాష్ట్రంలో ఎక్కువ పోటీ ఉన్నది ఈ దుకాణాలకే కావడం గమనార్హం.