Zaheerabad : రైతుల కోసం ప్రాణాలైనా అడ్డేస్తాం... ఫార్మా సిటీకి భూములు దక్కకుండా పోరాడుతాం - హరీశ్ రావు
03 October 2024, 22:17 IST
- ప్రాణాలైనా అడ్డేస్తాం కానీ ఫార్మా సిటీకి భూములివ్వమని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. జహీరాబాద్ లోని న్యాల్కల్ లో ఫార్మా సిటీకి వ్యతిరేకంగా రైతులు చేపడుతున్న ఆందోళనకు మద్దతు తెలిపారు. రైతుల భూములను కాపాడేందుకు న్యాయ పోరాటం కూడా చేస్తామని చెప్పారు.
జహీరాబాద్ లో రైతుల ఆందోళన
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని న్యాల్కల్ లో బంగారం లాంటి పంటలు పండే భూముల్లో ఫార్మా సిటీ ఎందుకని మాజీ మంత్రి హరీష్ రావు రేవంత్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఫార్మా సిటీని ఏర్పాటు చేసి మంజీరా నదిని కలుషితం చేస్తావా అని ప్రశ్నించారు. న్యాల్కల్ లో ఫార్మా సిటీకి వ్యతిరేకంగా రైతులు చేపడుతున్న ఆందోళన కార్యక్రమంలో ఈ రోజు హరీష్ రావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… న్యాల్కల్ లో ఫార్మా సిటీ పేరిట 2 వేల ఎకరాలు గుంజుకుంటే బిఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని హరీష్ రావు హెచ్చరించారు. జేసిబి, పోక్లెయిన్ వస్తే మీ ఎమ్మెల్యేతో పాటు తాను అడ్డంగా ఉంటానని చెప్పారు. ప్రాణాలైనా అడ్డు పెట్టి ఫార్మా సిటీకి మీ భూములు పోకుండా కాపాడుతామని హామీ ఇచ్చారు. రైతుల భూములు కాపాడడం కోసం గ్రీన్ ట్రిబ్యునల్, హై కోర్టుకు వెళ్తామని హరీశ్ రావు హెచ్చరించారు. రైతుల పోరాటానికి తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఫార్మా సిటీ పెట్టి పాల లాంటి మంజీరా నీళ్ళల్లో విషపు చుక్కలు కలుపుతవా అని హరీశ్ రావు ప్రశ్నించారు. ఇక్కడ భూముల్లో ఫార్మా చిచ్చు పెట్టవద్దన్నారు. ఫార్మా వల్ల ఇక్కడి నక్క వాగు,పెద్ద వాగు, చెరువులు, చాకలి వాగు, కోట వాగు, మంజీర కలుషితం అవుతాయని తెలిపారు. ఫార్మా సిటీ ఏర్పాటు చేసి మెదక్, హైద్రాబాద్ ప్రజలకు కలుషిత నీరు అందిస్తారా? అని ఆయన నిలదీశారు .
రేవంత్ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని ఆరోపించారు. ఇందిరమ్మ గరీబి హటావో అంటే, రేవంత్ రెడ్డి కిసాన్ హటావో, అంటున్నారని విమర్శలు చేశారు. పేదల ఇల్లు కులగొట్టుడు, భూములు కొల్ల గొట్టుడు.. ఇదేనా ఇందిరమ్మ పాలన అని నిలదీశారు. ఇది డూప్లికేట్ ఇందిరమ్మ రాజ్యం అని దుయ్యబట్టారు.
“భూములు లాక్కోవడం కోసం చీకట్లో సంతకాలు పెట్టిస్తారు. జాగ్రత్తగా ఉండండి. మోస పోకండి” అని రైతులకు హరీశ్ రావు హెచ్చరించారు. ఎవరన్నా వస్తే ఒక్క ఫోన్ చేయండి రెండు గంటల్లో వస్తామని భరోసానిచ్చారు. హైదరాబాద్ శివారులో ఫార్మా సిటీ ఏర్పాటు చేయకుంటే ఆ భూములు రైతులకు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాళ్లు, రప్పలు ఉన్న భూములో ఫ్యాక్టరీలు పెట్టాలని… పంటలు పండే భూముల్లో కాదని హరీష్ హితవు పలికారు.