Opinion: అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్ష పార్టీలు ఎవరి పక్షం?
23 June 2023, 11:40 IST
- ‘ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో ఉనికి కోల్పోయిన వామపక్షాలకు మునుగోడు విజయం ఊపిరి పోసిందని, ఇక తెలంగాణలో పునర్వైభవం పొందుతామనే ఆ పార్టీల నేతల ఆశలు ప్రస్తుత రాజకీయ పరిణామాలతో ఆవిరవుతున్నాయి..’ - పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ రీసెర్చర్ ఐవీ మురళీకృష్ణ శర్మ విశ్లేషణ.
హైదరాబాద్‌లో ఏప్రిల్‌లో జరిగిన వామపక్ష పార్టీల సమావేశంలో సీపీఐ నేతలు డి.రాజా, నారాయణ, సీపీఎం సీతారాం ఏచూరి, తమ్మినేని వీరభద్రం తదితరులు
‘‘పోరాటాలకు అడ్డా అయిన తెలంగాణ గడ్డపై భారతీయ జనతా పార్టీని నిలువరించడమే మా ప్రధాన లక్ష్యం. భేషజాలకు పోకుండా ఆ పార్టీని అడ్డుకునే శక్తి ఉన్న ఏ పార్టీకైనా మద్దతిస్తాం....’’ అని మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా వామపక్ష పార్టీలు బీఆర్‌ఎస్‌కు భేషరతుగా బాసటగా నిలిచాయి. వామపక్షాలు కోరుకున్న విధంగానే మునుగోడులో బీజేపీకి భంగపాటు ఎదురైన తర్వాత సీపీఐ(ఎం), సీపీఐ పార్టీలకు అసలు సిసలైన పరీక్ష మొదలయ్యింది. మునుగోడులో బీఆర్‌ఎస్ విజయం తమ మద్దతు వల్లే సాధ్యమయ్యిందని వామపక్ష పార్టీలు ఏకధాటిగా ప్రచారం చేసుకున్నాయి.
ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో ఉనికి కోల్పోయిన వామపక్షాలకు మునుగోడు విజయం ఊపిరి పోసిందని, ఇక తెలంగాణలో పునర్వైభవం పొందుతామనే ఆ పార్టీల నేతల ఆశలు ప్రస్తుత రాజకీయ పరిణామాలతో ఆవిరవుతున్నాయి. మునుగోడు విజయంతో రాష్ట్రంలో రాజకీయంగా బలపడుదామనుకున్న వామపక్షాలకు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఇతర విధాలుగా సహాయసహకారాలు అందిస్తున్నా రాబోయే ఎన్నికల్లో టికెట్ల విషయంలో మాత్రం ఆచితూచి అడుగులేస్తుండడంతో వామపక్ష పార్టీలకు కేసీఆర్ వ్యూహాలు అంతుచిక్కడం లేదు.
ఆరు నెలల్లో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీలు సర్వశక్తులతో సిద్ధమవుతుంటే వామపక్ష పార్టీలు మాత్రం కేసీఆర్ పిలుపు కోసం ఎదురు చూస్తుండడం రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్య పరుస్తోంది. రాష్ట్రం నలుమూలల బలమైన క్యాడర్ కలిగున్న వామపక్షాలు పొత్తులో భాగంగా బీఆర్‌ఎస్ ఏయే సీట్లు కేటాయిస్తుందో మల్లగుల్లాలు పడడం వారి రాజకీయ మనుగడకే ప్రశ్నార్థకంగా మారనుంది.
గందరగోళంలో వామపక్షాలు
ప్రత్యేక తెలంగాణ మలి ఉద్యమం వామపక్షాలలో గందరగోళం నింపింది. సీపీఐ(ఎం), సీపీఐ పార్టీలు చెరో బాటలో పయనించాయి. సీపీఐ(ఎం) భాషా ప్రయుక్త రాష్ట్రాలకు కట్టుబడగా, సీపీఐ ప్రత్యేక తెలంగాణకు మద్దతిచ్చింది. ప్రత్యేక రాష్ట్రం సెంటిమెంట్‌తో పార్టీ క్యాడర్ చిన్నాభిన్నం కావడంతో ముఖ్యంగా సీపీఐ(ఎం)కు తెలంగాణలో రాజకీయంగా గట్టి ఎదురు దెబ్బే తగిలింది. 2014లో ప్రత్యేక రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో సీపీఐ(ఎం) భద్రాచలంలో, సీపీఐ దేవరకొండలో విజయం సాధించగా, అనంతరం సీపీఐ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ రమావత్ బీఆర్‌ఎస్ పక్షాన చేరారు.
2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ నేతృత్వంలోని మహాకూటమితో కలిసి బరిలోకి దిగినా సీపీఐకి భంగపాటు తప్పలేదు. సీపీఐ(ఎం) వ్యూహాలు మరో విధంగా సాగాయి. సీపీఐ(ఎం) ఎన్నికల ముందు పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మహాజన పాదయాత్ర చేపట్టింది. పాదయాత్రలో వచ్చిన స్పందనతో తమకు మళ్లీ మంచిరోజులొచ్చాయని ఉబ్బితబ్బిపోయిన సీపీఐ(ఎం) ఇకపై స్వశక్తిగా బలపడాలనే తలంపుతో తమకు సానుకూలమైన పక్షాలను కలుపుకొని బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్‌ఎఫ్) పేరిట ఒక ప్రత్యేక కూటమి ఏర్పాటు చేసి గత అసెంబ్లీ ఎన్నికల్లో చేతులు కాల్చుకుంది.
రెండు ఎన్నికల్లో ఎవరి మార్గాల్లో వారు పయనించి తలబొప్పికట్టించుకొని ఇకమీదట కలిసికట్టుగా ఉండాలని నిర్ణయించుకొని కొనసాగుతున్న వేళ మునుగోడు ఉప ఎన్నికలు వారికి ఒక వరంగా వచ్చాయి. మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలతో బీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకొని టికెట్లపై బేరసారాలు చేయవచ్చనుకుని వామపక్షాలు భావించాయి. కానీ కేసీఆర్ ఆచితూచి వ్యవహరిస్తుండడంతో సీపీఐ(ఎం), సీపీఐ పార్టీలలో ఒకింత గందరగోళం నెలకొని పార్టీ కార్యకర్తలలో రోజురోజుకు అసహనం పెరుగుతోంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ రీత్యా వామపక్షాలలో ప్రధానంగా సీపీఐ(ఎం)లో ఏర్పడ్డ గందరగోళం ఇంకా కొనసాగుతుండడంపై వామపక్షాల కార్యకర్తలతో పాటు పార్టీ సానుభూతిపరుల్లో కూడా నైరాశ్యం నెలకొంది.
ఎదురుచూపుల్లో వామపక్షాలు
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌తో పొత్తు ఉంటుందని మానసికంగా సిద్దమైన వామపక్షాల యంత్రాంగం అందుకు సమాయత్తమవుతున్న వేళలో కేసీఆర్ ఎత్తుగడలు వామపక్షాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. బీఆర్‌ఎస్‌తో పొత్తులో భాగంగా పదిహేను సీట్ల వరకు డిమాండ్ చేయాలని వామపక్షాలు ప్రణాళికలు రూపొంచించుకున్నట్టు మొదట్లో ప్రచారం జరిగింది. కాలక్రమేణ ఆ డిమాండ్ ఒకసారి పది స్థానాలకి, మరోసారి అరడజను స్థానాలకు పరిమితమయినట్టు వార్తలొచ్చినా, చివరికి ఉభయ పార్టీల ప్రధాన నేతలకు చెందిన రెండు స్థానాలపైన అయినా అవగాహన కుదురుతుందా అనే ప్రశ్నలొస్తున్నాయి.
బీఆర్‌ఎస్‌లోనే టికెట్ల కోసం అంతర్గతంగా తీవ్ర పోటీ నెలకొని ఉండడంతో కేసీఆర్ వామపక్షాల కోసం ఆలోచిస్తారనుకోవడం ఊహాజనితమని బీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అదీగాక వామపక్షాలు పట్టున్న ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాలో బీఆర్‌ఎస్‌లో టికెట్ల కోసం సిగపట్లు నడుస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో ఎన్నికలు భారీ ఖర్చులతో కూడికొని ఉండడంతో కేసీఆర్ వామపక్షాలకు పొత్తులో భాగంగా వారికి అసెంబ్లీ సీట్ల కేటాయింపుపై ఆసక్తిగా లేరని, భవిష్యత్తులో చెరో ఎమ్మెల్సీ స్థానాలు కేటాయించవచ్చనే ప్రచారం జరుగుతున్నా దీనిపై ఇటు బీఆర్‌ఎస్, అటు వామపక్షాలు స్పందించ లేదు.
మరోవైపు బీఆర్‌ఎస్‌తో పొత్తులపై కేసీఆర్‌తో ప్రత్యక్షంగా చర్చించేందుకు సీపీఎం, సీపీఐ పార్టీలు సిద్ధమవుతున్న వేళ వామపక్షాలు పోటీ చేయాలనుకుంటున్న పట్టున్న బెల్లంపల్లి, హుస్నాబాద్ వంటి స్థానాల్లో మంత్రి కేటీఆర్ పర్యటించి సిట్టింగ్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునివ్వడంతో వామపక్షాలు ఖంగుతిన్నాయి. ఇదే వాతావరణం పలు నియోజకవర్గాలలో కూడా ఉండడంతో కేసీఆర్‌పై వామపక్షాల్లో పలు అనుమానాలు మొదలయ్యాయి. కేసీఆర్‌కు తెలియకుండానే కేటీఆర్ ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారా..? లేక వామపక్షాలను పట్టించుకోవడం లేదా..? అనే సందేహాలు సీపీఐ, సీపీఐ(ఎం) వర్గాల్లో మొదలయ్యాయి. ఇప్పటికైనా ఎదురుచూపులు చూడకుండా పొత్తులపై తాడోపేడో తేల్చుకోవాని సీపీఐ(ఎం), సీపీఐ కిందస్థాయి కార్యకర్తలు అగ్రనేతలపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు.
ఏ గట్టున ఉంటారో..?
బీజేపీ విస్తరణను అడ్డుకోవడమే లక్ష్యంగా బీఆర్‌ఎస్‌కు మద్దతిస్తున్నామని వామపక్షాలు గతంలో చెప్పుకున్నా, రాష్ట్రంలో ప్రస్తుతం మారుతున్న రాజకీయ పరిస్థితులతో వామపక్షాలకు పలు సవాళ్లు ఎదురవుతున్నాయి. దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో, గ్రేటర్ ఎన్నికల్లో పుంజుకున్న బీజేపీ రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా గతంలో కనిపించినా... మునుగోడు ఉప ఎన్నికల ఫలితం, కర్ణాటక అసెంబ్లీ ఫలితాల అనంతరం ఇక్కడ బీజేపీ చతికిలపడడంతో, ఆ స్థానంలో కాంగ్రెస్ బలపడుతోంది.
ఈ పరిణామాల మధ్య బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌కు చేదోడుగా ఉంటున్నామని చెప్పుకుంటున్న వామపక్షాలు ఇప్పుడు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా అడుగులు వేస్తాయా..? దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీని అడ్డుకునేందుకు వామపక్షాలతో సహా పలు పార్టీలు కాంగ్రెస్‌తో ఒక అవగాహనకు సిద్ధమవుతూ శుక్రవారం (జున్ 23న) నిర్వహించిన ప్రతిపక్షాల ఐక్యతా సమావేశానికి బీఆర్‌ఎస్‌ను ఆహ్వానించలేదు.
ఈ రాజకీయ పరిణామాల వేళ స్థానిక సీపీఎం, సీసీఐ తెలంగాణలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌తో జతకడుతాయా..? లేదా బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్‌తో కలిసి నడుస్తాయా..? లేదా జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌తో, రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌తో దోస్తీ చేస్తారా..? లేదా ఒంటరిగా పోటీ చేస్తాయా..? అని రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా గమనిస్తున్నారు.
మరో చారిత్రక తప్పిదమంటారా..?
వామపక్షాల చరిత్రలో చారిత్రక తప్పిదాలనేవి ఒక పరిపాటిగా మారాయి. తమ సొంత బలంతో పార్టీ నిర్మాణం, ఎన్నికల్లో పోరాడటం అంశాలపై అస్త్రసన్యాసం చేస్తున్నాయి. రాష్ట్రంలో పాలక బీఆర్‌ఎస్ నియంత పోకడలపై, అవినీతిపై, ప్రజా సంక్షేమ పథకాలలో అవకతవకలపై పలు విమర్శలున్నాయి. ప్రజా పోరాటమే లక్ష్యంగా చెప్పుకునే వామపక్షాలు ఉద్యమాలను వదిలేసి బీజేపీ బూచిని చూపిస్తూ ఎవరో ఒకరి పంచన చేరడం అలవాటుగా మారింది.
మునుగోడు ఎన్నికల ముందు రాష్ట్రంలో అనేక ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించిన వామపక్షాలు, అనంతరం రాష్ట్ర ప్రభుత్వం కంటే కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగానే పెద్ద ఎత్తున ఉద్యమించడం ఇక్కడ గమనార్హం. రాష్ట్రంలోని బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రకటనలకే పరిమితమైన ఈ వామపక్షాలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాత్రం భారీ నిరసనలు చేపడుతున్నారు.
ఏ ప్రభుత్వమైనా ప్రజా వ్యతిరేక విధానాలను చేపడితే వాటిని ఎండగట్టడంలో వివక్ష ఉండకూడదని పలు సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రజాహితమే మా లక్ష్యం అని చెప్పుకునే వామపక్షాలు అవకాశవాద రాజకీయాల కోసం రాజీ పడకుండా ప్రజాపక్షం వైపు ఉంటారా..? లేదా ఎన్నికలే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకొని అనంతరం మరో చారిత్రక తప్పిదమంటారా..? కాలమే నిర్ణయిస్తుంది.
- ఐ.వి.మురళీ కృష్ణ శర్మ
పీపుల్స్‌పల్స్ రీసెర్చ్ సంస్థ
(డిస్‌క్లెయిమర్: వ్యాసంలో తెలియపరిచిన అభిప్రాయాలు, విశ్లేషణలు వ్యాసకర్త వ్యక్తిగతం. లేదా తాను ప్రాతినిథ్యం వహిస్తున్న సంస్థవి మాత్రమే. హిందుస్తాన్ టైమ్స్‌వి కావు..)