తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Kesamudram Accident: బావి తవ్వుతుండగా.. కూలిన మట్టి దిబ్బలు, మట్టిలో కూరుకుని నరకయాతన..

Kesamudram Accident: బావి తవ్వుతుండగా.. కూలిన మట్టి దిబ్బలు, మట్టిలో కూరుకుని నరకయాతన..

HT Telugu Desk HT Telugu

04 April 2024, 7:31 IST

google News
    • Kesamudram Accident: సాగు నీటి కోసం బావి తవ్వుతుండగా.. అనుకోని ప్రమాదం జరిగింది. బావి గడ్డపై మట్టి దిబ్బలు కూలగా.. లోపల దిగి పని చేస్తున్న ఓ రైతుతో పాటు మరో కూలీ ఇద్దరూ మట్టిలో కూరుకుపోయారు.
బావి తవ్వుతూ  మట్టిపెళ్లల్లో చిక్కుకున్న రైతు, కూలీ
బావి తవ్వుతూ మట్టిపెళ్లల్లో చిక్కుకున్న రైతు, కూలీ

బావి తవ్వుతూ మట్టిపెళ్లల్లో చిక్కుకున్న రైతు, కూలీ

Kesamudram Accident: చావు అంచుల దాకా వెళ్లిన ఇద్దరిని చుట్టుపక్కల వారు గమనించి, అతి కష్టం మీద బయటకు తీశారు. మట్టి కింద చిక్కుకున్న వారిని గ్రామస్తుల సాహసంతో రక్షించడంతో కొద్దిపాటి గాయాల బారిన పడి వారు బతికి బయటపడ్డారు

త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న ఆ ఇద్దరు మృత్యుంజయులుగా నిలిచారు. ఈ ఘటన మహబూబాబాద్ Mahabubabad జిల్లా కేసముద్రం kesamudram మండలంలో జరిగింది. రెండు రోజుల కిందట జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం గాంధీనగర్ గ్రామానికి చెందిన సుధాకర్ అనే రైతు వ్యవసాయం మీద అధారపడి జీవిస్తున్నాడు. ఈ సంవత్సరం కొంత కరువు పరిస్థితులు ఉండటంతో తన వ్యవసాయ భూమిలోనే Agriculture well బావి తవ్వే పనలు ప్రారంభించాడు.

జేసీబీ JCBతో పనులు ప్రారంభించగా.. దాదాపు 50 అడుగుల వరకు బావిని తవ్వారు. కాగా బావి తవ్వుతున్న క్రమంలో అడుగు భాగంలో జేసీబీకి ఓ రాయి తగిలింది. దానిని పరిశీలించేందుకు రైతు సుధాకర్ తో పాటు నరేశ్ అనే కూలీ కూడా లోపలికి దిగారు.

ఒక్క సారిగా కూలిన మట్టి దిబ్బలు

సుధాకర్, నరేశ్ ఇద్దరూ బావి లోపలికి దిగి పరిశీలిస్తున్న క్రమంలో ఒక్కసారిగా పైనున్న మట్టి దిబ్బలు వారిపై కూలాయి. ఒడ్డుపై ఉన్న మట్టి మొత్తం వారి మీద పడటంతో వారు నడుంలోతుకు పైగా కూరుకుపోయారు. ఒక్కసారిగా మట్టి వారిపై కూలడంతో అసలు ఏం జరుగుతుందో కూడా వారికి అర్థం కాని పరిస్థితి నెలకొంది. వారి దాని నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నం చేస్తుండగానే మరోసారి మట్టి దిబ్బలు వారిపై కూలాయి. దీంతో ఇద్దరూ మెడ వరకు కూరుకుపోయారు.

దాదాపు చావు అంచుల వరకు వెళ్లిన ఇద్దరు ఆర్తనాదాలు చేయడం మొదలు పెట్టారు. ఆ పక్కనే జాటోత్ వెంకన్న అనే వ్యక్తి ఆ విషయాన్ని గమనించి, చుట్టుపక్కల వారితో పాటు కేసముద్రం పోలీసులకు కూడా సమాచారం అందించాడు. దీంతో గాంధీనగర్ గ్రామస్థులతో పాటు పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు.

2 గంటలపాటు నరకయాతన

మెడ వరకు కూరుకుపోవడం, మట్టి దిబ్బలు, రాళ్లు బలంగా తాకడంతో ఇద్దరికీ గాయాలయ్యాయి. దీంతో ఓ వైపు గాయాల అవస్థ.. మరోవైపు ప్రాణ భయంతో ఇద్దరూ నరకయాతన అనుభవించారు. దిక్కుతోచని స్థితిలో ఆర్తనాదాలు చేయగా.. గ్రామస్థులు, పోలీసులు అక్కడే ఉన్న జేసీబీ సాయంతో ఇద్దరినీ బయటకు తీసేందుకు ప్రయత్నం చేశారు.

మెషీన్ తో మట్టి తోడుతున్న క్రమంలో మరింత మట్టి కూలే ప్రమాదం ఉండటంతో కొందరు గ్రామస్థులు సాహసం చేశారు. ప్రమాదకరంగా ఉన్న మట్టి దిబ్బల మధ్య నుంచి బావిలోకి దిగి పారలతో మట్టిని తోడారు.

ముందుగా వారికి ఊపిరి ఆడేందుకు వీలుగా మెడ వరకు కప్పేసిన మట్టిని తొలగించారు. అనంతరం దాదాపు రెండు గంటల పాటు శ్రమించి, సుధాకర్ తో పాటు నరేశ్ ను బయటకు తీశారు. అప్పటికే అక్కడికి చేరుకున్న వారి కుటుంబ సభ్యులు భయంతో బోరున విలపించడం మొదలుపెట్టారు.

మృత్యువును జయించి బయటకు

మట్టి దిబ్బలు కూలిన ప్రమాదంలో నరేష్ అనే కూలీకి కాలు విరిగి పోగా, రైతు సుధాకర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో ఇద్దరినీ వెంటనే ఆసుపత్రికి తరలించి, ట్రీట్మెంట్ అందించారు. దాదాపు రెండు గంటల పాటు మట్టి దిబ్బల్లో కూరుకుపోయి నరకం అనుభవించిన.. ఆ ఇద్దరూ మృత్యువును జయించి బయట పడ్డారు.

వారు బతికి బయట పడటంలో గ్రామస్థులతో పాటు స్థానిక పోలీసులు కూడా తీవ్రంగానే శ్రమించారు. దాదాపు రెండు గంటల పాటు మట్టి దిబ్బల మధ్య సాహసం చేసి, ఇద్దరినీ బయటకు తీయడంతో కథ సుఖాంతమైంది. కాగా ఇద్దరినీ బయటకు తీసేందుకు శ్రమించిన వ్యక్తులను గ్రామస్థులు అభినందించారు.

(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

తదుపరి వ్యాసం