Chetabadi Murders: మంత్రాల నెపంతో తల్లీ కొడుకుల దారుణ హత్య.. మహబూబాబాద్ జిల్లా గూడూరులో ఘోరం
14 February 2024, 8:55 IST
- Chetabadi Murders: మంత్రాలు చేస్తున్నారనే అనుమానం తల్లీకొడుకుల Mother and Son ప్రాణాలు తీసింది. తన కుటుంబానికి మంత్రాలు చేస్తున్నారనే అనుమానం పెంచుకున్న ఓ వ్యక్తి ఇద్దరినీ హతమార్చాడు.
మంత్రాల నెపంతో హత్యకు గురైన తల్లీ కుమారులు
Chetabadi Murders: చేతబడి అనుమానంతో అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై రాడ్ తో కొట్టి ఇద్దర్నీ చంపేసిన ఘటన మహబూబాబాద్‌లో జరిగింది. ఈ దారుణ ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు బస్టాండ్ సమీపంలో మంగళవారం జరిగింది.
స్థానికులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. గూడూరు మండలంలోని బొల్లెపెల్లికి చెందిన శివరాత్రి కుమార్ ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఇంట్లో కుటుంబ పరిస్థితులు బాగోలేకపోవడం, పిల్లలకు ఆరోగ్యం బాగుండటం లేదనే ఉద్దేశ్యంతో తన కుటుంబానికి అదే గ్రామానికి చెందిన ఆలకుంట కొమురయ్య, సమ్మక్క(55), కుటుంబసభ్యులు మంత్రాలు చేశారని అనుమానం పెంచుకున్నాడు.
ఈ విషయంలో కొంతకాలంగా వారి కుటుంబంతో గొడవ పడుతూనే ఉన్నాడు. దీంతో కొమురయ్య కుటుంబ సభ్యులు గ్రామ పెద్ద మనుషులను ఆశ్రయించగా.. పలుమార్లు ఇరువురి మధ్య పంచాయితీ కూడా నిర్వహించారు. ఇద్దరికీ పెద్ద మనుషులు సర్ది చెప్పి పంపించారు. ఇదిలాఉంటే వారం కిందట మంత్రాల నెపంతో ఇద్దరి మధ్య మళ్లీ గొడవ జరిగింది. దీంతో గూడూరు పోలీస్ స్టేషన్ లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు.
నడిరోడ్డుపై దారుణంగా హత్య
రెండు రోజుల క్రితం కొమురయ్య కొడుకు సమ్మయ్య(40) కూతురు ఎంగేజ్ మెంట్ ఉండటంతో పోలీసులు కేసును సోమవారం తర్వాత చూస్తామని చెప్పి పంపించారు. దీంతో మంగళవారం ఉదయం 11 గంటలకు కొమురయ్య, సమ్మక్క, వారి కొడుకు సమ్మయ్య, శివరాత్రి కుమార్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి వస్తూ బస్టాండ్ సమీపంలో గొడవ పడ్డారు.
ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో ఆటో డ్రైవర్ కుమార్ కోపంతో రగిలిపోయాడు. అదే కోపంలో రోడ్డుపై అందరూ చూస్తుండగానే తన ఆటోలోని ఐరన్ రాడ్ తో సమ్మక్క తలపై బలంగా కొట్టాడు. తల పగిలిపోయి తీవ్ర రక్త స్రావం జరగడంతో ఆమె అక్కడే కుప్పకూలి పడిపోయింది.
పక్కనే ఉన్న ఆమె కొడుకు సమ్మయ్య, భర్త కొమురయ్య అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో వారిపై దుర్భాషలాడుతూనే కుమార్ ఇద్దరిపైనా రాడ్ తో దాడి చేశాడు. సమ్మయ్య తలపై కూడా బలంగా కొట్టడంతో ఆయన కూడా స్పాట్ లోనే చనిపోయాడు.
కొమురయ్య పై విచక్షణ రహితంగా దాడి చేయగా ఆయన కాలు, చేయి విరిగింది. తల్లీకొడుకు రక్తపు మడుగులో ప్రాణాలు వదలడం, కొమురయ్య తీవ్ర గాయాలతో పడి ఉండటంతో ఆ ప్రాంతమంతా భీతావాహంగా మారింది.
కట్టేసి కొట్టిన స్థానికులు
ఇద్దరిని హతమార్చిన ఆటో డ్రైవర్ కుమార్ అక్కడి నుంచి తప్పించుకు పారిపోయే ప్రయత్నం చేశాడు. దీంతో విషయాన్ని గమనించిన స్థానికులు అతడిని పట్టుకున్నారు.
అక్కడే ఉన్న స్తంభానికి కట్టేసి కుమార్ ను చితక బాదారు. తర్వాత పోలీసులకు అప్పగించారు. సీఐ ఫణిధర్, ఎస్సై రాణాప్రతాప్, కొత్తగూడ ఎస్సై గణేశ్, గంగారం ఎస్సై దిలీప్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించే పనిలో పడ్డారు.
పోలీసుల నిర్లక్ష్యం వల్లే..?
హత్యకు గురైన సమ్మక్క, సమ్మయ్య మృతదేహాలను ట్రాక్టర్ లో మార్చురీకి తరలిస్తుండగా మృతుల బంధువులు అడ్డుకున్నారు. ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం, పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఈ హత్యలు జరిగాయని ఆరోపించారు. ప్రాణ భయం ఉందని ఫిర్యాదు చేసినా పోలీసులు నిర్లక్ష్యం వహించడం వల్లే దారుణం జరిగిందని ఆరోపిస్తూ అక్కడే బైఠాయించి ఆందోళనకు దిగారు.
దీంతో కొద్దిసేపు పోలీసులకు, మృతుల బంధువుల మధ్య వాగ్వాదం జరిగింది. సీఐ ఫణిధర్ కలగజేసుకుని మృతుల కుటుంబాలకు న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో మృతుల బంధువులు ఆందోళన విరమించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు పోలీసులు వివరించారు.
(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)