Union Minister Bandi Sanjay : అమెరికాలోనే అప్పగింతలు...! కేటీఆర్ టూర్ పై బండి సంజయ్ సీరియస్ కామెంట్స్
29 August 2024, 22:25 IST
- బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై కేంద్రమంత్రి బండి సంజయ్ మరోసారి సీరియస్ కామెంట్స్ చేశారు. ఇండియాలో మాట ముచ్చటైందని... అమెరికాలో అప్పగింతలు కాబోతున్నాయని అన్నారు. కేటీఆర్ అందుకోసమే అమెరికా వెళ్లారని.. ఈ రెండు పార్టీలో ఒక్కటేనని విమర్శించారు. హైడ్రా పేరుతో ప్రభుత్వం హైడ్రామా చేస్తోందని ఫైర్ అయ్యారు.
కేంద్రమంత్రి బండి సంజయ్
“భారత్ లో మాట ముచ్చట అయిపోయింది. అమెరికాలో అప్పగింతలు కానున్నాయి. అందుకే యువరాజు అమెరికాకు వెళ్ళాడు. నేరుగా కాంగ్రెస్ నేతలు వెళ్ళకుండా వయా సింగపూర్ నుంచి అమెరికాకు వెళుతున్నారు. అక్కడ కాంగ్రెస్ లో బిఆర్ఎస్ కలుస్తుందో లేక బిఆర్ఎస్ లోనే కాంగ్రెస్ కలుస్తుందో తెలుస్తుంది” అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ సిరిసిల్ల నియోజకవర్గంలో ఇటీవల మృతి చెందిన ఎల్లారెడ్డిపేట మండల బిజేపి మాజీ అద్యక్షులు దేవేందర్ కుటుంబాన్ని పరామర్శించారు. సిరిసిల్ల టీ సెంటర్ లో ఛాయ్ తాగారు. సీనియర్ కార్యకర్త రాజు ఇంటివద్ద మీడియాతో మాట్లాడారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనంటూ కాంగ్రెస్ చెప్పడం సిగ్గు చేటన్నారు.
కవిత కు ఏవిదంగా బెయిల్ లబించిందో కాంగ్రెస్ నేతలు గుర్తుంచుకోవాలన్నారు. బెయిల్ పై సుప్రీంకోర్టు తీర్పు గురించి తాను మాట్లాడలేదని, కవిత తరపున బెయిల్ ఇఫ్పించేందుకు కాంగ్రెస్ నేత వాదించారని చెప్పానని తెలిపారు. గతంలో వాదించిన కాంగ్రెస్ రాజ్యసభ టిక్కెట్ ఇవ్వగా బిఆర్ఎస్ పోటీలో అభ్యర్థిని పెట్టలేదన్నారు. “కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే... రెండు పార్టీల మధ్య మాట ముచ్చట పూర్తయ్యింది. ఇక కలయికే తరువాయి. అందుకే యువరాజు కేటిఆర్ అమెరికా కు వెళ్ళగా కొందరు కాంగ్రెస్ నేతలు సింగపూర్ నుండి అమెరికా వెళ్లనున్నారు. అక్కడ అప్పగింతలకు సిద్ధమైనట్లు తెలిసింది” అని వ్యాఖ్యానించారు.
ఎందుకు కూల్చడం లేదు..?
అక్రమ నిర్మాణాలను కూల్చేస్తామని బీరాలు పలుకుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ మంత్రి కేటీఆర్ కు చెందిన జన్వాడ ఫాంహౌజ్ ను ఎందుకు కూల్చడం లేదని కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. తమ భవనాలపై చెయ్యేస్తే ప్రభుత్వ అంతు చూస్తామంటూ అక్బరుద్దీన్ ఒవైసీ బెదిరిస్తే... ఎందుకుఖ స్పందించడం లేదని నిలదీశారు. ఇతర విద్యా సంస్థలకు నోటీసులిస్తూ కూల్చవేతకు సిద్ధమవుతున్న హైడ్రా అధికారులు... అక్రమంగా నిర్మించిన ఒవైసీ విద్యా సంస్థలకు నోటీసులెందుకు ఇవ్వడం లేదో సమాధానం చెప్పాలన్నారు.
సల్కం చెరువును కబ్జా చేసి విద్యా సంస్థలను నిర్మించిన అసదుద్దీన్ ఒవైసీకి భవనాలను ఎందుకు కూల్చడం లేదన్నారు. విద్యార్థులున్నందున గడువిస్తామని చెప్పిన హైడ్రా అధికారులు... ఇతర విద్యా సంస్థల భవనాలను కూల్చివేసేందుకు నోటీసులెందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు. ఒవైసీ సంస్థకో న్యాయం? ఇతరులకు ఇంకో న్యాయమా? అని ప్రశ్నించారు.
హైడ్రా పేరుతో డ్రామా…
హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామా ఆడుతుందని విమర్శించారు బండి సంజయ్. హైడ్రా పేరుతో ఆరు గ్యారెంటీల అమలును మరిచిపోయారని ఆరోపించారు. ప్రజలంతా 6 గ్యారంటీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తుంటే... ప్రజల చర్చను పక్కదారి పట్టించుకునేందుకు హైడ్రా పేరుతో హైడ్రామాలాడుతున్నాని విమర్శించారు. రుణమాఫీపై సర్వే చేస్తామని ప్రభుత్వం చెప్పడం సిగ్గు చేటన్నారు. రుణమాఫీ పైసలన్నీ కర్నాటక మహర్షి వాల్మీకీ డెవలెప్ మెంట్ కార్పొరేషన్ కు మళ్లించారనే అనుమానాలు కలుగుతున్నాయని తెలిపారు.
సిరిసిల్లలో నేత కార్మికుల కరెంట్ బిల్లుల సబ్సిడీ విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంతోపాటు నేటి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. 50 శాతం సబ్సిడీ ఇస్తామని హామీ ఇచ్చినా అమలు చేయలేకపోయారని... మోసాల్లో ఒకరికొకరు మించిపోయారని ఆరోపించారు. అసలే నేతన్నలు అప్పులతో ఆత్మహత్యలు చేసుకుంటుంటే... లక్షల కొద్ది బిల్లులు వస్తుంటే కట్టేదేలా? అని ప్రశ్నించారు. ఇచ్చిన హామీ మేరకు నేతన్నలను ఆదుకోవాల్సిన బాధ్యత పాలకులపై ఉందన్నారు. అవసరమైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాస్తా...నేతన్నలను ఆదుకోవడానికి కేంద్రం తరపున కృషి చేస్తానని బండి సంజయ్ స్పష్టం చేశారు.