జన్వాడ ఫామ్‌ హౌస్ కేసుపై విచారణ - ‘హైడ్రా’కు హైకోర్టు కీలక ఆదేశాలు-telangana high court key orders to hydera on janwada farm house case ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  జన్వాడ ఫామ్‌ హౌస్ కేసుపై విచారణ - ‘హైడ్రా’కు హైకోర్టు కీలక ఆదేశాలు

జన్వాడ ఫామ్‌ హౌస్ కేసుపై విచారణ - ‘హైడ్రా’కు హైకోర్టు కీలక ఆదేశాలు

Maheshwaram Mahendra Chary HT Telugu
Aug 21, 2024 05:17 PM IST

జన్వాడ ఫాంహౌస్‌ కేసులో హైడ్రాకు హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. అన్ని డాక్యుమెంట్లు పరిశీలించాలని.. జీవో 99 ప్రకారం నిబంధనల మేరకే నడుచుకోవాలని స్పష్టం చేసింది. హైడ్రాకు సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించాలని ఏఏజీని న్యాయస్థానం ఆదేశించింది.

తెలంగాణ హైకోర్టు
తెలంగాణ హైకోర్టు

జన్వాడలోని తన ఫాంహౌస్‌ కూల్చొద్దంటూ ప్రదీప్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు బుధవారం విచారణ జరిగింది. ఫామ్‌హౌజ్‌ కూల్చివేసే విషయంలో నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని స్పష్టం చేసింది. జీవో 99 ప్రకారమే నడుచుకోవాలని ఆదేశించింది. 

ఫామ్‌హౌజ్‌ కూల్చివేయకుండా స్టే ఇవ్వాలన్న పిటిషనర్ విజ్ఞప్తిని ధర్మాసనం తోసిపుచ్చింది. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం…. హైడ్రాకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని ఏఏజీని న్యాయస్థానం ఆదేశించింది.

జన్వాడ ఫామ్‌హౌస్‌ను కూల్చొవద్దని యజమాని ప్రదీప్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ లో రాష్ట్ర ప్రభుత్వం, హైడ్రా కమిషనర్‌, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌, లేక్‌ ప్రొటెక్షన్‌ కమిటీ సభ్యులతో పాటు శంకర్‌పల్లి తహసీల్దార్‌, చీఫ్‌ ఇంజినీర్‌ను ప్రతివాదులుగా చేర్చారు. తన ఫామ్ హౌస్ ఎఫ్‌టీఎల్‌ పరిధిలో లేదని ప్రస్తావించారు. కానీ తన ఫామ్ హౌస్ ను ఇటీవలే ఇగిరేషన్ శాఖ అధికారులు పరిశీలించారని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను కూడా వారికి చూపించాలని తన పిటిషన్ లో ప్రస్తావించారు.

ప్రదీప్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై బుధవారం ఉదయం హైకోర్టు విచారణ జరపగా… మధ్యాహ్నానికి వాయిదా వేసింది. హైడ్రాకు ఉన్న పరిధిపై హైకోర్టు ధర్మాసనం అనేక ప్రశ్నలను సంధించింది. కూల్చివేతల గురించి చర్చించాల్సి ఉందని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. నిబంధనల ప్రకారమే కూల్చివేతలు జరగాల్సి ఉంటుందని గుర్తు చేసింది. ఈ క్రమంలోనే హైడ్రాకు సంబంధించిన పూర్తి వివరాలను అందజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఫామ్ హౌస్ పై స్పందించిన కేటీఆర్…

జన్వాడలోని ఫామ్ హౌస్ కేటీఆర్ ది అంటూ అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన శ్రేణులు ఆరోపణలు చేస్తున్నాయి. ఇదే విషయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. బుధవారం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన… తనకంటూ ఎలాంటి ఫామ్ హౌస్ లేదని స్పష్టం చేశారు. జన్వాడలో ఉన్న ఫామ్ హౌస్ తన స్నేహితుడిదని చెప్పారు. కానీ ఆ ఫామ్ హౌస్ ను లీజుకు మాత్రం తీసుకున్నానని వివరించారు.

నిబంధనలు ఉల్లంధించి ఎఫ్టీఎల్ పరిధిలో ఫామ్ హౌస్ ను నిర్మించి ఉంటే తానే దగ్గర ఉండి కూల్చివేయిస్తానని కేటీఆర్ చెప్పారు. ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న పలువురు కాంగ్రెస్ మంత్రులతో పాటు పెద్ద నాయకుల ఫామ్ హౌస్ లను కూడా కూడా పరిశీలించించి కూల్చివేయాలని వ్యాఖ్యానించారు.

“సోషల్ మీడియాలో పలువురు కాంగ్రెస్ నేతల ఫామ్ హౌస్ ల ఫొటోలు బయటికి వచ్చాయి. రెవెన్యూ మంత్రి పొంగులేటి, కేవీపీ , మధుయాష్కీ, గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు చాలా మంది నేతల ఫామ్ హౌసులు ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఫామ్ హౌస్ కూడా ఎక్కడ ఉందో కూడా చూపిస్తా. నాపేరు మీద ఎలాంటి ఫామ్ హౌస్ లేదు. తప్పు జరిగితే హైడ్రాను తీసుకెళ్లి అన్నింటిని కూల్చివేద్దాం. మంత్రులు, కాంగ్రెస్ నాయకుల నిర్మాణాలు కూడా కూల్చేయాలి ” అని కేటీఆర్ డిమాండ్ చేశారు.

 

 

టాపిక్