Warangal District : అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా యాక్సిడెంట్ - అన్నదమ్ములు మృతి
26 December 2023, 17:05 IST
- Warangal District News: వరంగల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదం… ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందారు.
వరంగల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం
Warangal District News:వరంగల్–కరీంనగర్ హైవేపై మరో యాక్సిడెంట్ జరిగింది. ఇటీవల ఇదే హైవేపై ఎల్కతుర్తి సమీపంలో జరిగిన ప్రమాదంలో అన్నదమ్ముల కుటుంబానికి చెందిన ఐదుగురు మృత్యువాత పడగా.. తాజాగా మరో యాక్సిడెంట్ లో ఇద్దరు అన్నదమ్ములు ప్రాణాలు కోల్పోయారు. హైవేపై హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండల పరిధి బావుపేట వద్ద ఆర్టీసీ బస్సు స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ధర్మసాగర్ మండల కేంద్రానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు చనిపోయారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. ధర్మసాగర్ మండల కేంద్రానికి చెందిన బొడ్డు సోమయ్య(55) బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడిగా పని చేస్తున్నాడు. అతని అన్న అయిన బొడ్డు సుదర్శన్(58) పాల వ్యాపారం చేస్తుంటాడు. కాగా బావు పేట గ్రామంలో వారి బంధువు ఒకరు చనిపోగా..మంగళవారం ఉదయం అంత్యక్రియలకు హాజరయ్యేందుకు సోమయ్యతో పాటు ఆయన అన్న అయిన బొడ్డు సుదర్శన్(58) ఇద్దరూ కలిసి స్కూటీపై వెళ్లారు.
వేగంగా ఢీకొట్టిన బస్సు
అంత్యక్రియల అనంతరం సుదర్శన్, సోమయ్య స్కూటీపై తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ క్రమంలో బావుపేట క్రాస్ వద్ద రోడ్డు మీదకు ఎక్కగానే వరంగల్ వెళ్తున్న టీఎస్ 02 జడ్ 0293 నెంబర్ గల సిరిసిల్ల డిపోకు చెందిన ఆర్టీసీ ఎక్స్ ప్రెస్ బస్సు వారి స్కూటీని వేగంగా ఢీకొట్టింది. దీంతో సోమయ్య, సుదర్శన్ ఇద్దరూ కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో ఇద్దరి తలలకు తీవ్ర గాయాలయ్యాయి. దెబ్బలు తగలడంతో తీవ్ర రక్త స్రావం జరిగి ఇద్దరూ అక్కడికక్కడే స్పృహ కోల్పోయారు. దీంతో స్థానికులు గమనించి వెంటనే 108 అంబులెన్స్ కు సమాచారం అందించారు. అనంతరం అంబులెన్స్ లో ఇద్దరినీ వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే సోమయ్య, సుదర్శన్ ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. కాగా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించే పనిలో పడ్డారు.
కుటుంబాల్లో తీవ్ర విషాదం
బొడ్డు సోమయ్య బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడుగా.. అతని భార్య ధర్మసాగర్ ఎంపీటీసీ పని చేస్తోంది. వీరికి ముగ్గురు పిల్లలు కాగా.. ఒకరికి పెళ్లి అయ్యింది. ఇంకో ఇద్దరు పిల్లలు చదువుకుంటున్నారు. ఇదిలాఉంటే సుదర్శన్ పాల వ్యాపారం చేసేవాడు. ఆయనకు భార్య, ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉండగా.. ముగ్గురు పిల్లలకు పెళ్లిలయ్యాయి. గ్రామంలో అందరితో కలుపుగోలుగా ఉండే ఇద్దరు అన్నదమ్ములు హఠాన్మరణం చెందడంతో ధర్మసాగర్ లో తీవ్ర విషాదం అలుముకుంది. అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా జరిగిన ప్రమాదంలో ఇద్దరు అన్నదమ్ములు చనిపోవడం, ఇంటికి పెద్ద దిక్కుగా ఉండేవాళ్లు మృత్యువాత పడటంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. కాగా బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు హసన్ పర్తి పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నారు.
రిపోర్టింగ్ : (హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)