Road Accident: హనుమకొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం
22 December 2023, 7:14 IST
- Road Accident: హనుమకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
హన్మకొండలో ఘోర రోడ్డు ప్రమాదం
Road Accident: హనుమకొండ జిల్లాలోఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎల్కదుర్తి మండలం పెంచికల్ పేట శివార్లలో జరిగిన ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. తెల్లవారుజామున కారును లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదంలో మరణించిన వారిని కాంతయ్య, భరత్, శంకర్, చందనలుగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురిని ఆస్పత్రికి తరలించారు. పొగమంచు, తెల్లవారు జామున డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. వాహనంలో ఉన్నవారంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు.
ఏటూరునాగారం నుంచి వేములవాడ దైవదర్శనానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్టు గుర్తించారు. ఏటూరు నాగరంకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన వారు ఈ ప్రమాదంలో మృతి చెందారు. అన్నదమ్ముల కుటుంబాలకు చెందిన వారు దైవదర్శనం కోసం వెళుతుండగా ఇసుక లోడ్‌తో ఉన్న టిప్పర్ బలంగా ఢీకొట్టింది. దీంతో ఘటనా స్థలంలోనే నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జయింది. వాహనంలో చిక్కుకుపోయిన వారిని బయటకు తీయడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించారు. గాయపడిన ముగ్గురిని ఎంజిఎం ఆస్పత్రికి తరలించారు.
నాగర్ కర్నూలులో మరో ప్రమాదం..
నాగర్ కర్నూలు జిల్లాలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ద్విచక్ర వాహనంపై వెళుతున్న వారిని మరో వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో చనిపోయిన వారిని కల్వకుర్తికి చెందిన వారిగా గుర్తించారు.