TSPSC Group 1 Applications 2024 : గ్రూప్ 1 దరఖాస్తులు ప్రారంభం - ఇలా ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు
23 February 2024, 18:04 IST
- TSPSC Group 1 Applications 2024: తెలంగాణ గ్రూప్ -1 దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 3వ తేదీతో అప్లికేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగుస్తుంది.
TSPSC Group 1 application process begins at tspsc.gov.in.
TSPSC Group 1 Applications 2024 Updates: కొత్తగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1(TSPSC Group I posts recruitment 2024) నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. 563 పోస్టుల భర్తీ ఈ ప్రకటన జారీ కాగా… ఇవాళ్టి నుంచి దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. మార్చి 14వ తేదీతో ఈ గడువు ముగియనుంది. అర్హత గల అభ్యర్థులు https://www.tspsc.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు.
ముఖ్య తేదీలు:
గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల - ఫిబ్రవరి 19,2024.
ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం - ఫిబ్రవరి 23, 2024.
దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు - మార్చి 03,2024.
దరఖాస్తుల సవరణకు అవకాశం - మార్చి 23 నుంచి మార్చి 27,2024.
హాల్ టికెట్లు డౌన్లోడ్ - పరీక్షకు ఏడు రోజుల ముందు నుంచి అందుబాటులోకి వస్తాయి.
అప్లికేషన్ ప్రాసెస్ ఫీజును రూ. 200గా నిర్ణయించారు. ఎగ్జామినేషన్ ఫీజు రూ. 120గా నిర్ణయించారు. అయితే నిరుద్యోగులకు ఈ ఫీజు(ఎగ్జామినేషన్ ఫీజు) నుంచి మినహాయించారు.
33 జిల్లా కేంద్రాల్లో ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించనున్నారు. మెయిన్స్ పరీక్షను గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిర్వహించనున్నారు.
ప్రిలిమినరీ పరీక్ష - మే/జూన్ 2024.
మెయిన్స్ పరీక్షలు - సెప్టెంబర్/ అక్టోబరు 2024.
అధికారిక వెబ్ సైట్ - https://www.tspsc.gov.in/
గతంలో అప్లయ్ చేసుకున్న అభ్యర్థులు కూడా ఈ నోటిఫికేషన్ కు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్పష్టం చేసింది. గతంలో దరఖాస్తు ఫీజు చెల్లించిన కారణంగా… ఈ నోటిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది.
how to apply TS Group 1: ఇలా దరఖాస్తు చేసుకోండి….
గ్రూప్ 1 పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలనే అభ్యర్థులు కమిషన్ అధికారిక వెబ్ సైట్ https://www.tspsc.gov.in/ లోకి వెళ్లాలి.
ఓటీఆర్ లేని వారు క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓటీఆర్(New Registration OTR) ఉన్నవారికి అవసరం లేదు.
గ్రూప్ 1 ఆన్ లైన్ దరఖాస్తుల ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
మీ ఓటీఆర్ వివరాలతో లాగిన్ కావాలి.
మీ వివరాలను ఎంట్రీ చేయాల్సి ఉంటుంది.
ఫొటో, సంతకాన్ని అప్ లోడ్ చేయాలి. దరఖాస్తు రుసుం చెల్లించాలి.
సబ్మిట్ బటన్ పై నొక్కితే మీ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి అవుతుంది. ఈ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత రిఫరెన్స్ నెంబర్ వస్తుంది. దీన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి.
గతంలో రెండు సార్లు రద్దు….
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2022 ఏప్రిల్‌లో గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది. మొత్తం 503 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రకటన జారీ అయింది. 2022 అక్టోబరు 16న ప్రిలిమినరీ పరీక్ష జరిగింది. ఆ తర్వాత ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారం వెలుగు చూడటంతో పరీక్షను కమిషన్ రద్దు చేసింది. ఆ తర్వాత మరోసారి పరీక్షను నిర్వహించింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇందులో భాగంగా… 2023 జూన్ 11 రెండోసారి పరీక్షను నిర్వహించారు. 2023 జూన్‌లో నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షకు 2.33 లక్షల మంది ప్రిలిమ్స్ పరీక్ష రాశారు. పరీక్ష నిర్వహణలో లోపాలున్నాయని, అభ్యర్థుల బయో మెట్రిక్ తీసుకోలేదని, ప్రిలిమినరీ పరీక్ష రోజున ఇచ్చిన విద్యార్ధుల సంఖ్యకు.. తుది కీ విడుదల సమయంలో ఇచ్చిన హాజరు సంఖ్యకు పొంతన లేదంటూ పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లను విచారించిన హైకోర్టు న్యాయస్థానం పరీక్ష రద్దు చేసి మరోసారి నిర్వహించాలని తీర్పు ఇచ్చింది. తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ కూడా రద్దు చేయాలని స్పష్టం చేసింది. దీంతో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ న్యాయ నిపుణులతో చర్చించి సుప్రీంకోర్టులో అప్పీలు చేసింది. గతేడాది అక్టోబరు నుంచి విచారణ జరగలేదు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు ఇప్పటికే కొత్త పాలక మండలి ఏర్పడింది. దీంతో గ్రూప్-1 పరీక్ష నిర్వహణపై క్లారిటీ ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగా… సుప్రీంలో దాఖలు చేసిన అప్పీలు పిటిషన్ వెనక్కు తీసుకునేందుకు అనుమతివ్వాలని పిటిషన్ వేసింది. తీవ్రమైన జాప్యం, విద్యార్ధుల ఎదురు చూపుల నేపథ్యంలో ఆలస్యం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను వెనక్కి తీసుకున్న నేపథ్యంలో…. గ్రూప్ 1 నోటిఫికేషన్ ను మొత్తం రద్దు చేసింది. ఆపై ఫిబ్రవరి 19వ తేదీన కొత్త నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మొత్తం 563 పోస్టులతో ప్రకటన విడుదలైంది. గతంలో పోల్చితే 60 పోస్టులు ఎక్కువగా ఉన్నాయి.