TS LAWCET 2023: లాసెట్ అప్లికేషన్స్ గడువు పొడిగింపు.. ఎప్పటివరకంటే?
07 April 2023, 14:02 IST
- TS LAWCET 2023 Updates: తెలంగాణ లాసెట్ దరఖాస్తుల గడువు పెంచారు. ఈనెల 20వ తేదీ వరకు అవకాశం కల్పిస్తూ అధికారులు ప్రకటన విడుదల చేశారు.
తెలంగాణ లాసెట్ గడువు పొడిగింపు
TS LAWCET Applications 2023: టీఎస్ లాసెట్ 2023 దరఖాస్తుల ప్రక్రియపై కీలక నిర్ణయం తీసుకున్నారు అధికారులు. లాసెట్, పీజీ లాసెట్ దరఖాస్తు గడువును పొడిగించారు. ఆలస్య రుసుము లేకుండా ఈ నెల 20 వరకు వరకు అప్లయ్ చేసుకునే అవకాశం కల్పించారు. దరఖాస్తుల ప్రక్రియ నిన్నటితో ముగియగా, మరికొన్ని రోజుల పాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.
ఇప్పటివరకు లాసెట్ కు 24,583 మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు ప్రకటించారు. గత ఏడాది 37,500 మంది వరకు దరఖాస్తులు వచ్చాయి. 29 వేల మంది మాత్రమే పరీక్ష రాశారు. ఈ పరీక్షకూ గత ఏడాది కంటే దరఖాస్తులు పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే దరఖాస్తు గడువు పెంచారు.
మే 25న పరీక్ష...
ఓపెన్ కేటగిరి అభ్యర్థులకు రూ. 900 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు రూ. 600 చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎడిట్ చేసుకునేందుకు మే 5 నుంచి 10వ తేదీ వరకు అవకాశం కల్పించారు. మే 16 నుంచి హాల్‌టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మే 25న టీఎస్ లాసెట్, టీఎస్ పీజీ ఎల్‌సెట్ ప్రవేశ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు.
అర్హతలు...
మూడేళ్ల ఎల్ఎల్ బీ కోర్సులో చేరేందుకు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఇక ఎల్ఎల్ బీ ఐదేళ్ల కోర్సులో చేరాలంటే ఇంటర్ పూర్తి చేసి ఉండాలి. ఇక ఎల్ఎల్ ఎం చేయాలంటే... ఎల్ఎల్ బీ డిగ్రీ ఉండాలి.
పూర్తి వివరాల కోసం https://lawcet.tsche.ac.in/ ద్వారా సంబంధిత సైట్ ను సందర్శించవచ్చు. సంబంధిత వివరాల ఆధారంగా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.
మరోవైపు ఇతర సెట్లకు కాస్త తక్కువగానే దరఖాస్తులు వచ్చాయని ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఈసెట్‌కు గత ఏడాది 24 వేల దరఖాస్తులు రాగా.. ఈసారి ఇప్పటికే 15,285 వచ్చాయని ప్రకటించారు. ఇక ఎడ్‌సెట్‌కు ఆలస్య రుసుం లేకుండా ఏప్రిల్ 20 వరకు గడువు ఉండగా ఇంతవరకు 8,820 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఐసెట్‌కు గడువు మే 6 కాగా 20,150 మంది, ఏప్రిల్ 30 వరకు గడువు ఉన్న పీజీఈసెట్‌కు 3,846 మంది, మే 6 వరకు గడువున్న పీఈసెట్‌కు 616 మంది దరఖాస్తు చేశారు.