TS DSC Exam Pattern : 160 ప్రశ్నలు, 80 మార్కులు - మరో 20 టెట్ వెయిటేజీ, డీఎస్సీ పరీక్ష విధానం ఇదే
10 September 2023, 6:47 IST
- TS DSC Exam Pattern 2023: తెలంగాణలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. మొత్తం 100 మార్కులకు పరీక్ష నియామక పరీక్ష ఉండగా.. ఇందులో టెట్ కు 20 మార్కులు వెయిటేజీ ఉంది.
తెలంగాణ డీఎస్సీ నోటిఫికేషన్
Telangana DSC Exam 2023: తెలంగాణలో 5,089 టీచర్ పోస్టు భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని 33 జిల్లాలకు జిల్లా స్థాయి కమిటీలను ప్రకటిస్తూ పాఠశాల విద్యాశాఖ.. ఇటీవలే రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ఇచ్చింది. జిల్లాల వారీగా అందుబాటులో ఉన్న ఖాళీలు రిజర్వేషన్ల జాబితా విడుదల చేసింది. జిల్లా స్థాయి ఎంపిక కమిటీల ద్వారా ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు. ప్రభుత్వ పాఠశాలలతో పాటు మునిసిపల్ స్కూళ్లలో ఖాళీలను డిఎస్సీ ద్వారా భర్తీ చేస్తారు. అయితే డీఎస్సీ పరీక్ష విధానం ఎలా ఉంటుందో ఇక్కడ చూద్దాం.…
మొత్తం 100 మార్కులు…
డీఎస్సీ రాత పరీక్షను మొత్తం 80 మార్కులకు నిర్వహించనున్నారు. ఒక్కోటి అర మార్కు చొప్పున 160 ప్రశ్నలతో ఎగ్జామ్ ఉంటుంది. టెట్ వెయిటేజీ కింద 20 మార్కులు ఉంటాయి. ఇలా 100 మార్కులకు అభ్యర్థుల మెరిట్ జాబితాను తయారు చేస్తారు. దీని ఆధారంగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ నియామకాలను చేపట్టనుంది. తుదిగా ఎంపికైన అభ్యర్థుల జాబితాను రాష్ట్రస్థాయిలో పరిశీలిస్తారు. ఒక్కో పోస్టుకు ముగ్గురిని ఎంపిక చేసి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేపడతారు. ఉద్యోగ నియామకాల్లో 95 శాతం స్థానికతను అమలు చేస్తారు. జిల్లాల్లోని పోస్టులకు రోస్టర్ విధానం పాటిస్తారు.
ఇక డీఎస్సీ నోటిఫికేషన్ లో భాగంగా 2,575 ఎస్‌జీటీ, 1,739 స్కూల్ అసిస్టెంట్ పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేయనుంది. మొత్తం కలిపి 5,089 ఉద్యోగాలను రిక్రూట్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఎస్టీటీ పోస్టుల భర్తీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది విద్యాశాఖ. ఎస్జీటీ ఉద్యోగాలను డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) పూర్తి చేసిన అభ్యర్థులతోనే భర్తీ చేయాలని నిర్ణయించింది. ఫలితంగా బీఈడీ అర్హత ఉన్న అభ్యర్థులు కేవలం స్కూల్ అసిస్టెంట్ (ఎస్‌ఏ) పోస్టులకు మాత్ర మే పోటీపడాల్సి ఉంటుంది. ఎస్జీటీ పోస్టులకు బీఈడీ వారికి కూడా అర్హత కల్పిస్తూ 2018లో ఎన్సీటీఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై ఇటీవలే సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. ప్రాథమిక పాఠశాలల్లోని టీచర్ పోస్టులను డీఎడ్ అర్హత ఉన్న వారితోనే భర్తీ చేయాలని తీర్పునిచ్చింది అత్యున్నత ధర్మాసం. ఈ తీర్పు ఆధారంగానే ఎన్సీటీఈ చర్యలు చేపట్టగా… ఆయా రాష్ట్రాలు కూడా సుప్రీంతీర్పునకు లోబడి ఎస్టీటీ ఉద్యోగాలను భర్తీ చేయనున్నాయి.
5089 టీచర్ల పోస్టుల భర్తీకి ఇచ్చిన నోటిఫికేషన్ కు సంబంధించి ఈ నెల 20వ తేదీ నుంచి అక్టోబర్ 21వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. నవంబర్ 20 నుంచి 30 వరకు పరీక్షలను ఉంటాయి. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థుల వయస్సు ఆగస్టు 1వ తేదీ నాటికి 18-44 ఏళ్లు ఉండాలి. పూర్తి సమాచారం ఈ నెల 20 నుంచి అధికారిక వెబ్‌సైట్ https://schooledu.telangana.gov.in/ISMS/ లో అందుబాటులో ఉంచనున్నారు.