Sharmila vs TRS MLAs: వైఎస్ షర్మిలపై స్పీకర్ కు ఫిర్యాదు.. ఏం జరగబోతుంది?
14 September 2022, 7:58 IST
- ys sharmila vs trs mlas: వైఎస్సాఆర్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలపై నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేశారు. చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై షర్మిల ట్విట్టర్ వేదికగా స్పందించారు.
వైఎస్ షర్మిల ( ఫైల్ ఫొటో)
trs mlas complaint against ys sharmila: తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టిన వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల... ఇప్పటికే పలు జిల్లాల్లో పూర్తి చేసింది. అయితే సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేస్తున్న ఆమె... అదే స్థాయిలో పలువురు ఎమ్మెల్యేలపై ఆరోపణలు చేశారు. సీన్ కట్ చేస్తే ఈ వ్యాఖ్యలను స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఏకంగా ప్రివిలేజ్ కమిటీకి షర్మిల వ్యాఖ్యలు పంపి.. చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.
వైఎస్ షర్మిల వ్యక్తిగత విమర్శలు చేస్తూ తమ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంగళవారం ఫిర్యాదు చేశారు. నిరాధార ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై తాను పరిశీలించి చర్యలు తీసుకుంటానని స్పీకర్ పోచారం హామీ ఇచ్చారు.
ప్రివిలేజ్ కమిటీకి...
ప్రివిలేజ్ నిబంధనల ప్రకారం షర్మిలపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై మంత్రులు, ఎమ్మెల్యేలతో స్పీకర్ చర్చించారు. తగిన చర్యలు తీసుకుంటామని, సభ్యుల హక్కులను పరిరక్షిస్తామని స్పీకర్ ఎమ్మెల్యేలకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు, మంత్రుల ఫిర్యాదుపై సభాహక్కుల ఉల్లంఘన కమిటీ బుధవారం సమావేశమయ్యే అవకాశముంది. అయితే ఇప్పటికే షర్మిలపై మంత్రి నిరంజన్ రెడ్డి డీజీపీకి ఫిర్యాదు చేశారు.
తీవ్ర వ్యాఖ్యలు...
ys sharmila comments on minister niranjan reddy: తన పాదయాత్రలో భాగంగా షర్మిల ఇటీవల వనపర్తిలో మంత్రి నిరంజన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. స్త్రీలో చెల్లిని,తల్లిని చూడలేని సంస్కార హీనుడు మంత్రి నిరంజన్ రెడ్డి అని వ్యాఖ్యానించారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మెట్టు దెబ్బలు పడుతయ్ అని హెచ్చరించారు. రైతులు వరి వేసుకోవద్దని చెప్పే నువ్వు ఒక మంత్రివా? అంటూ మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే.. షర్మిల వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. స్పీకర్‌కు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. మంత్రులు నిరంజన్‌రెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, కాలే యాదయ్య ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారు.
స్పందించిన షర్మిల...
ఈ వ్యవహరంపై వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా స్పందించారు. 'స్పీకర్ గారు.. నాపై చర్యలకు ఆలోచించే ముందు పరాయి ఆడదాన్ని, ఒక తల్లిని మరదలంటు నన్ను కించపరిచి నన్ను, నాతోటి మహిళలను అవమాన పరిచిన సంస్కార హీనుడైన మంత్రి నిరంజన్ రెడ్డి పై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను' అంటూ రాసుకొచ్చారు.
ఓవైపు షర్మిల వ్యాఖ్యల విషయం స్పీకర్ దృష్టికి వెళ్లటం, ప్రివిలేజీ కమిటీకి సిఫార్సు చేస్తారనే వార్తలు రావటం, షర్మిల స్పందించటంతో ఈ వ్యవహరం ఆసక్తిని రేపుతోంది. మొత్తంగా షర్మిలపై స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.