YSRTP: వైఎస్ షర్మిల పోటీ చేసేది ఆ స్థానం నుంచేనా…!
ysrtp chief ys sharmila: పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్తున్న వైఎస్ షర్మిల... వచ్చే అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా తాను పోటీ చేసే స్థానం పై గురి పెట్టినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆమె పక్కాగా పావులు కదుపుతున్నట్లు పొలిటికల్ కారిడార్ లో టాక్ వినిపిస్తోంది.
వైఎస్ షర్మిల..…. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తెగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. గత ఎన్నికల్లో ఏపీలోనూ వైసీపీ తరపున ఓ రేంజ్ లో ప్రచారం చేసిన ఆమె...అనూహ్యాంగా తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చేశారు. ఏకంగా ఓ పార్టీనే స్థాపించి.. కేసీఆర్ పై యుద్ధం ప్రకటించారు. అంతేనా సుదీర్ఘ పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్తున్నారు. రాజ్యన్న రాజ్యం తీసుకురావడమే లక్షమ్యని చెబుతున్న షర్మిల.... వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడ్నుంచే పోటీ చేస్తారనే చర్చ కొద్దిరోజులుగా నడుస్తోంది. అయితే ఆమె ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి బరిలో దిగేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.
వైఎస్ఆర్ సెంటిమెంట్..
ఆంధ్రా సరిహద్దు ప్రాంతంగా ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వైఎస్ అభిమానులు ఎక్కువగానే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ్నుంచే పోటీ చేసేందుకు షర్మిల మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. కొద్దిరోజులుగా ఖమ్మంలో పాదయాత్ర చేస్తున్న ఆమె... పాలేరుపై ప్రధానంగా దృష్టిపెట్టినట్లు అర్థమవుతోంది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై కూడా ఫోకస్ పెట్టారు. నేతలతోనూ సమాలోచనలు చేసే పనిలో పడ్డారు. వైఎస్సార్ అభిమానులు ఆయన కూతురిగా తనకు ఆదరిస్తారనే భావనలో కూడా ఆమె ఉన్నట్లు అనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే పాలేరును ఎంచుకున్నట్లు పార్టీ వర్గాల నుంచి సమాచారం. ఇక ఈనెల 16వ తేదీన పాలేరు నేతలతో కూడా ప్రత్యేకంగా భేటీ కావటం... ఈ వాదనకు బలం చేకూరుతోంది.
2014 ఎన్నికల్లోనూ వైఎస్సార్ సీపీకి ఆదరణ..
నిజానికి 2014లో జరిగిన ఎన్నికల్లోభాగంగా ఖమ్మం జిల్లాలో జగన్ ఆధ్వరంలోని వైసీపీకి ఆదరణ దక్కిందని చెప్పొచ్చు. ఏకంగా 3 అసెంబ్లీ సీట్లతో పాటు ఒక పార్లమెంట్ స్థానాన్ని గెలుచుకుని సత్తా చాటించింది. ఫలితంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభావం ఎన్నికలపై చూపిందనే ప్రభావం చెప్పవచ్చు. అయితే వీటన్నింటిని అంచనే వేసుకున్న తరువాతే వైఎస్ షర్మిల... ఉమ్మడి ఖమ్మం జిల్లాను ఎంచుకున్నట్లు రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే వైఎస్సార్ అభిమానులు తనకు సహకరిస్తానే భావనతో పాలేరు నుంచి షర్మిల పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారని తెలుస్తోంది. ఇక ఇక్కడ్నుంచి మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయనకు వైఎస్ఆర్ తో మంచి సంబంధాలు ఉండేవి. ఆయన అభిమానులు కూడా తనకు సహకరించే అవకాశంపై కూడా షర్మిల లెక్కలు వేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే అధికార పార్టీతో పాటు కాంగ్రెస్, బీజేపీలపై ఘాటుగానే విమర్శలు గుప్పిస్తున్నారు వైఎస్ షర్మిల. ఇదంతా రాజకీయ వ్యూహంలో భాగంగానే అనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ మధ్య మంత్రి పువ్వాడపై ఓ రేంజ్ లోనే ఆరోపణలు గుప్పించారు. ఈ పరిణామం కాస్త ఖమ్మం రాజకీయాల్లో వేడిని పుట్టించింది. మొత్తంగా పక్కా వ్యూహంతో పావులు కదుపుతున్న షర్మిల లెక్కలు పాలేరులో పారుతాయా...? వైఎస్ఆర్ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా..? లేదా అని ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే….!
టాపిక్