Warangal : సద్దుల బతుకమ్మ వేడుకల్లో విషాదం.. ఒకరు మృతి.. ప్రాణాలతో బయటపడ్డ చిన్నారి
11 October 2024, 12:17 IST
- Warangal : బతుకమ్మను గంగమ్మ ఒడికి పంపిద్దామని అందరూ ఆ ఊరి చెరువు గట్టుకు వెళ్లారు. అప్పటిదాకా అడిపాడారు. మహిళల బతుకమ్మ ఆటపాటలను చూసి ఆనందించిన ఓ వ్యక్తి.. బాబును ఎత్తుకొని ఇంటికి తిరుగుపయనమయ్యాడు. అంతలోకి విధి కాటేసింది. కరెంట్ అతన్ని బలి తీసుకుంది. చిన్నారి ప్రాణాలతో బయటపడ్డాడు.
బతుకమ్మ వేడుకల్లో విషాదం
వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అలంకానిపేట గ్రామంలో విషాదం జరిగింది. బతుకమ్మ వేడుకల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి చీకటి యాకయ్య (45) అనే వ్యక్తి మృతి చెందాడు. యాకయ్య చేతిలో బాబు ఉండగా.. అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు. విద్యుత్ లైట్లు కింద నుండి వెళ్తుండగా.. లైట్లకు ఉన్న వైర్లను తగిలి ప్రమాదం జరిగిందని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు కారు డాష్ క్యామ్‌లో రికార్డ్ అయ్యాయి.
అలంకానిపేట గ్రామం చెరువు కట్ట వద్ద బతుకమ్మ వేడుకల కోసం డెకరేషన్ వేశారు. విద్యుత్ దీపాలతో బతుకమ్మ ఆడే ప్రాంతాన్ని అలంకరించారు. అయితే.. వాటికి ఉన్న కరెంట్ వైర్లను గమనించకుండా యాకయ్య లైట్ల కింద నుంచి వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో ఆ వైర్లు తగిలి కరెంట్ షాక్ తగిలింది. యాకయ్యతో వచ్చిన ఇద్దరు వ్యక్తులు భయాందోళకు గురయ్యారు. ఏం చేయాలో అర్థంకాక భయపడ్డారు. ఆఖరికి ఎలాగోలా యాకయ్య చేతిలో ఉన్న బాబును కాపాడారు.
యాకయ్యను కాపాడే ప్రయత్నం చేశారు. కానీ.. అప్పటికే యాకయ్య మృతి చెందారు. దీంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. అప్పటిదాకా తమతోనే ఉన్న యాకయ్య చనిపోవడంతో.. అతని స్నేహితులు బోరున విలపించారు. నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగానే యాకయ్య మరణించారని అతని కుటుబం సభ్యులు ఆరోపిస్తున్నారు. యాకయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ఇంటికొచ్చిన కాసేపటికే..
వరంగల్‌లో పండుగ పూట దారుణం జరిగింది. ఓ కుటుంబం బతుకమ్మ ఆడిన తర్వాత ఇంటికి వచ్చింది. వారు వచ్చిన కాసేపటికే.. మీ భర్త చనిపోయాడు అంటూ.. మృతుడి స్నేహితుడు వచ్చి చెప్పాడు. దీంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. తన భర్త ఉస్మాన్‌ను కొట్టి చంపారని.. మృతుడి భార్య సుమలత ఆరోపించారు. సుమలత, ఉస్మాన్ మతాంతర వివాహం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఉస్మాన్ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.