Nalgonda District : భర్తే అసలు నిందితుడు..! అంగన్‌వాడీ టీచర్ మృతి కేసులో షాకింగ్ నిజాలు
నల్గొండ జిల్లాలో అంగన్‌వాడీ టీచర్ అనూష మృతి కేసును పోలీసులు చేధించారు. భర్తే అసలు నిందితుడిగా తేలింది. భార్యను నమ్మించి సాగర్ కాల్వలోకి తోసేసినట్లు విచారణలో వెల్లడైంది. నిందితున్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.
ఓ భర్త అనుమానం వల్ల, ప్రేమించి పెళ్ళి చేసుకున్న పాపానికి ఓ మహిళ నిండు జీవితం అర్థాంతరంగా ముగిసిపోయింది. నల్గొండ జిల్లా వేములపల్లి మండల పరిధిలో నాగార్జున సాగర్ ఎడమ కాలువలో తన భార్యను నెట్టివేసి హత్య చేసిన భర్త గుట్టును పోలీసులు రట్టు చేశారు. కేవలం తన భార్య కుమ్మరి అనూష ప్రవర్తనపై అనుమానం పెంచుకుని ఏళ్లుగా సతాయిస్తున్న పేరబోయిన సైదులును భార్యను హత్య చేసిన నిందితునిగా పోలీసులు ప్రకటించారు.
వేములపల్లి మండలం రావువారి గూడెం గ్రామానికి చెందిన పేరబోయిన సైదులు, మిర్యాలగూడ పట్టణానికి చెందిన కుమ్మరి అనూషలు పదహారేళ్ల కిందట ప్రేమించి, పెద్దలను ఎదిరించి కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కొడుకు, ఒక కూతురు. అనూష రావువారి గూడెంలో అంగన్వాడీ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది.
దీనితో పాటు ఆమెకు మండల పరిధిలోని కామేపల్లి గూడెం అంగన్వాడి కేంద్రానికి ఇన్ చార్జిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న సైదులు కొన్నాళ్లుగా ఆమెను మాటలతో వేధించడమే కాకుండా, కొడుతూ హింస పెడుతున్నాడు. దీంతో ఆమె తన కుటుంబ సభ్యులకు చెప్పుకోవడంతో ఇరు కుటుంబాల పెద్దలు పంచాయితీ పెట్టి హెచ్చరించినా సైదులు ప్రవర్తన మార్పు రాలేదు.
పక్కా ప్లాన్ తో...
ఎలాగైనా భార్యను అడ్డు తొలగించుకోవాలని సైదులు ఆమెను హత్య చేసుకోవడానికి పక్కా ప్లాన్ రచించాడు. పోలీసుల విచారణలో బయటకు వచ్చిన వివరాలు, నిందితుడు తన ప్రణాళికను అమలు పరిచిన తీరు నివ్వెర పరిచేలా ఉంది.
కామేపల్లి అంగన్వాడి కేంద్రం ఇన్ ఛార్జిగా ఉన్న అనూష విధుల నిర్వహణకు ఆ గ్రామానికి వెళ్లింది. ఆమెను ఇంటికి తీసుకువచ్చేందుకు వెళ్లిన సైదులు తన బైక్ పై భార్యను తీసుకుని రావువారి గూడెం బయలు దేరి, మార్గమధ్యంలో రావులపెంట గ్రామ సమీపం నుంచి నిండుగా ప్రవహిస్తున్న నాగార్జున సాగర్ ఎడమ కాలువ కట్ట పైకి చేరుకుని భార్యతో గొడవ పడ్డాడు. ఆమెపై భౌతిక దాడికి పాల్పడి బలవంతంగా సాగర్ కాల్వలోకి నెట్టేశాడు.
నీటి ప్రవాహంలో అనూష కొట్టుకుపోగా, ఎవరికీ తనపై అనుమానం రాకుండా సైదులు తన బైక్ ని కాల్వలోకి తోసేసి, తాను కాల్వలోకి దూకి ఈదుకుంటూ బయటకు వచ్చి, సాయంత్రం చీకటి కావడంతో బైక్ కాల్వలో పడిపోయిన ప్రమాదం జరిగిందని, తన భార్య కాలువలో కొట్టుకు పోయిందని అందరినీ నమ్మించే ప్రయత్నం చేశాడు.
ఈ సంఘటనపై వేములపల్లి పోలీసులు లోతుగా విచారించడంతో మృతురాలు అనూష హత్యకు సైదులు కారణమన్న విషయం బయట పడింది. నాగార్జున సాగర్ కాల్వపై గరిడేపల్లి మండలం పొనుగోడు వద్ద ఉన్న సాగర్ రిజర్వాయర్ పక్కనే ఉన్న చిన్న చెరువులో అనూష మ్రుతదేహం తేలింది. ‘ విచారణలో తాను చేసిన దుర్మార్గాన్ని సైదులు అంగీకరించడంతో నిందితున్ని అరెస్ట్ చేశాం..’ అని పోలీసులు బుధవారం మీడియాకు వివరించారు. అంగన్వాడీ టీచర్ మృతి విషయం సంచలనం రేపగా…. అయిదు రోజులుగా చర్చనీయాంశంగా మారింది.
( రిపోర్టింగ్ : క్రాంతిపద్మ, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి నల్గొండ కరస్పాండెంట్ )