Warangal Train Track : వేగంగా రైల్వే ట్రాక్ పునరుద్ధరణ ..! విజయవాడ - హైదరాబాద్ మధ్య రాకపోకలు షురూ, ఇదిగో వీడియో
04 September 2024, 15:25 IST
- మహబూబాబాద్ జిల్లాలో ధ్వంసమైన రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు దాదాపు పూర్తయ్యాయి. దీంతో విజయవాడ-హైదరాబాద్ మధ్య రైలు సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. డౌన్ లైన్‌లో బుధవారం అర్ధరాత్రికి పనులు పూర్తి అవుతాయని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
రైళ్ల రాకపోకలు పునరుద్ధరణ
భారీ వర్షాలు, వరదల దాటికి మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం సమీపంలో రైల్వే ట్రాక్ ధ్వంసమైన సంగతి తెలిసిందే. రంగంలోకి దిగిన రైల్వే సిబ్బంది.. రెండు రోజులుగా మరమ్మత్తు పనులు సాగిస్తోంది. ట్రాక్‌ల పునరుద్ధరణ పనులు దాదాపు పూర్తయ్యాయి. ఫలితంగా విజయవాడ-హైదరాబాద్ మధ్య రైలు సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి.
తొలుత రైల్వే అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. ఇది విజయవంతం కావటంతో… ముందుగా విజయవాడ నుంచి గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ను హైదరాబాద్‌కు పంపించారు. అప్‌లైన్‌లో సర్వీసులను పునరుద్ధరించినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఇక డౌన్‌లైన్‌లో ఇవాళ(బుధవారం) అర్ధరాత్రి వరకు పనులు పూర్తిచేస్తామని పేర్కొంది. పూర్తిస్థాయిలో పునరుద్ఘరణ తర్వాత రాకపోకలు సాఫీగా సాగుతాయని తెలిపింది. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేసింది.
భారీ వర్షాల దాటికి కొద్దిరోజులుగా తెలంగాణలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలోనే మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం పరిధిలోని తాల్లపూసలపల్లి శివారు రైల్వే స్టేషన్ వద్ద పెనుప్రమాదం తప్పింది. స్టేషన్ సమీపంలో వర్షానికి మూడు రోజుల కిందట రైల్వే ట్రాక్ ధ్వంసమైంది.
భారీ వర్షాల దాటికి సమీపంలో ఉన్న అయోధ్య చెరువు కట్టు తెగటంతో ఈ ఘటన జరిగింది, ఎగువు, దిగువ రైలు మార్గాల్లో కంకర కొట్టుకుపోయింది. రైలు పట్టాలపై భారీగా వరదనీరు ప్రవహించింది. అప్రమత్తమైన రైల్వే అధికారులు.. మహబూబాబాద్ లోనే మచిలీపట్నం ఎక్స్ ప్రెస్ తో పాటు పలు రైళ్లను నిలిపివేశారు. ట్రాక్ మరమ్మతు పనులు చేపట్టారు. దీంతో అప్పట్నుంచి విజయవాడ-వరంగల్ మధ్యలో పలుచోట్ల రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. దారి మళ్లింపు కోసం అధికారులు ప్రయత్నం చేశారు. కానీ చాలా మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
రైల్వే ట్రాక్ పునరుద్ధరణ కోసం రైల్వే శాఖ అధికారులు తీవ్రంగా శ్రమించారు. జేసీబీల సాయంతో పనులు చేపట్టారు. వేగంగా ట్రాక్ పనరుద్ధరణ జరిగేలా చర్యలు తీసుకున్నారు. అప్ లైన్ పూర్తి కావటంతో ఇవాళ్టి నుంచి రాకపోకలు షురూ అయ్యారు. డౌన్ లైైన్ కూడా ఇవాళ రాత్రికి సిద్ధమయ్యే అవకాశం ఉంది.
తెలంగాణకు రెయిన్ అలర్ట్..!
మరోవైపు ఉత్తర తెలంగాణలోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. కొమరంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయ్యాయి.
ఇక ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, ఖమ్మం, సూర్యాపేట, మహబూబబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
రేపు (గురువారం) భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది. ఇక ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, కొత్తగూడెం జిల్లాల్లో భారరీ వర్షాలు పడుతాయని అంచనా వేసింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది.