AP TG Rains : తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్, రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
AP TG Rains : తెలుగు రాష్ట్రాలకు మళ్లీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. కోస్తా మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపింది. అల్పపీడనం, ఆవర్తనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
AP TG Rains : తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడే వర్షాలు కాస్త తగ్గుతున్నాయన్న తరుణంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. ఏపీ, తెలంగాణకు మళ్లీ వర్ష సూచన చేసింది. సెప్టెంబర్ 5న పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంను ఆనుకొని మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రుతుపవన ద్రోణి ప్రభావంతో కోస్తా మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపింది. దీని ప్రభావంతో పలు చోట్ల భారీ వర్షాలు, కృష్ణా, గుంటూరులో ఓ మోస్తారు వర్షాలు పడతాయని వెల్లడించింది. ఈ రెండు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
ఈ నెల 5న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం క్రమంగా బలపడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం చెబుతుంది. అల్పపీడనం బలపడేందుకు రుతుపవన ద్రోణులు అనుకూలంగా ఉన్నాయన్నాని తెలిపింది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో కృష్ణా, గుంటూరు జిల్లాలకు మరోసారి వర్ష సూచన ఉందని హెచ్చరించింది. ఎన్టీఆర్ జిల్లాతో పాటు కృష్ణా, గుంటూర జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 24 గంటల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, బాపట్ల, ఏలూరు, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు వర్ష సూచన చేసింది.
తెలంగాణలో వర్షాలు
తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మధ్య విదర్భ పరిసర ప్రాంతాల్లో ఉన్న అల్పపీడనం ప్రస్తుతం బలహీనపడి పశ్చిమ విదర్భ పరిసర ప్రాంతం వైపు పయనిస్తుందని తెలిపింది. దీనికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తు వరకు ఆవరించిన ఉందని అధికారులు తెలిపారు. కోస్తాంధ్ర, యానాం పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టం నుంచి 3.1 నుంచి 5.8 కి.మీ వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని పేర్కొన్నారు.
ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
మంగళవారం కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, హనుమకొండ, వరంగల్, జనగాం జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం కొమురంభీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, ములుగు, వరంగల్, మహబూబాబాద్, హన్మకొండ, జనగామ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగతా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీచేసింది.
సంబంధిత కథనం