తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Vegetable Prices Hike : సెంచరీ మార్క్ దాటేసిన టమాట, మిర్చీ రేటు - మరింతగా పెరిగిన కూరగాయల ధరలు..!

Vegetable Prices Hike : సెంచరీ మార్క్ దాటేసిన టమాట, మిర్చీ రేటు - మరింతగా పెరిగిన కూరగాయల ధరలు..!

20 June 2024, 20:13 IST

google News
    • Vegetable Prices Hike in Telangana: తెలంగాణలో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. టమాట, ఉల్లి ధరలు ఏకంగా సెంచరీ మార్క్ ను దాటేశాయి.  రేట్లు భారీగా పెరగటంతో సామాన్యులతో పాటు వ్యాపారులు కూడా ఇబ్బందిపడుతున్నారు.
పెరిగిన కూరగాయల ధరలు...!
పెరిగిన కూరగాయల ధరలు...! (image source unshplash.com)

పెరిగిన కూరగాయల ధరలు...!

Vegetable Prices in Telangana : రాష్ట్రంలో కూరగాయలు ధరలు మండిపోతున్నాయి. డిమాండ్​కు తగ్గట్టుగా ఉత్పత్తిగా లేకపోవటంతో కొద్దిరోజులుగా ధరలు పెరుగుతూ వస్తున్నాయి. మొన్నటి వరకు రూ. 80లోపు ఉన్న టమాట, పచ్చి మిర్చీ ధర… ఇప్పుడు ఏకంగా సెంచరీ మార్క్ ను దాటేసింది. మరికొద్దిరోజులు ధరలు తగ్గే అవకాశం లేదని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.

సెంచరీ మార్క్ దాటేశాయ్…..

గురువారం హైదరాబాద్ కూరగాయల మార్కెట్లలోని ధరలు చూస్తే… కిలో టమాట ధర 100కు చేరింది. ఇక పచ్చి మిర్చీ ధర ఏకంగా రూ. 120కు చేరింది. కేజీ బీరకాయ ధర రూ. 100గా ఉండగా… గోరు చిక్కుడు ధర కూడా రూ. 100కు చేరింది. దీంతో  మార్కెట్ లోకి వెళ్లిన విక్రయదారులు… ఏ కూరగాయలు కొనాలన్న ఆలోచించే పరిస్థితి ఉంది. 

మంగళవారం నాటి ధరలు చూస్తే… కిలో టమాట ధర రూ. 80గా ఉంది. పచ్చి మిర్చీ ధర కూడా రూ. 70 - 80 మధ్య పలికింది. గోరు చిక్కుడు ధర రూ. 50 నుంచి 60 మధ్య ఉంది. బెండకాయ కిలో ధర రూ. 60- 80 మధ్య ఉంది. కానీ రెండు రోజుల వ్యవధిలోనే వీటి ధరలు భారీగా పెరిగిపోయాయి. దీంతో వినియోగదారులు మార్కెట్ కు వెళ్లాలంటేనే వణికిపోతున్నారు. చేతినిండా డబ్బులు తీసుకెళ్లిన సంచి సగానికి కూడా కూరగాయలు రావట్లేదంటూ సామాన్యులు వాపోతున్నారు.

పక్క రాష్ట్రాల నుంచే రవాణా…!

ఈ ఏడాది వేసవిలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో…. కూరగాయల ఉత్పత్తి భారీగా తగ్గిపోయింది. మే మాసంలో సగం రోజులు పూర్తి అయ్యాక రాష్ట్రంలో వర్షాలు మొదలయ్యాయి. దీంతో సీన్ క్రమంగా మారిపోయింది. వానలతో తడిసిపోవటంతో పాటు త్వరగా కుళ్లిపోవటం సమస్యగా మారింది. 

పక్క రాష్ట్రాల నుంచి భారీ మొత్తంలో కూరగాయలను దిగుమతి చేసుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. వీటి రవాణ ఖర్చులు కూడా అధికంగా ఉంటున్నాయి.  హైదరాబాద్ నగరంలోని ప్రధాన మార్కెట్లకు ప్రస్తుతం వస్తున్న కూరగాయల్లో 70 నుంచి 80 శాతం పక్క రాష్ట్రాల నుంచే వస్తున్నాయి. మన రాష్ట్రం నుంచి కేవలం 20 శాతం లోపే ఉంది. 

ఇక వానల రాకతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు సంభవిస్తున్నాయి. దీంతో త్వరగా కూరగాయలు కుళ్లిపోతుండటంతో వ్యాపారస్తులు దిగుమతులను క్రమంగా తగ్గిస్తూ వస్తున్నారు.  

రాష్ట్రంలో చూస్తే… ఈ సీజన్ లో కొంత కరువు ఛాయలు కనిపించాయి. నీటి వసతి లేక చాలా ప్రాంతాల్లో  కూరగాయల సాగు తగ్గింది. వీటి ప్రభావంతో కూడా ప్రస్తుతం మార్కెట్ లో కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. మరికొద్దిరోజులు కూడా పరిస్థితులు ఇలాగే ఉండే అవకాశం ఉంది. 

ప్రస్తుతం రాష్ట్రంలో వానకాలం సాగు నడుస్తోంది. ఇందుకు సంబంధించిన పంట జూలై, ఆగస్టు మాసంలో చేతికి వస్తుంది. వీటి ఉత్పత్తులు మార్కెట్లకు చేరితే… మళ్లీ ధరలు తగ్గే అవకాశం ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. అప్పటివరకు సామాన్యూల జేబులకు చిల్లు పడే అవకాశం ఉందని అంటున్నారు…!

 

తదుపరి వ్యాసం