TSPSC Group 4 Exam : నేడే గ్రూప్ - 4 పరీక్ష... అభ్యర్థులు షూస్ వేసుకోవద్దు, TSPSC కీలక సూచనలివే
01 July 2023, 5:20 IST
- TSPSC Group 4 Exam Updates: ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్– 4 పరీక్ష జరగనుంది. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 10 గంటలకు పరీక్ష ప్రారంభం కానుంది. ఇక అభ్యర్థులకు కీలక సూచనలు చేసింది టీఎస్పీఎస్సీ.
తెలంగాణ గ్రూప్ - 4 పరీక్ష
TSPSC Group 4 Exam: ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్-4 పరీక్ష జరగనుంది. ఇందుకోసం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. పేపర్ లీకేజీ ఘటనల నేపథ్యంలో...ఈసారి అలాంటి వాటికి అవకాశం లేకుండా చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 2,878 కేంద్రాల్లో పరీక్షలకు ఏర్పాట్లు చేసింది. పరీక్షకు నిరుడు బయోమెట్రిక్ ఉండగా, ఈసారి థంబ్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఫలితంగా ప్రతీ పరీక్షాకేంద్రంలో థంబ్ యంత్రాలను సిద్ధం చేశారు. అభ్యర్థులంతా పరీక్షాకేంద్రానికి రెండు గంటల ముందే చేరుకొని, వేలిముద్రలు ఇవ్వాలని టీఎస్‌పీఎస్సీ సూచించింది. చివరి నిమిషంలో వచ్చిన అభ్యర్థులకు పరీక్ష ముగిసిన తర్వాత వేలిముద్రలు స్వీకరిస్తారు.
కీలక సూచనలు:
- గ్రూప్ 4 పరీక్ష ప్రారంభం కావడానికి 15 నిమిషాల ముందే గేట్లు మూసివేస్తారు. సమయానికి ముందే అభ్యర్థులు తమకు కేటాయించిన పరీక్ష కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది.
- క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు.
- ఎలక్ట్రానిక్ పరికరాలు, రిమోట్‌తో కూడిన కారు తాళాలు, విలువైన, నిషేధిత వస్తువులు తీసుకెళ్లొద్దు. అభ్యర్థులు చెప్పులు మాత్రమే ధరించాలి. షూ వేసుకొవద్దు.
-ఈ పరీక్షకు భారీగా అభ్యర్థులు హాజరు కానుండటంతో ఈసారి థంబ్ తప్పనిసరి చేశారు. ప్రతి సెషన్ పరీక్ష ముగిశాక ఓఎంఆర్ షీట్‌ను ఇన్విజిలేటర్‌కు అందజేసి వేలిముద్ర వేయాలి.
- ఉదయం పేపర్-1 పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించనున్నారు. 9.45 గంటలు దాటిన తర్వాత అభ్యర్థులను లోనికి అనుమతించరు.
- మధ్యాహ్యం ఎగ్జామ్ 2:30 గంటల నుంచి 5:00 గంటల వరకు ఉంటుంది. ఇక 2.15 తరువాత ఎగ్జామ్ సెంటర్లలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు.
- పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించే ముందు భద్రతా సిబ్బందికి, పరీక్ష గదిలోకి చేరుకున్నాక ఇన్విజిలేటర్ కు అభ్యర్థులు ఫొటో గుర్తింపు కార్డు చూపించాల్సి ఉంటుంది. ఒక వేళ.. అభ్యర్థి కాకుండా వేరే వ్యక్తులు హాజరైనట్లు గుర్తిస్తే కఠిన చర్యలు ఉంటాయని కమిషన్ స్పష్టం చేస్తోంది.
- హాల్ టికెట్, ప్రశ్నాపత్రం నంబరు సరిగా రాయకున్నా, బ్లూ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ కాకుండా ఇంక్ పెన్, జెల్ పెన్, పెన్సిల్ ఉపయోగించినా ఓఎంఆర్ షీట్ చెల్లుబాటు కాదు.
- పరీక్ష సమయంలో అరగంటకు ఓ సారి గంట మోగిస్తూ అప్రమత్తం చేస్తారు.
భారీగా దరఖాస్తులు…
గ్రూప్-4 సర్వీసు పోస్టులకు భారీగా దరఖాస్తులు చేసుకున్న సంగతి తెలిసిందే. టీఎస్పీఎస్సీ చరిత్రలో ఈ స్థాయిలో దరఖాస్తు చేయడం ఇది రెండోసారి అని అధికారులు తెలిపారు. 2018లో 700 వీఆర్వో ఉద్యోగాలకు 10.58 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. గతంలో 7.9 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. జిల్లా స్థాయిలో పోస్టులు కావడంతో పోటీపడుతున్న అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని అధికారులు తెలిపారు. గ్రూప్-4 పోస్టుల భర్తీకి గత ఏడాది డిసెంబరు 2న నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టుల భర్తీకి డిసెంబరు 30 నుంచి ఫిబ్రవరి 3 వరకు అప్లికేషన్లు స్వీకరించారు.
గ్రూప్ 4 మొత్తం ఖాళీల సంఖ్య 8,180 కాగా... ఇందులో జూనియర్ అకౌంటెంట్ పోస్టులు 429, ఆర్థికశాఖ - 191, మున్సిపల్ శాఖ - 238, జూనియర్ అసిస్టెంట్ 5730 పోస్టులు , జూనియర్ ఆడిటర్ పోస్టులు 18 , వార్డ్ ఆఫీసర్ పోస్టులు 1862 ఉన్నాయి. ఈ పరీక్షను మొత్తం 300 మార్కులకు ఆన్‌లైన్ రాతపరీక్ష లేదా ఓంఎంఆర్ ఆన్సర్ షీట్ విధానంలో నిర్వహించనున్నారు. గ్రూప్-4 పరీక్షలో మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1 (జనరల్ స్టడీస్)- 150 మార్కులకు, పేపర్-2 (సెక్రటేరియల్ ఎబిలిటీస్)-150 మార్కులకు ఉంటాయి. ఆబ్జెక్టివ్ విధానంలోనే ప్రశ్నలు అడుగుతారు.