BRS Party : సిట్టింగ్ సీటుపై ఇద్దరు ఎమ్మెల్సీల కన్ను..! ఫిట్టింగ్ పెట్టేసినట్లేనా..?
17 August 2023, 18:09 IST
- Telangana Assembly Elections : అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ అధికార బీఆర్ఎస్ లో టికెట్ల పంచాయితీ షురూ అయిపోయింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఫిట్టింగ్ పెట్టేలా పలువురు పావులు కదుపుతుండటంతో… ఫైనల్ గా ఎవరు రేసులో ఉంటారనేది ఆసక్తికరంగా మారింది. ఇదే సీన్ జనగామ నియోజకవర్గంలో కనిపిస్తోంది.
జనగాం రాజకీయాలు
Jangaon Assembly constituency 2023 : అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ బీఆర్ఎస్ లోని అంతర్గత కలహాలు మళ్లీ తెరపైకి వస్తున్నాయి. అధినాయకత్వం సూచనలతో కాస్త వెనక్కి తగ్గినప్పటికీ... ఎన్నికలకు మరికొద్దిరోజులే టైం ఉండటంతో.... టికెట్ ఆశిస్తున్న నేతలు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఈసారి ఎలాగైనా అధినేత ఆశీసులు పొంది... అసెంబ్లీలో అడుగుపెట్టాలని చూస్తున్నారు. ఏకంగా సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఫిట్టింగ్ పెట్టేలా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అవసరమైతే సొంత పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ... విమర్శనాస్త్రాలను సంధిస్తున్నారు. ఇదే పరిస్థితి చాలా చోట్ల ఉండగా... తాజాగా జనగామ టికెట్ పంచాయితీ తెరపైకి వచ్చింది. ఏకంగా టికెట్ ఆశిస్తున్న లీడర్ల పంచాయితీ అధినాయకత్వం వద్దకు చేరిపోయింది.ఫలితంగా.... టికెట్ ఎవరికి దక్కుతుంది..? రాని వారి పరిస్థితేంటి...? అన్న చర్చ నియోజకవర్గంలో గట్టిగా నడుస్తోంది.
జనగామ... గతంలో ఉమ్మడి వరంగల్ నియోజకవర్గంలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గం. రాష్ట్ర ఏర్పాటు తర్వాత జనగామను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేశారు. 2014, 2018 ఎన్నికల్లో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీనే గెలిచింది. ఎమ్మెల్యేగా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి విజయం సాధించారు. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ముత్తిరెడ్డి పలుమార్లు వార్తల్లో నిలిచారు. భూకబ్జా ఆరోపణల విషయం పెద్ద వివాదంగా మారింది. ఓ దశలో జిల్లా కలెక్టరే ఆయనకు వ్యతిరేకంగా నివేదిక సమర్పించిన పరిస్థితులు కనిపించాయి. ఇదిలా ఉండగానే... కొంతకాలంగా మరోవైపు ముత్తిరెడ్డి కూతురు తుల్జా భవాని రెడ్డి తీవ్రస్థాయిలో పోరాటం చేస్తుంది. స్వయంగా తన తండ్రి కబ్జా కోరు అంటూ బాహటంగా సంచలన వ్యాఖ్యలు చేసింది. కబ్జా చేసిన భూమిని తిరిగి అప్పగిస్తున్నట్లు కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలోనే కాకుండా... రాష్ట్రవ్యాప్తంగా కూడా ముత్తిరెడ్డి వ్యవహరం చర్చనీయాంశంగా మారింది. సరిగ్గా ఈ పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకునే పనిలో పడ్డారు పలువురు బీఆర్ఎస్ ముఖ్య నేతలు. ఏకంగా ముత్తిరెడ్డి టికెట్ కు ఎసరు పెడుతూ... వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కించుకోవాలని చూస్తున్నారు. దీంతో జనగామ బీఆర్ఎస్ రాజకీయం తారాస్థాయికి చేరినట్లు అయింది.
రేసులో ఎమ్మెల్సీలు...!
ఈ సీటుపై ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి కన్నేశారు. తనకంటూ ఓ వర్గాన్ని నడిపిస్తున్నారు. పకడ్బందీగా ముత్తిరెడ్డి కి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. ఇటీవలే బయటికి వచ్చిన ఓ ఆడియో కాల్ కూడా కలకలం సృష్టించినట్లు అయింది. ఈసారి ముత్తిరెడ్డి టికెట్ ఇవ్వకుండా పల్లాకే టికెట్ ఇవ్వాలంటూ నియోజకవర్గానికి చెందిన కొందరు ముఖ్య నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే విషయాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నాలను గట్టిగా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కొందరు నియోజకవర్గానికి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు... ముఖ్యమంత్రిని కలిసేందుకు ప్రయత్నాలు చేశారు. ఇదంతా కూడా పల్లా డైరెక్షన్ లో నడుస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కూడా జనగామ సీటుపై కన్నేశారు. కేటీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉండే నేతల్లో ఒకరిగా ఉన్న శ్రీనివాస్ రెడ్డి.... ఈసారి హైకమాండ్ ను ఒప్పించి జనగామలో పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నారు. ఆయనవంతు కూడా గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకొని... ముందుకు సాగే ప్రయత్నాలు చేస్తున్నారు. వీరిద్దరే కాకుండా... పలువురు బీసీ నేతలు కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఇక ముత్తిరెడ్డి కుమార్తె కూడా ఏదైనా ఒక పార్టీ నుంచి బరిలో ఉంటారని తెలుస్తోంది.
మొత్తంగా జనగామలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండగానే.... ఇద్దరు ఎమ్మెల్సీలు రేసులో ఉండేందుకు ప్రయత్నాలు చేస్తుండటంతో రాజకీయం రసవత్తరంగా మారిపోయింది. ఇప్పటికే బీఆర్ఎస్ తొలి జాబితా సిద్ధమైపోయిందన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఆ జాబితాలో జనగామ పేరు ఉంటుందా..? లేక చివర్లో అభ్యర్థిని ప్రకటిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక మరోసారి ముత్తిరెడ్డికే టికెట్ దక్కితే... మిగతా నేతలందరూ మద్దతుగా నిలుస్తారా లేదా అనేది కూడా చూడాలి..!