ORR Accident : దుండిగల్ ఓఆర్ఆర్ వద్ద ఘోర ప్రమాదం - ముగ్గురు బీటెక్ విద్యార్థులు మృతి, మరో ఇద్దరి పరిస్థితి సీరియస్
19 July 2024, 21:54 IST
- Accident at ORR Exit No 5 : మేడ్చల్ జిల్లా దుండిగల్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులు దుర్మరణం చెందారు.
ప్రమాదానికి గురైన కారు
మేడ్చల్ జిల్లా పరిధిలోని దుండిగల్ సమీపంలోని ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 5 వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఆగి ఉన్న లారీని అతివేగంతో స్కోడా కారు ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో వీఎన్ఆర్ కాలేజీకి చెందిన ముగ్గురు బిటెక్ విద్యార్థులు దుర్మరణం చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
గాయపడిన వారిని నారాయణ మల్లారెడ్డి హస్పిటల్ కు తరలించారు. కారు అతి వేగమే ప్రమాదానికి కారణం అని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం - ముగ్గురు మృతి
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని అతి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో అక్కడిక్కడే ముగ్గురు మృతి చెందారు. లారీ డ్రైవర్ అతి వేగం కారణంగా ముగ్గురు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి.
ఈ ఘోర ఘటన గురువారం రాత్రి 11 గంటల సమయంలో చిత్తూరు-కర్నూలు జాతీయ రహదారిపై దామలచెరువు పంచాయతీ పత్తిపాటివారి పల్లి అక్కగార్ల గుడి వద్ద జరిగింది. ఐరాల మండలం వేదగిరివారి పల్లి పంచాయతీ రామతీర్థసేవాశ్రమ ఎస్టీ కాలనీ నుంచి దామలచెరువకు ద్విచక్ర వాహనంపై నలుగురు యువకులు బయలుదేరారు. అయితే పాత అక్కగార్ల గుడి వద్దకు వచ్చే సరికి వారు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా అతివేగంతో వచ్చిన తమిళనాడుకు చెందిన లారీ ఢీకొట్టింది.
అంతేకాకుండా ఆ ద్విచక్ర వాహనాన్ని దాదాపు 150 మీటర్ల మీర ముందుకు ఈడ్చుకుంటూ వెళ్లి మర్రి చెట్టు వద్ద ఆగింది. అతివేగం కారణంగానే డ్రైవర్ అదుపులో లారీ లేకుండా పోయింది. ద్విచక్ర వాహనంతో పాటు దానిపై ప్రయాణిస్తున్న యువకులను కూడా ఈడ్చుకుపోయింది. ఈ రోడ్డు ప్రమాదంలో రామతీర్థసేవాశ్రమ ఎస్టీ కాలనీకి చెందిన నారాయణ (34), జయచంద్ర (38), చుక్కావారి పల్లి ఎస్టీ కాలనీకి చెందిన నాగమల్లయ్య (14) అక్కడికక్కడే మృతి చెందారు. లారీ కింద వారి మృతదేహాలు లభ్యం అయ్యాయి. లారీ కింద మృతదేహాలు నలిగిపోయి ఉన్నాయి.
వీరిలో మనోజ్ అనే యువకుడు తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. తీవ్ర గాయాలు పాలైన మనోజ్‌ను 108 అంబులెన్స్ ఎక్కించి కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ రోడ్డు ప్రమాదంతో ఆ ప్రాంతమంతా భయానక వాతావరణాన్ని తలపించింది. చిమ్మచీకట్లో ఏం జరిగిందో అక్కడి వారికి తెలియలేదు. ఆ రకంగా విషాదం ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పాకాల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ ఘటన జరిగిన తీరును పరిశీలించారు.