తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Congress Politics: ‘‘ఠాకూర్ పోయి ఠాక్రే వచ్చే..’’

Telangana Congress politics: ‘‘ఠాకూర్ పోయి ఠాక్రే వచ్చే..’’

HT Telugu Desk HT Telugu

11 January 2023, 23:32 IST

google News
  • Telangana Congress politics: అంతర్గత కుమ్ములాటలకు, గ్రూప్ రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ పెట్టింది పేరు. తెలంగాణ కాంగ్రెస్ అందుకు అతీతమేం కాదు. తెలంగాణ కాంగ్రెస్ లో నెలకొన్న విబేధాలను పరిష్కరిస్తాడని, ఇన్ చార్జ్ గా నియమించిన అధిష్టానం ఆశలను మహారాష్ట్ర నేత ఠాక్రే నెరవేర్చగలడా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.

హైదరాబాద్ లోని గాంధీ భవన్
హైదరాబాద్ లోని గాంధీ భవన్

హైదరాబాద్ లోని గాంధీ భవన్

Telangana Congress politics: రాష్ట్ర శాఖల్లో విబేధాలు కాంగ్రెస్ కు కొత్త కాదు. రాజస్తాన్, కర్నాటక, మధ్య ప్రదేశ్.. ఇలా ఏ రాష్ట్రం తీసుకున్నా కాంగ్రెస్ లో వర్గ విబేధాలు స్పష్టంగా కనిపిస్తుంటాయి. రాష్ట్రాల కాంగ్రెస్ శాఖల్లో విబేధాల విషయం అధిష్టానానికి పూర్తిగా తెలుసు. ఈ విబేధాల పరిష్కారానికి చాలా సందర్భాల్లో కాంగ్రెెస్ అధిష్టానం ‘వెయిట్ అండ్ సీ’ మార్గాన్ని అవలంబిస్తుంటుంది. ఈ తగవులను పార్టీ నేతలు అంతర్గత ప్రజాస్వామ్యం అని సమర్ధించుకుంటుంటారు.

Telangana Congress politics: తెలంగాణ కాంగ్రెస్ లో గ్రూపులు

తెలంగాణ కాంగ్రెస్ ను కూడా గ్రూప్ రాజకీయాలు వేధిస్తున్నాయి. ప్రస్తుతం ప్రధానంగా రెండు గ్రూపులు అధిష్టానానికి తలనొప్పిగా మారాయి. అందులో ఒకటి సీనియర్ల గ్రూప్. వీరినే ఈ మధ్య గ్రూప్ 9 లేదా జీ 9 అంటున్నారు. దశాబ్దాలుగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్నామని, అసలైన కాంగ్రెస్ వాదులమని వారి వాదన. మరో వర్గం ఔట్ సైడర్స్. వేరే పార్టీల నుంచి వచ్చి కాంగ్రెస్ లో చేరి చక్రం తిప్పుతున్న వారు. ప్రస్తుత పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గ్రూప్ ఇది. ‘‘రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా పగ్గాలు చేపట్టే నాటికి ఆయనపై సీనియర్ల నుంచి ఈ స్థాయిలో వ్యతిరేకత లేదు. కానీ, పార్టీలో కలుపుకుని పోయే ధోరణిలో రేవంత్ రెడ్డి లేకపోవడం, సీనియర్లను పక్కనపెట్టే ప్రయత్నాలు చేయడం, ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం.. మొదలైన వాటితో రేవంత్ రెడ్డిపై వ్యతిరేకత క్రమంగా పెరిగింది. ముఖ్యంగా సీనియర్ నాయకుల్లో ఈ వ్యతిరేకత తీవ్ర స్థాయికి చేరింది’’ కాంగ్రెస్ వ్యవహారాలను నిశితంగా పరిశీలిస్తున్న ఒక విశ్లేషకుడు వివరించారు.

Telangana Congress politics: మానికం ఠాకూర్ పై వేటు

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పై తమ వ్యతిరేకతను సీనియర్లు బాహటంగానే వెల్లగక్కడం ప్రారంభించారు. అధిష్టానం వద్ద వరుసబెట్టి ఫిర్యాదులు చేశారు. పార్టీ వ్యవహారాల ఇన్ చార్జిగా ఉన్న మానికం ఠాకూర్ ను, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పదవుల నుంచి తొలగించాలనే డిమాండ్ తో పెద్ద ఎత్తున లాబీయింగ్ చేశారు. చివరకు, తమ డిమాండ్ల విషయంలో కొంత వరకు సఫలీకృతులయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి పదవి నుంచి మానికం ఠాకూర్ ను అధిష్టానం తొలగించింది. కానీ, సీనియర్ల ప్రధాన డిమాండ్ అయిన రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ పదవి నుంచి మాత్రం తొలగించలేదు. దాంతో, అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ముగిసే వరకు రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా కొనసాగించడం ఖాయమని వారికి కూడా అర్థమైంది.

T Congress politics: ‘ముందుంది..’

మహారాష్ట్ర లో సీనియర్ కాంగ్రెస్ నాయకుడైన మానిక్ రావు ఠాక్రే (Manikrao Govindrao Thakre) ను తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జిగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నియమించింది. మహారాష్ట్రలో దాదాపు 20 ఏళ్ల పాటు, 1985 నుంచి 2004 వరకు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ చార్జిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత కాంగ్రెస్ పార్టీ లోని కీలక నాయకులందరితో ఆయన భేటీ అయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ లో విబేధాలను పరిష్కరించడం అంత సులువు కాదని ఇప్పటికే ఆయనకు అర్థమై ఉంటుంది. ‘రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులను ఒక్కతాటిపై చేర్చడం దాదాపు అసాధ్యం’ అని ఒక కాంగ్రెస్ నాయకుడే వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితుల్లో, రాష్ట్ర కాంగ్రెస్ లోని రెండు గ్రూప్ ల మధ్య సామరస్యాన్ని నెలకొల్పి, రెండు గ్రూపులను సమన్వయంతో పని చేసేలా దిశానిర్దేశం చేయడం కొత్త ఇన్ చార్జ్ ఠాక్రే ముందున్న అత్యంత కఠినమైన లక్ష్యం. ‘‘కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఎన్నికలు వచ్చే నాటికి కొత్త ఉత్సాహం రావాలంటే, పార్టీ నాయకుల్లో ఐక్యత నెలకొనకపోయినా పర్లేదు. ఐక్యత ఉన్నట్లుగా కనిపిస్తే చాలు’’ అని తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ ఎస్ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమేనన్న విశ్లేషణల నేపథ్యంలో.. ఆ పార్టీకి సరైన ప్రత్యామ్నాయంగా నిలబడేందుకు బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తున్న తరుణంలో, సర్వశక్తులను ఒడ్డి పునర్వైభవం పొందడం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తక్షణ అవసరం.

తదుపరి వ్యాసం