TPCC On 12 MLAs: టీ కాంగ్రెస్ సరికొత్త అస్త్రం.. ఆ 12 మందిపై ఫిర్యాదుకు రెడీ!
Telangana Congress: ఎమ్మెల్యేల ఎర కేసు నేపథ్యంలో… తెలంగాణ కాంగ్రెస్ సరికొత్త అస్త్రాన్ని సంధించేందుకు సిద్ధమైంది. తమ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీ కొనుగోలు చేసిందంటూ.. ఫిర్యాదు చేయడానికి రెడీ అయిపోయింది.
TPCC ready to complaint against 12 mlas: నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎర కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దీనిపై ఓవైపు కోర్టులో విచారణ జరుగుతుండగా... రాజకీయపార్టీల మధ్య మాటల తుటాలు పేలుతూనే ఉన్నాయి. ప్రధానంగా బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నాయి. సీన్ కట్ చేస్తే కాంగ్రెస్ సీన్ లోకి వచ్చే పనిలో పడింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ టార్గెట్ గా సరికొత్త అస్త్రాన్ని ప్రయోగించబోతుంది. ఈ మేరకు టీపీసీసీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
12 మందిపై ఫిర్యాదు..!
రాష్ట్రంలో రెండోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత... కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీలోకి వెళ్లారు. ప్రస్తుతం ఎర కేసు నేపథ్యంలో... వీరిపై కూడా ఫిర్యాదు చేయాలని తెలంగాణ కాంగ్రెస్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పార్టీ సీనియర్ నేతలతో కూడిన బృందం శుక్రవారం మధ్యాహ్నం సీఎల్పీలో సమావేశం కానుంది. అనంతరం మొయినాబాద్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం.
కాంగ్రెస్ నుంచి కారు ఎక్కిన వారిలో పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు , పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి , కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు, ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియా నాయక్, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య , ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఎల్బీనగర్ నుంచి సుధీర్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్ , కొల్లాపూర్ నుండి బీరం హర్షవర్ధన్ రెడ్డి, తాండూర్ నుంచి గెలిచిన పైలట్ రోహిత్ రెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఉన్నారు. వీరిలో సబితా ఇంద్రారెడ్డి మంత్రి పదవిలో ఉన్న సంగతి తెలిసిందే. మునుగోడు నుంచి గెలిచిన రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు.