BRS in AP : ఏపీలో బీఆర్ఎస్ .. ఈ సవాళ్లకు కేసీఆర్ సమాధానం ఏంటి.. ?-brs to face some challenges in ap during party expansion interesting is how kcr solves those ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Brs To Face Some Challenges In Ap During Party Expansion Interesting Is How Kcr Solves Those

BRS in AP : ఏపీలో బీఆర్ఎస్ .. ఈ సవాళ్లకు కేసీఆర్ సమాధానం ఏంటి.. ?

Thiru Chilukuri HT Telugu
Jan 03, 2023 03:23 PM IST

BRS in AP : టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారి.. నేషనల్ పాలిటిక్స్ షురూ చేసిన కేసీఆర్ పార్టీ.. ఏపీలో పలు సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎదురయ్యే ఛాలెంజ్ లకు ముందే సంసిద్ధమై ... వాటిని పరిష్కరించి... ఏపీ ప్రజలకు కేసీఆర్ ఎలా దగ్గరవుతారు ? ఇందుకోసం ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తారు ?

ఏపీలో బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి ?
ఏపీలో బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి ?

BRS in AP : దేశ రాజకీయాల్లో.. జాతీయ, ప్రాంతీయ పార్టీల విధానాలకు మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. నేషనల్ పార్టీలు అన్ని రాష్ట్రాలు, అన్ని ప్రాంతాల ప్రజల దృష్టితో పాలసీలను రూపొందిస్తాయి. రాష్ట్రాల మధ్య సరిహద్దు, నీరు, భూమి సమస్యలు ఉత్పన్నమైనప్పుడు.. ఆయా పార్టీలు సాఫ్ట్ స్టాండ్ తీసుకుంటాయి. ఎవరిని నొప్పించకుండా సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తాయి. ప్రాంతీయ పార్టీల విధానాలు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో.. ప్రజల ఆకాంక్షలు, ఆశయాల ఆధారంగా అనేక ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చాయి. ఆయా పార్టీల ప్రధాన కర్తవ్యం.. సొంత ప్రాంత ప్రయోజనాలు రక్షించడమే. ఇందుకోసం ఎంత వరకైనా పోరాడ్డానికి సై అంటాయి. ఇతర రాష్ట్రాలతో సమస్యలు ఏర్పడినప్పుడు.. ప్రాంతీయ పార్టీలు ప్రజా క్షేత్రంలో కొట్లాడిన సందర్భాలను అనేకం చూశాం కూడా. అయితే... ఆయా స్టేట్ పార్టీలు .. జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పుడు తమ విధానాలను మార్చుకుంటాయి. జాతీయ రాగం అందుకుంటాయి. రాష్ట్రాలు, ప్రాంతాల మధ్య ఎలాంటి విబేధాలు లేని చోట ఈ తరహా పార్టీలకు ఏ సమస్యలు ఉండవు. కానీ... రెండు స్టేట్స్ మధ్య సయోధ్యలేని చోటే.. కొత్తగా జాతీయ పాట పాడే పార్టీలకు అసలు సవాళ్లు ఎదురు నిలుస్తాయి.. !

ట్రెండింగ్ వార్తలు

టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారి.. నేషనల్ పాలిటిక్స్ షురూ చేసిన కేసీఆర్ పార్టీ... ఇప్పుడు ఇలాంటి సవాళ్లే ఎదుర్కోవాల్సి ఉంటుంది. తెలంగాణలో రెండు పర్యాయాలు పరిపాలన సాగించిన కేసీఆర్ అండ్ టీం... ఇక్కడి సంక్షేమ ఫలాలను దేశమంతటా అందించేందుకే జాతీయ రాజకీయాలకు శ్రీకారం చుట్టాం అంటోంది. ఇందులో భాగంగా... ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లో పార్టీ విస్తరణకు వ్యూహాలు అమలు చేస్తోంది. మొట్టమొదటగా ఏపీపై దృష్టి సారించిన గులాబీ దళం.. ఇప్పటికే పలువురు కీలక ఏపీ నేతలకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించింది. సంక్రాంతి తర్వాతి నుంచి ఇక రాజకీయ సమరమే అంటోంది. ఇందుకు ఆంధ్రుల సంపూర్ణ సహకారం కావాలని సోమవారం జరిగిన చేరికల కార్యక్రమం వేదికగా కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. అంతా కలిసి దేశంలో రైతు స్వరాజ్యం తీసుకొద్దామని పిలుపునిచ్చారు. ఇంతటితో ఆగకుండా... ఏపీలోని పలువురు సిట్టింగ్ లు బీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటూ.. తనదైన శైలిలో రాజకీయ హీట్ ను పెంచారు కేసీఆర్. మరి.. బీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త రాగం పట్ల ఏపీ ప్రజలు ఎలా స్పందిస్తారన్నదే ప్రస్తుత చర్చనీయాంశం !

ఎదురయ్యే సవాళ్లివే..

ఏపీలో బీఆర్ఎస్.. పార్టీ విస్తరణ పరంగా నేతల చేరికలతో జోరుగా ముందుగా సాగే అవకాశాలు ఉన్నా.. ప్రజాదరణ ఎంత మేరకు చూరగొంటుందన్నదే ప్రశ్న. రాష్ట్రం విడిపోయి 9 ఏళ్లు గడిచినా.. ఏపీ ప్రజల్లో అధిక శాతం మంది ఇంకా హైదరాబాద్ ను కోల్పోయామన్న భావనలో ఉన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన కేసీఆర్ వల్లే అది జరిగిందనే ఆక్రోశం చాలా మందిలో ఉంది. తెలంగాణ ఇచ్చారన్న కోపంతోనే.. ఏపీలో కాంగ్రెస్ ని కోలుకోలేని దెబ్బతీసిన ఆంధ్రా ప్రజలు... తెలంగాణను తానే తెచ్చానంటున్న కేసీఆర్ ని ఏపీలో ఏ మేరకు అంగీకరిస్తారన్నది ఇంట్రెస్టింగా మారింది. నేతలు ఎంత మంది చేరినా... ప్రజల మద్దతు లేనిది పార్టీ ముందడుగు వేయడం సాధ్యం కాదు. పార్టీగా నిలదొక్కుకోవాలంటే.. అంతిమంగా ఓట్లు వేసి ఆమోదించాల్సింది ప్రజలే. మరి.. ఇప్పటి వరకు తనమీద కోపంగా ఉన్న ఏపీ ప్రజలని... జాతీయ రాగం అందుకున్న కేసీఆర్ ఎలా మచ్చిక చేసుకుంటారో చూడాలి !

సోమవారం జరిగిన చేరికల కార్యక్రమంలో... విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ప్రస్తావించిన కేసీఆర్.. మోదీ ప్రైవేటు పరం చేసినా.. తాము అధికారంలోకి రాగానే తిరిగి ప్రభుత్వ పరిధిలోకి తెస్తామని ప్రకటించారు. ఏపీ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా రానున్న రోజుల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం ఏదైనా నిర్ణయం తీసుకుంటే... దాన్ని కేసీఆర్ తన అస్త్రంగా మలుచుకునే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. విశాఖ ఉక్కు కోసం పోరాడేందుకు నేరుగా కేసీఆర్ రంగంలోకి దిగవచ్చు.. !

ఇదిలా ఉండగా... రాష్ట్రం విడిపోయి 9 ఏళ్లు గడుస్తున్నా... రెండు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు కొన్ని ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. పరిష్కారం కాని విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో సమావేశాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా.. 9, 10 షెడ్యూల్ లోని సంస్థల విభజన, ఆస్తుల పంపకాలు, ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న ఆర్థికపరమైన అంశాలపై చిక్కుముడి వీడటం లేదు. ఏపీ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన, విద్యుత్ వినియోగ అంశాలు తేలడం లేదు. ఇటీవల ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన ఏపీ సీఎం జగన్.. విభజన అంశాలను త్వరగా పరిష్కరించి, ఆస్తుల లెక్కలు తేల్చాలని కోరారు. ఈ నేపథ్యంలో... ఈ అంశాలపై బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడిగా.. కేసీఆర్ ఏ స్టాండ్ తీసుకుంటారన్నది ఆసక్తి రేపుతోంది !

ఇక.. విద్యుత్ బకాయిల కింద ఏపీకి రూ. 6,756 కోట్లు కట్టాలంటా గత ఆగస్టులో కేంద్రం తెలంగాణను ఆదేశించింది. 2014, జూన్ 2 నుంచి 2017, జూన్ 10 వరకు ఏపీ జెన్ కో నుంచి తీసుకున్న కరెంట్ కు గాను రూ. 3,441 కోట్లు... బకాయిలు సకాలంలో చెల్లించనందుకు మరో రూ. 3,315 కోట్లు కలిపి మొత్తం.. రూ. 6,756 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. దీనికి కౌంటర్ ఇస్తూ... ఏపీయే మాకు రూ. 12,940 కోట్లు బాకీ ఉందని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు లెక్కలతో సహా వివరాలు వెల్లడించింది. ప్రస్తుతానికి ఈ అంశంపై ఏపీ, తెలంగాణ స్తబ్దుగానే ఉన్నా... రానున్న రోజుల్లో బకాయిల చెల్లింపు పరిస్థితి వస్తే... ఏపీలోనూ పాగా వేయాలని చూస్తోన్న కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది... ఏపీ, తెలంగాణ ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.

ఏపీ, తెలంగాణ మధ్య నీళ్ల పంచాయితీ ఏళ్లుగా కొనసాగుతోంది. కృష్ణా, గోదావరి నీటి వినియోగంపై ఇరు రాష్ట్రాల పంచాయితీ సుప్రీం కోర్టు వరకు వెళ్లింది. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు, పవర్ హౌస్ ల నిర్వహణపై ఇప్పటి వరకు ఏకాభిప్రాయం కుదరలేదు. పోలవరం బ్యాక్ వాటర్ అంశంలోను వివాదం కొనసాగుతోంది. పోలవరం నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని... అయితే బ్యాక్ వాటర్ తో భద్రచాలానికి ముంపు ప్రమాదం ఉందని... కనుక ఇరు వైపులా రక్షణ గోడలు నిర్మించాలని కోరుతున్నామని సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం వాదించింది. ఇక.. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి ద్వారా తెలంగాణ ప్రభుత్వం కేటాయింపులకి మించి నీటిని వాడుకుంటోందని ఏపీ వాదిస్తోండగా... పోతిరెడ్డి పాడు ద్వారా లెక్కకు మించిన నీటిని తరలించుకుపోతున్నారని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇలా.. కృష్ణా, గోదావరిపై రెండు రాష్ట్రాల ప్రాజెక్టులపైనా పరస్పరం అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో... ఏపీలో బీఆర్ఎస్ విస్తరణకు ఎదురయ్యే ఇలాంటెన్నో సవాళ్లకు కేసీఆర్ ఎలా చెక్ పెడతారన్నదే ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతానికి ప్రారంభ దశలో ఉన్న ఏపీ బీఆర్ఎస్ కు అక్కడి ప్రధాన పార్టీల నుంచి ఈ తరహా ప్రశ్నల దాడి రాకపోవచ్చు. కానీ.. వచ్చే ఏడాది ఏపీలో కూడా ఎన్నికల సమరం మొదలవుతుంది. అంటే.. ఈ ఏడాది చివరి నుంచే ఎన్నికల హీట్ వచ్చేస్తుంది. అప్పుడు ప్రతి ఓటూ పార్టీలకు కీలకం అవుతుంది. బీఆర్ఎస్ తమ ఓటు బ్యాంకుకి ఎసరు పెడుతుందని భావిస్తే.. అక్కడి ప్రధాన పార్టీలు కేసీఆర్ ను ఈ అంశాల ఆధారంగా నిలదీసే అవకాశాలే ఎక్కువ. సో... ఎదురయ్యే సవాళ్లకు ముందే సంసిద్ధమై ... వాటిని పరిష్కరించి... ఏపీ ప్రజలకు కేసీఆర్ ఎలా దగ్గరవుతారు ? ... ఇందుకోసం ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తారు అనే విషయం కొద్ది రోజుల్లోనే తేలనుంది.

IPL_Entry_Point