TRS To BRS : టీఆర్ఎస్ ఇక బీఆర్ఎస్.. కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం-election commission approved trs party as brs party ,తెలంగాణ న్యూస్
Telugu News  /  Telangana  /  Election Commission Approved Trs Party As Brs Party

TRS To BRS : టీఆర్ఎస్ ఇక బీఆర్ఎస్.. కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం

టీఆర్ఎస్ టూ బీఆర్ఎస్
టీఆర్ఎస్ టూ బీఆర్ఎస్ (twitter)

TRS To BRS : తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా మారింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. ఇక టీఆర్ఎస్ పార్టీ ప్రస్థానం ముగిసి.. బీఆర్ఎస్ ప్రస్థానం మెుదలైంది.

టీఆర్ఎస్ పార్టీ(TRS Party)ని బీఆర్ఎస్(BRS)గా పేరు మార్చేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. దీంతో ఇక టీఆర్ఎస్ పార్టీ ప్రస్థానం ముగిసింది. బీఆర్ఎస్ ప్రస్థానం మెుదలైంది. తెలంగాణ రాష్ట్ర సమితి పేరును.. భారత రాష్ట్ర సమితిగా ఆమోదిస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘం... కేసీఆర్ కు లేఖ పంపింది. దీంతో శుక్రవారం మధ్యాహ్నం 1.20 నిమిషాలకు భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ కార్యక్రమాన్ని కేసీఆర్(KCR) నిర్వహించనున్నారు.

ట్రెండింగ్ వార్తలు

తెలంగాణ భవన్(Telangana Bhavan)లో శుక్రవారం కార్యక్రమం జరగనుంది. అదే సమయంలో తనకు అందిన లేఖపై కేసీఆర్ సంతకం చేస్తారు. ఇక బీఆర్ఎస్ జెండా(BRS Flag)ను ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతోపాటు పార్టీ నేతలు రానున్నారు.

అక్టోబర్ 5వ తేదీన దసరా రోజున టీఆర్ఎస్ ను బీఆర్ఎస్(TRS To BRS)గా మారుస్తున్నట్టుగా కేసీఆర్(KCR) ప్రకటించారు. దేశ రాజకీయాల్లోకి వెళ్తున్నట్టుగా తెలిపారు. తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీని.. బీఆర్ఎస్ పార్టీగా మారుస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ మేరకు ఆ రోజున నిర్వహించిన పార్టీ సమావేశంలో తీర్మానించారు. ఈ సమావేశానికి ఇతర రాష్ట్రాల నేతలు కూడా హాజరు అయ్యారు. అందరూ ఏకగ్రీవంగా ఆమోదించి.. ఆ తీర్మానాన్ని ఈసీకి పంపారు. తాజాగా ఈసీ కూడా ఆమోదించింది. దీంతో టీఆర్ఎస్ ప్రస్థానం ముగిసింది.

బీఆర్ఎస్ పేరు మార్పునకు ఆమోదం
బీఆర్ఎస్ పేరు మార్పునకు ఆమోదం

టీఆర్ఎస్ ప్రస్థానం..

ఎన్నో ఆశయాలతో 21 ఏళ్ల క్రితం టీఆర్ఎస్ పార్టీ(TRS Party) ఆవిర్భవించింది. తెలంగాణ(Telangana) సాధనే లక్ష్యంగా ఒక్కో అడుగు వేసుకుంటూ ముందుకు కదిలింది. స్వరాష్ట్రాన్ని సాధించేందుకు ఎన్నో పోరాటాలు చేసింది. హుస్సెన్ సాగర్ ఒడ్డున జలదృశ్యంలో 2001 ఏప్రిల్ 27న అతి తక్కువ మంది సమక్షంలో తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టింది. అలా మెుదలైన పార్టీ.. స్వరాష్ట్రాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించింది. 13 ఏళ్ల పోరాటం తర్వాత తెలంగాణ వచ్చింది. ఆ తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు జాతీయ స్థాయిలో సత్తా చాటేందుకు కేసీఆర్ బీఆర్ఎస్ గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక జాతీయ రాజకీయాలపై బీఆర్ఎస్ పూర్తిస్థాయి దృష్టి పెట్టనుంది.

WhatsApp channel