తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Siddipet : పెళ్లింట విషాదం.. కుమారుడి పెళ్లిరోజే రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి

Siddipet : పెళ్లింట విషాదం.. కుమారుడి పెళ్లిరోజే రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి

HT Telugu Desk HT Telugu

06 October 2024, 15:03 IST

google News
    • Siddipet : కొడుకు వివాహం కావడంతో అందరూ పెళ్లి పనుల్లో మునిగిపోయారు. బంధువులందరూ రావడంతో ఆ ఇంట సంబరాలు మొదలయ్యాయి. కాసేపట్లో కుమారుడి పెళ్లి. ఇంతలోనే రోడ్డు ప్రమాదం. ఆ యాక్సిడెంట్‌లో పెళ్లి కొడుకు తండ్రి దుర్మరణం పాలయ్యాడు. దీంతో పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో చావు మేళాలు వినిపించాయి.
రోడ్డు ప్రమాదానికి గురైన కారు
రోడ్డు ప్రమాదానికి గురైన కారు

రోడ్డు ప్రమాదానికి గురైన కారు

సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని మంతూర్‌లో తీవ్ర విషాదం జరిగింది. మంతూర్ గ్రామానికి చెందిన మహ్మద్ ఖాసీం (73) చిన్న కుమారుడు నిజాముద్దీన్ పెళ్లి శనివారం జరగాల్సి ఉంది. పనుల నిమిత్తం మహ్మద్ ఖాసీం, మరో కుమారుడు వసియోద్దీన్, భార్య సాహెరాతో కలిసి కారులో గజ్వేల్‌కి వెళ్లారు. అక్కడ పనులు ముగించుకొని కారులో తిరిగి వస్తున్నారు.

కారులో తిరిగి వస్తుండగా.. మార్గమధ్యలో వెంకట్రావుపేట శివారులోకి రాగానే అడవి పంది అడ్డుగా వచ్చింది. దానిని తప్పించబోయే క్రమంలో కారు అదుపు తప్పి చెట్టుకు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఖాసీం అక్కడికక్కడే మరణించగా.. అతని భార్య సాహెరా, కుమారుడు వసింకు కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

పెళ్లి బాజా మోగాల్సిన ఇంట్లో విషాదం జరిగింది. అందరితో కలుపుగోలుగా ఉండే ఖాసీం అకాల మరణం చెందడంతో.. మంతూరు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన అకాల మరణం పట్ల దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ వంటేరు యాదవ రెడ్డిలు ప్రగాఢ సంతాపం ప్రకటించారు. కొన్ని గంటల్లో కుమారుని పెళ్లి, సంతోషంగా ఉండాల్సిన తండ్రి రోడ్డు ప్రమాదంలో మృత్యువు కబలించడం బాధాకరమని దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి ద్రిగ్బాంతి వ్యక్తం చేశారు.

మెదక్‌లో మరో ఘటన..

ఓ పరిశ్రమలో కూలీగా వెళ్లిన యువకుడు మధ్యాహ్నం భోజనం చేయడానికి ఇంటికి ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. మార్గమధ్యలో బండి అదుపుతప్పి కిందపడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. వెల్దుర్తి మండలం బండమీదిపల్లికి చెందిన గుణయ్య (28), చిన్నశంకరంపేట మండలం చందంపేటలో ఉన్న ఓ పరిశ్రమలో కూలీ పనులు చేస్తుంటాడు.

గుణయ్యకు చేగుంట మండలం రుక్మాపూర్‌కు చెందిన యువతితో ఆర్నెళ్ల కిందట వివాహమైంది. మధ్యాహ్నం భోజనం చేసేందుకు బైక్ పై పరిశ్రమ నుండి ఇంటికి వస్తున్న క్రమంలో.. బైక్ అదుపుతప్పి కిందపడింది. ఈ ప్రమాదంలో గుణయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. భర్త మరణ వార్త విన్న భార్య గుండెలవిసేలా రోదిస్తుంది. మృతుడి తల్లి బాలమణి ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

తదుపరి వ్యాసం