TGPSC Group 2 : గ్రూప్ 2 వాయిదా వేసే ఛాన్స్...? కారణాలివేనా
06 July 2024, 12:21 IST
- TGPSC Group 2 Exams Updates : తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు వాయిదా పడే అవకాశం ఉంది. వెంటవెంటనే పరీక్షలు ఉండటంతో అభ్యర్థులకు గడువు ఇచ్చే ఆలోచనలో సర్కార్ ఉందని సమాచారం.
గ్రూప్ 2 వాయిదా వేసే అవకాశం
తెలంగాణలో గ్రూప్ 2 వాయిదా వేసే అవకాశం ఉంది. ఇప్పటికే నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం… గ్రూప్ 2 తోపాటు డీఎస్సీ పరీక్షలు వెంటవెంటనే ఉన్నాయి. దీంతో అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. చాలా మంది అభ్యర్థులు గడువు పెంచాలని కోరుతున్నారు.
నిరుద్యోగుల నుంచి వస్తున్న విజ్ఞప్తులను పరిశీలిస్తున్న ప్రభుత్వం…. గ్రూప్ 2 వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. నిరుద్యోగుల ఆందోళనపై సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశంలోనూ… పరీక్షల షెడ్యూల్ పై చర్చ జరిగింది. ఈ నేపథ్యంలోనే టీజీపీఎస్సీకి ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. పరీక్ష వాయిదాకి సంబంధించి ఇవాళ అధికారిక ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది…!
మొత్తం 783 పోస్టులతో టీఎస్‌పీఎస్సీ గతేడాది గ్రూప్ 2 ఉద్యోగ ప్రకటన జారీ చేసింది. 2023 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16వరకు దరఖాస్తులు స్వీకరించింది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు ఉంటాయని గతంలోనే కమిషన్ తెలిపింది.
తొలుత గతేడాది ఆగస్టు 29, 30న గ్రూప్-2 పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించింది. వరుసగా గ్రూప్-1, 4 పరీక్షలు, గురుకుల నియామక పరీక్షలతో పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యేందుకు సమయం లేనందున గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. ఈ మేరకు పరీక్షలను నవంబరు 2, 3 తేదీలకు రీషెడ్యూలు చేసింది కమిషన్.
నవంబరు 3 నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో కమిషన్ ఈ పరీక్షలను మళ్లీ 2024 జనవరి 6, 7 తేదీలకు రీషెడ్యూలు చేసింది టీఎస్పీఎస్సీ. కానీ రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావటంతో మళ్లీ కొత్త తేదీలను ప్రకటించారు. ఇందులో భాగంగా… ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు ఉంటాయని మార్చి నెలలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరోసారి ప్రకటన చేసింది.
ప్రస్తుతం పరిస్థితి చూస్తే ఇదే నెలలో డీఎస్సీ పరీక్షలు ఉన్నాయి. దీంతో పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో గ్రూప్ 2 పోస్టులను పెంచటంతో పాటు గడువును కూడా పెంచాలని ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం టీజీపీఎస్సీ ముట్టడికి పిలుపునిచ్చారు.
సీఎం సమీక్ష - కీలక ప్రకటన
నిరుద్యోగులపై ఆందోళనలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం సమీక్షించారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. తప్పకుండా నిరుద్యోగులకు మేలు జరిగే నిర్ణయాలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.
నిరుద్యోగులకు ఇచ్చిన హామీ ప్రకారం తమ ప్రభుత్వం ఇప్పటికే 28,942 ఉద్యోగ నియామకాలు చేపట్టిందని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఏళ్లకు ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నియామకాలకు ఉన్న కోర్టు చిక్కులన్నింటిని అధిగమించిందని చెప్పారు.
జాబ్ క్యాలెండర్ ప్రకారం పోటీ పరీక్షలు నిర్వహించి, ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. శాసనసభ బడ్జెట్ సమావేశాల్లోనే చర్చించి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నియామక పరీక్షలు, వివిధ బోర్డులు నిర్వహించే పరీక్షలతో ఆటంకాలు ఏర్పడకుండా నిరుద్యోగులకు పూర్తి న్యాయం జరిగేలా క్యాలెండర్ రూపొందిస్తామన్నారు.