TGSRTC Special Buses : కురుమూర్తి స్వామి భక్తులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్‌న్యూస్
01 November 2024, 16:35 IST
- TGSRTC Special Buses : పేదల తిరుపతి కురుమూర్తి స్వామి జాతరకు వేళైంది. స్వామివారి భక్తులు ఆలయానికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో.. తెలంగాణ ఆర్టీసీ భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. జాతరకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు వెల్లడించింది.
కురుమూర్తి స్వామి ఆలయం
తెలంగాణలో ప్రసిద్ధ క్షేత్రం శ్రీ కురుమూర్తి స్వామి ఆలయం. ఇక్కడ నవంబర్ మాసంలో జాతర జరుగుతుంది. ఈ జాతరకు వెళ్లే భక్తుల సౌకర్యం కోసం.. తెలంగాణ ఆర్టీసీ హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతోంది. జాతరలో ప్రధాన ఘట్టమైన ఉద్దాల ఉత్సవం ఈ నెల 8వ తేదిన జరగనుంది. దీంతో 7 నుంచి 9వ తేది వరకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో ఆయా రోజుల్లో ప్రత్యేక బస్సులను హైదరాబాద్ నుంచి ఆర్టీసీ అందుబాటులో ఉంచుతోంది. ఎంజీబీఎస్ నుంచి ఆరాంఘర్, మహబూబ్‌నగర్ మీదుగా జాతరకు వెళ్తాయి. ఈ స్పెషల్ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్‌ను కల్పిస్తున్నారు. టికెట్ల బుకింగ్ కోసం http://tgsrtcbus.in వెబ్ సైట్‌ను సంప్రదించవచ్చు. ఈ ప్రత్యేక బస్సులను ఉపయోగించుకుని సురక్షితంగా శ్రీ కురుమూర్తి స్వామిని దర్శించుకోవాలని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం కోరింది.
కురుమూర్తి వెంకటేశ్వరస్వామి దేవాలయం మహబూబ్ నగర్ జిల్లాలోని చిన్నచింతకుంట మండలంలోని కురుమూర్తి గ్రామంలో ఉంది. ఈ ఆలయానికి మహబూబ్ నగర్ జిల్లాలోనే అతి పురాతనమైన దేవస్థానంగా పేరుంది. తిరుమల వేంకటేశ్వర దేవాలయానికి, కురుమూర్తి దేవాలయానికి పోలికలున్నాయి. పూర్వం కురుమూర్తికి కురుమతి పేరు ఉన్నట్లు దేవాలయ చరిత్ర చెబుతోంది. కాంచన గుహగా పేరొందిన కురుమూర్తి కొండలలో ఉన్న వెంకటేశ్వరస్వామిని వైకుంఠ ఏకాదశి రోజున భక్తులు దర్శించుకుంటారు.
స్వామివారు మొదట్లో సహజ సిద్ధమైన గుహలలో పెద్ద రాతిగుండు కింద ఉండేవారు. భక్తులు గుహ లోపలికి వెళ్లి స్వామివారిని దర్శించుకునేవారు. రోజురోజుకూ భక్తుల సంఖ్య ఎక్కువ కావడంతో.. గర్భగుడికి గోపురం నిర్మించారు. దానిముందు మండప నిర్మించి ధ్వజ స్తంభం ఏర్పాటు చేశారు. దీంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నా సులభంగా దర్శించుకునే అవకాశం కలిగింది.
కురుమూర్తి స్వామి సన్నిధిలోని మరో ఆచారం ఉంది. అదే మట్టికుండ. అప్పంపల్లి గ్రామానికి చెందిన కుమ్మరులు దీన్ని తయారుచేస్తరు. ఆ మట్టికుండను ‘తలియకుండ’ మండపంలో ఉంచి, నెల్లి వంశస్థులు పూజలు నిర్వహిస్తారు. ఆ సమయంలో భారీగా బాణసంచా కాలుస్తారు. డప్పు వాయిద్యాలతో మట్టికుండను ఉద్దాల మండపం వద్దకు చేరుస్తారు. ఈ తంతు కన్నుల పండువగా సాగుతుంది.