Medaram 2022: మేడారం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. ఎంజీబీఎస్ నుంచి డైలీ సర్వీసులు
మేడారం జాతర కోసం తెలంగాణ ప్రభుత్వం దాదాపు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం టీఎస్ ఆర్టీసీ 3 వేలకుపైగా ప్రత్యేక బస్సులను నడుపుతోంది. హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి 5 ప్రత్యేక సర్వీసులు నడవనున్నాయి.
తెలంగాణ కుంభమేళా మేడారం జాతర కోసం.. టీఎస్ఆర్టీసీ పక్కా ప్రణాళికతో బస్సు సర్వీసులు నడుపుతోంది. ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు సమ్మక్క-సారక్క జాతర జరగనుంది. భక్తులు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటుంది. దాదాపు 3400 బస్సులను మేడారం జాతర కోసం ఉపయోగిస్తున్నారు. రాష్ట్రంలోని అన్నీ ప్రాంతాల నుంచి ఈ బస్సు సర్వీసులు ఉంటాయి. 30 మంది ప్రయాణికులు ఉంటే ఇంటి వద్దకే బస్సు వస్తుందని ఇటీవలే ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చెప్పారు. స్థానిక డిపో మేనేజర్ ని సంప్రదిస్తే.. అన్నీ వివరాలు చెబుతారని పేర్కొన్నారు. అయితే కొత్తగా ఎంజీబీఎస్ నుంచి కూడా.. మేడారానికి డైలీ సర్వీసులు ఉంటాయని ఆర్టీసీ ప్రకటించింది.
పికెట్ డిపో ఆర్టీసీ బస్సు ఉదయం 5 గంటలకు ఎంజీబీఎస్ నుంచి మేడారం వెళ్తుంది. మధ్యాహ్నం 2 గంటలకు మేడారం నుంచి తిరిగి ఎంజీబీఎస్ కు బయలుదేరుతుంది. HYD-1 డిపో బస్సు ఎంజీబీఎస్ నుంచి ఉదయం 6 గంటలకు మేడారం జాతరకు బయలుదేరి.. తిరిగి సాయంత్రం 3 గంటలకు మేడారం నుంచి హైదరాబాద్ కు బయలుదేరుతుంది. HYD-1 డిపో ఆర్టీసీ బస్సు ఎంజీబీఎస్ నుంచి ఉదయం 7 గంటలకు మేడారానికి వెళ్తుంది. తిరిగి సాయంత్రం 4 గంటలకు మేడారం నుంచి హైదరాబాద్ కు బయలుదేరుతుంది.
HYD-1 డిపో ఆర్టీసీ బస్సు ఉదయం 8 గంటలకు ఎంజీబీఎస్ నుంచి మేడారానికి మెుదలవుతుంది. ఇదే బస్సు సాయంత్రం 5 గంటలకు మేడారం నుంచి ఎంజీబీఎస్ కు బయలుదేరుతుంది. PKT డిపో ఆర్టీసీ బస్సు ఎంజీబీఎస్ నుంచి ఉదయం 9 గంటలకు మేడారానికి బయలుదేరి వెళ్తుంది. సాయంత్రం 6 గంటలకు మేడారం నుంచి ఎంజీబీఎస్ కు బయలుదేరి వస్తుంది.