KTR On RRR: ఛెలో షోతో RRR ఎందుకు ఓడిపోయింది…? కేటీఆర్ రిప్లే ఇదే
22 September 2022, 12:07 IST
- ఆస్కార్ బరి నుంచి ఆర్ఆర్ఆర్ మూవీ ఔట్ కావటంపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. తెలంగాణ బీజేపీ నేతలను టార్గెట్ చేస్తూ పలు సెటైర్లు విసిరారు. మరోవైపు కేటీఆర్ టార్గెట్ గా బీజేపీ నేత అమిత్ మాలవీయ ట్వీట్ చేశారు.
మంత్రి కేటీఆర్ (ఫైల్ ఫొటో)
KTR Tweet On RRR Movie: 2023 ఆస్కార్స్‌లో తప్పకుండా RRR సినిమా పోటీగా నిలుస్తుందని చాలామంది భావించారు. కానీ గుజరాత్ కు చెందిన ' ఛెలో షో ' 2023 ఆస్కార్స్‌లో ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనుంది. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన సెలక్షన్ కమిటీ ఈ సినిమాను ఎంపిక చేసింది. దీంతో ఇటు రాంచరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్సే కాదు తెలుగు ప్రేక్షకులు కూడా చాలా డిసపాయింట్ అయ్యారు. అయితే దీనిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది.
professor nageshwar on rrr oscar: ఆస్కార్ బరి నుంచి ఆర్ఆర్ఆర్ ఔట్ కావటం, గుజరాత్ కు చెందిన ఛెలో షోను ఎంపిక చేయటంపై ఉస్మానియా వర్శిటీ ప్రొఫెసర్, మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ ఓ ట్వీట్ చేశారు. 'ఆస్కార్ రేస్ లో గుజరాత్ ఛెలో షో తో పోటీ పడి మన ఆర్ఆర్ఆర్ ఓడిపోయింది. మన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కూడా రాలే. కానీ గుజరాత్ కు లోకోమోటివ్ ఫ్యాక్టరీ వచ్చింది. మా హైదరాబాద్ కు వచ్చిన WHO సెంటర్ గుజరాత్ కు తరలిపోయింది. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ఆర్బిట్రేషన్ సెంటర్ కు పోటీగా గుజరాత్ సిటీలో ఏర్పాటు చేసిన GIFT పోటీదారుడిగా మారింది' అంటూ రాసుకొచ్చారు.
ఈ ట్వీట్ పై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ నేతలపై విమర్శలు గుప్పించారు. ఈ విషయాలపై తెలంగాణకు చెందిన ఒక్క బీజేపీ జోకర్ కూడా ప్రశ్నించలేరు. డిమాండ్ చేసే దమ్ము కూడా లేదు. గుజరాతీ బాస్‌ల చెప్పులు మోయడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. కానీ తెలంగాణ హక్కులను డిమాండ్ చేసే ధైర్యం వారు చేయలేరు. మోడీవర్స్‌కు గుజరాత్ కేంద్రం' అంటూ రాసుకొచ్చారు. పరోక్షంగా బండి సంజయ్ చెప్పులు పట్టుకున్న అంశాన్ని తన ట్వీట్ లో ప్రస్తావించారు.
ఎందుకు సాధ్యం కాదు…?
ఇక మంత్రి కేటీఆర్ హిందూ పత్రికకు ఇంటర్వూ ఇచ్చారు. ఈ సందర్భంగా విలేకర్లు అడిగిన ఓ ప్రశ్నకు స్పందిస్తూ... బాహుబలి, పుష్ప, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో రాణించినప్పుడు కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ఎందుకు రాణించలేరు అంటూ ప్రశ్నించారు. ఇక కామెంట్స్ పై బీజేపీ నేతలు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. దీనిపై ట్విట్టర్ వేదిక అమిత్ మాలవీయా ట్వీట్ చేశారు. కేసీఆర్ పుష్ప, బాహుబలిలా కాదు లైగర్ చిత్రం లాంటి ఫాంహౌస్ రిపబ్లిక్ అంటూ కౌంటర్ ఇచ్చారు. బాహుబలి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కమలం(పుష్ప) పార్టీ మాత్రమే దేశ శక్తిని చాటుతుంది. ఈ నాయకత్వంలోనే సంస్కరణల దిశగా దేశం (Rapidly Reforming Rashtra )వేగంగా అడుగులు వేస్తోంది' అంటూ రాసుకొచ్చారు.