IAS Transfers : తెలంగాణలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ - ఉత్తర్వులు జారీ
03 August 2024, 13:25 IST
- IAS Transfers in Telangana : తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఐఏఎస్‌ల బదిలీ
IAS Transfers in Telangana : తెలంగాణలో మరో ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శనివారం ఉత్తర్వులను జారీ చేశారు.రవాణా, ఆర్అండ్‌బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వికాస్‌రాజ్ బదిలీ కాగా….వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌గా రిజ్వీకి అదనపు బాధ్యతలు అప్పగించారు.మార్కెటింగ్ శాఖ డైరెక్టర్‌గా ఉదయ్ కుమార్‌కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
ఐఏఎస్‌ల బదిలీ - వివరాలు
- ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషషనర్‌గా టీకే శ్రీదేవి బదిలీ .
- వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌గా రిజ్వీకి అదనపు బాధ్యతలు .
- రవాణా, ఆర్అండ్‌బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వికాస్‌రాజ్ బదిలీ.
- రవాణా, ఆర్‌అండ్‌బీ సంయుక్త కార్యదర్శిగా ఎస్.హరీశ్‌కు అదనపు బాధ్యతలు.
- మార్కెటింగ్ శాఖ డైరెక్టర్‌గా ఉదయ్‌కుమార్‌కు అదనపు బాధ్యతలు .
- పురపాలక శాఖ ఉప కార్యదర్శిగా ప్రియాంక.
- హాకా ఎండీగా చంద్రశేఖర్‌రెడ్డి.
- మార్క్‌ఫెడ్ ఎండీగా శ్రీనివాస్‌రెడ్డి.
సీఎం రేవంత్ అమెరికా పర్యటన
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ్టి నుంచి అమెరికాలో పర్యటించనున్నారు. 12 రోజుల పాటు అమెరికాలోనే ఉంటారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించటమే లక్ష్యంగా ఈ టూర్ ను నిర్ణయించారు. సీఎంతో ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, పలువురు ఎమ్మెల్యేలు కూడా టూర్ లో ఉన్నారు.
న్యూజెర్సీ, న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ, శాన్‌ఫ్రాన్సిస్‌కో, దక్షిణ కొరియాలోని సియోల్ తదితర ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటించనుంది. ఎనిమిదిరోజులు అమెరికాలో పర్యటిస్తారు. ఆ తర్వాత మరో రెండు రోజులు దక్షిణ కొరియాలో ఉంటారు. ఆగస్టు 14న సీఎం రేవంత్ రెడ్డి టీమ్ హైదరాబాద్‌కు చేరుకునే అవకాశం ఉంది.
ఈ పర్యటనలో భాగంగా పలు కంపెనీలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలున్నాయి. అమెరికాలోని ప్రవాస భారతీయులతోనూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఈ టూర్ లో భాగంగా పలు కంపెనీల సీఈవోలు, ప్రతినిధులతో రేవంత్ టీమ్ భేటీ అవుతుంది. రాష్ట్రంలో కల్పిస్తున్న మౌలకి వసతులతో పాటు పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించే ప్రయత్నం చేస్తారు.
ఆనంద్ మహీంద్రతో సీఎం భేటీ
మరోవైపు శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు, ఇతర కీలక అంశాలపై చర్చించారు.
తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీ గురించిన ముఖ్యమంత్రి వివరించారు. స్కిల్ వర్సిటీలో బోధించే 17 విభాగాల్లో ఒకటైన "ఆటోమోటివ్ డిపార్ట్‌మెంట్"ను దత్తత తీసుకోవడానికి ఆనంద్ మహీంద్ర అంగీకరించారు. ఆ కోర్సుకు సంబంధించిన కరికులం తయారీ కోసం మహీంద్రా గ్రూప్ నుంచి నిపుణుల బృందాన్ని కూడా పంపుతామన్నారు. హైదరాబాద్‌లోని క్లబ్ మహీంద్రా హాలిడే రిసార్ట్ విస్తరణకు సహకరించాల్సిందిగా ఆనంద్ మహీంద్ర… ముఖ్యమంత్రిని కోరారు.