Skills University : ప్యూచర్ సిటీగా ముచ్చర్ల - స్కిల్ యూనివర్సిటీకి సీఎం రేవంత్ శంకుస్థాపన-cm revanth laid foundation stone for young india skills university ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Skills University : ప్యూచర్ సిటీగా ముచ్చర్ల - స్కిల్ యూనివర్సిటీకి సీఎం రేవంత్ శంకుస్థాపన

Skills University : ప్యూచర్ సిటీగా ముచ్చర్ల - స్కిల్ యూనివర్సిటీకి సీఎం రేవంత్ శంకుస్థాపన

Maheshwaram Mahendra Chary HT Telugu
Aug 01, 2024 09:44 PM IST

Young India Skills University : రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేటలో స్కిల్ వర్సిటీ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ… స్కిల్ వర్శిటీలో అడ్మిషన్ దొరికితే ఉద్యోగం లభించే దిశగా ప్రణాళికలు ఉంటాయని చెప్పారు.

మీర్‌ఖాన్‌పేటలో స్కిల్‌ యూనివర్సిటీ
మీర్‌ఖాన్‌పేటలో స్కిల్‌ యూనివర్సిటీ

హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, సైబరాబాద్‌లకు ధీటుగా ఆధునిక మౌలిక సదుపాయాలతో అత్యాధునికంగా నాలుగో నగరాన్ని నిర్మించి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు.

ముచ్చర్ల ప్రాంతంలో హెల్త్ టూరిజం హబ్, స్పోర్ట్స్ హబ్, ఎడ్యుకేషన్ హబ్ వంటివాటిని అభివృద్ధి చేయడం, పక్కనే ఆమన్‌గల్ అర్బన్ అడవుల్లో నైట్ సఫానీ పెట్టడం వంటి వాటితో మొత్తంగా ఈ ప్రాంతాన్ని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని వివరించారు.

కందుకూరు మీర్‌ఖాన్‌పేట్ వద్ద నెట్‌జీరో సిటీలో ప్రతిపాదిత స్కిల్ యూనివర్సిటీతో పాటు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్, మోడ్రన్ స్కూల్, ప్రైమరీ హెల్త్ సెంటర్, కమ్యూనిటీ సెంటర్‌లకు ముఖ్యమంత్రి ఏకకాలంలో శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తూ నాలుగో నగర నిర్మాణం కోసం చేపట్టే కార్యక్రమాలు, దాని ప్రాముఖ్యతను వివరించారు.

ఈ ప్రాంతంలో భూమి కోల్పోయిన ప్రజలు అధైర్యపడొద్దన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వారందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. ఆ కుటుంబాల్లో పిల్లలకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తుందని చెప్పారు. ఈ ప్రాంత ప్రజల భవిష్యత్తు కోసం ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోందన్నారు. ఈ ప్రాంతం ఫ్యూచర్ సిటీగా మారబోతుందని చెప్పుకొచ్చారు.

“ న్యూయార్క్ నగరం కంటే అధునాతన నగరాన్ని ఇక్కడ నిర్మించడం జరుగుతుంది. ఎల్బీనగర్‌ నుంచి ఎయిర్‌పోర్ట్‌ వరకు మెట్రో రైలును విస్తరించడం, ఆ తర్వాత దాన్ని నెట్‌ జీరో సిటీ వరకు పొడగిస్తాం. ఆ ప్రాంతం వరకు 200 అడుగులతో రోడ్డు మార్గాన్ని నిర్మించటం జరుగుతుంది” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.

వచ్చే మూడు నెలల్లో రీజినల్‌ రింగ్‌ రోడ్డు పనులకు శ్రీకారం చుడుతామన్నారు. స్కిల్ యూనివర్సిటీలో అడ్మిషన్ లభించిందంటే కచ్చితంగా ఉద్యోగం లభించే ప్రణాళికలు ఉంటాయని చెప్పారు. నాలుగో నగరంగా ఏర్పడటానికి కీలకమైన విద్య, వైద్యం, ఇతర మౌళిక సదుపాయాలను కల్పించి ముచ్చర్లను ఫ్యూచర్‌ సిటీగా మారుస్తామన్నారు.