Mee Seva Online : 'మీ సేవ'లో కొత్తగా 9 సేవలు..! ఇక ఎమ్మార్వో ఆఫీసుకు వెళ్లకుండానే ఈ పత్రాలను పొందవచ్చు
31 August 2024, 13:32 IST
- మీ సేవ సర్వీసులో మరో 9 కొత్త సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఫలితంగా పలు ధ్రువీకరణ పత్రాలను తహసీల్దారు కార్యాలయాల్లో కాకుండా ఆన్‌లైన్ ద్వారానే అందజేయనున్నారు.
మీ సేవలో మరో 9 సేవలు
‘మీ-సేవ’ సేవలకు సంబంధించిన తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా తొమ్మిది రకాల సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. పలు ధ్రువీకరణ పత్రాలను ఎమ్మార్వో ఆఫీసుల్లో కాకుండా నేరుగా ఆన్ లైన్ ద్వారానే పొందేలా చర్యలు తీసుకుంది. ఈ మేరకు భూ పరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయం వివరాలను వెల్లడించింది. ఈ 9 రకాల పత్రాలకు సంబంధించిన వివరాలు ‘మీ సేవ’లో ఉంచేలా తక్షణమే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది.
సీసీఎల్ఏ తాజా నిర్ణయంతో పౌరులకు మరింత మెరుగైన సేవలు అందనున్నాయి. ఇందులో భాగంగా… స్టడీ గ్యాప్ సర్టిఫికెట్, ఖాస్రా/ పహాణీలు, ఆర్వోఆర్-1(బి) సర్టిఫైడ్ కాపీలు, పౌరుల పేరు మార్పు, స్థానికత నిర్ధారణ (లోకల్ క్యాండిడేట్), క్రిమీలేయర్, నాన్ క్రిమీలేయర్, మైనారిటీ ధ్రువీకరణ పత్రం, మార్కెట్ వాల్యూ కాపీలను నేరుగా మీసేవ ద్వారానే పొందే అవకాశం ఉంటుంది.
‘మీ సేవలో’ పౌరులకు ప్రభుత్వ సేవలు అందుతాయి. ఇది గవర్నమెంట్ 2 సిటిజన్, గవర్నమెంట్ 2 గవర్నమెంట్ గా ఉంటుంది. సాంకేతికత ద్వారా సులభతరంగా పౌరులకు ప్రభుత్వ సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో ఈ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చారు. సమర్థవంతమైన సేవలను అందిచటమే మీ - సేవల లక్ష్యంని చెప్పొచ్చు.
ఈ సర్వీసుల్లో భాగంగా… రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ సర్వీసులను పొందవచ్చు. ఎలాంటి వివక్ష లేకుండా ప్రతి పౌరుడికి సేవలు అందించే వీలుగా ఈ వ్యవస్థను రూపొందించారు.
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అందించే అనే పథకాలతో పాటు ప్రభుత్వ సేవలు మీసేవ ద్వారా పొందుతున్నారు. వీటికి తోడుగా తాజాగా మరో తొమ్మిది సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫలితంగా పౌరులకు మరిన్ని సేవలు అందటంతో పాటు తహసీల్దార్ కార్యాలయాల చుట్టు తిరిగే బాధలు తప్పనున్నాయి.