ACB Raids On MRO : భూమి రిజిస్ట్రేషన్ కు లంచం డిమాండ్- ఏసీబీకి చిక్కిన ఎమ్మార్వో, ధరణి ఆపరేటర్-hanamkonda acb raids on kamalapur mro taking bribe for land registration ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Acb Raids On Mro : భూమి రిజిస్ట్రేషన్ కు లంచం డిమాండ్- ఏసీబీకి చిక్కిన ఎమ్మార్వో, ధరణి ఆపరేటర్

ACB Raids On MRO : భూమి రిజిస్ట్రేషన్ కు లంచం డిమాండ్- ఏసీబీకి చిక్కిన ఎమ్మార్వో, ధరణి ఆపరేటర్

HT Telugu Desk HT Telugu
May 20, 2024 09:54 PM IST

ACB Raids On MRO : తండ్రి నుంచి వచ్చిన ఆస్తిని తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ఓ వ్యక్తి తహసీల్దార్ వద్దకు వెళ్లగా ఆమె లంచం డిమాండ్ చేసింది. దీంతో అతడు ఏసీబీని ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు ప్లాన్ వేసి ఎమ్మార్వో, ధరణి ఆపరేటర్ ను పట్టుకున్నారు.

భూమి రిజిస్ట్రేషన్ కు లంచం డిమాండ్- ఏసీబీకి చిక్కిన ఎమ్మార్వో, ధరణి ఆపరేటర్
భూమి రిజిస్ట్రేషన్ కు లంచం డిమాండ్- ఏసీబీకి చిక్కిన ఎమ్మార్వో, ధరణి ఆపరేటర్

ACB Raids On MRO : భూమి రిజిస్ట్రేషన్ విషయంలో లంచం డిమాండ్ చేసిన ఓ ఎమ్మార్వో ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కారు. ధరణి ఆపరేటర్ ద్వారా లంచం తీసుకుంటుండగా, అవినీతి నిరోధక శాఖ అధికారులు ఎంట్రీ ఇవ్వడంతో అవినీతి గుట్టురట్టయ్యింది. వరంగల్ ఏసీబీ డీఎస్పీ పి.సాంబయ్య తెలిపిన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని కన్నూరు గ్రామానికి చెందిన కాసరబోయిన గోపాల్ వ్యవసాయం చేస్తుంటాడు. తన తండ్రి పేరు మీద కొంత భూమి ఉండగా, అందులో మూడు ఎకరాల రెండు గుంటలను తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఈ నెల 9న సమీపంలోని మీ సేవలో అప్లికేషన్ పెట్టుకున్నారు. ఈ మేరకు చలాన్ కు డబ్బులు కట్టి, 10వ తేదీన రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు రెడీ అయ్యారు. ఈ మేరకు స్లాట్ బుక్ చేసుకున్న ప్రకారం ఈ నెల 10న కమలాపూర్ లోని ఎమ్మార్వో ఆఫీస్ కు వెళ్లాడు. అక్కడున్న ఎమ్మార్వో మాధవి గోపాల్ కు సంబంధించిన అప్లికేషన్ ను ఉద్దేశ పూర్వకంగానే చూడకుండా వదిలేశారు.

రూ.ఆరు వేలు డిమాండ్.. 5 వేలకు ఒప్పందం

స్లాట్ బుక్ చేసుకున్నా రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో గోపాల్ ఈ నెల 18వ తేదీన మరోసారి కమలాపూర్ ఎమ్మార్వో ఆఫీస్ కు వెళ్లాడు. అక్కడ తహసీల్దార్ మాధవిని కలవగా, భూమి గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేసేందుకు రూ.6 వేలు లంచం డిమాండ్ చేశారు ఎమ్మారో. అందులో ధరణి ఆపరేటర్ కు రూ.వెయ్యి, తనకు రూ.5 వేలు ఇవ్వాల్సిందిగా చెప్పారు. దీంతో గోపాల్ బేరసారాలాడగా, చివరకు రూ.5 వేలకు ఒప్పందం కుదిరింది. ధరణి ఆపరేటర్ కు రూ.వెయ్యి, ఎమ్మార్వో కు రూ.4 వేలు మొత్తంగా రూ.5 వేలు ధరణి ఆపరేటర్ రాకేష్ కు ఇవ్వాల్సిందిగా సూచించింది. ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకున్న గోపాల్.. న్యాయంగా జరగాల్సిన పనికి లంచం ఇవ్వడం ఇష్టం లేక వరంగల్ ఏసీబీ డీఎస్పీ పి.సాంబయ్యను సంప్రదించారు.

రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ

బాధితుడు గోపాల్ బాధ విని ఏసీబీ అధికారులు పథకం రచించి, ఆయనను అక్కడి నుంచి పంపించేశారు. ఈ మేరకు సోమవారం ముందస్తు ప్లాన్ ప్రకారం గోపాల్ రూ.5 వేలు తీసుకుని ఎమ్మార్వో ఆఫీస్ కు వెళ్లాడు. అక్కడ తహసీల్దార్ మాధవి ఆదేశాల మేరకు ధరణి ఆపరేటర్ రాకేశ్ కు రూ.5 వేలు లంచం ఇచ్చాడు. రైతు గోపాల్ నుంచి కుమార్ లంచం తీసుకుంటుండగా, ఏసీబీ అధికారులు రంగ ప్రవేశం చేశారు. రాకేష్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని విచారించారు. తహసీల్దార్ మాధవి ఆదేశాల మేరకే లంచం తీసుకున్నట్లు రాకేష్ స్పష్టం చేయడంతో ఎమ్మార్వో మాధవి, ధరణి ఆపరేటర్ రాకేష్ ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కాగా తహసీల్దార్ మాధవి గతంలో భూపాలపల్లిలో పని చేసిన సమయంలో కూడా అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇప్పుడు కమలాపూర్ మండలంలో కూడా ఆరోపణలు రావడం, ధరణి ఆపరేటర్ ద్వారా లంచం తీసుకుంటున్నట్టు తేలడంతో తహసీల్దార్ మాధవి గుట్టు బయటపడింది. ఇదిలాఉంటే లంచం తీసుకుంటూ పట్టుబడిన ఎమ్మార్వో మాధవితో పాటు ధరణి ఆపరేటర్ రాకేష్ ను వరంగల్ ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని డీఎస్పీ సాంబయ్య వివరించారు.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

సంబంధిత కథనం