New Secretariat: నూతన సచివాలయం ప్రారంభం.. కీలక దస్త్రంపై CM KCR తొలి సంతకం
30 April 2023, 15:14 IST
- CM KCR Inaugurates New Secretariat:తెలంగాణ నూతన సచివాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేస్తూ తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా మొత్తం ఆరు ఫైళ్లపై సంతకాలు చేశారు.
సీఎం కేసీఆర్
Telangana New Secretariat:తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన సచివాలయ ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నూతన సచివాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. తొలుత ప్రధాన ప్రవేశ గేటు వద్ద పూజలు నిర్వహించారు. అనంతరం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హోమశాల వద్ద యాగ పూర్ణాహుతిలో పాల్గొన్నారు. అనంతరం ఆరో అంతస్తులోని తన ఛాంబరుకు చేరుకొని పలు దస్త్రాలపై కేసీఆర్ సంతకాలు చేశారు.
తొలి సంతకం ఇదే….
సచివాలయం ప్రారంభోత్సం సందర్భంగా కీలక దస్త్రంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణపై తొలి సంతకం చేశారు. సరిగ్గా ముహూర్త సమయానికి ఆరో అంతస్థులోని తన సీటులో కూర్చున్న ముఖ్యమంత్రి కేసీఆర్... మొత్తం ఆరు దస్త్రాలపై సంతకాలు చేశారు . ఈ సందర్భంగా పలువురు మంత్రులు… కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఇక మంత్రి కేటీఆర్… హైదరాబాద్‌లో లక్ష బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ సంతకం చేశారు.
విశేషాలివే…
తెలంగాణ సచివాలయాన్ని మొత్తం 28 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. మొత్తం నిర్మాణ విస్తీర్ణం 10,51,676 చదరపు అడుగులు ఉంటుంది. 265 అడుగుల ఎత్తున భవనాన్ని నిర్మించారు.. ఇందులో 8 ఎకరాలను పూర్తిగా పచ్చదనం కోసమే కేటాయించారు. కొత్త సచివాలయంలో 11 అంతస్తుల ఎత్తుతో ప్రధాన నిర్మాణం కనిపించినా ఆరో అంతస్తులో పరిపాలన కేంద్రీకృతం కానుంది. ముఖ్యమంత్రి కార్యాలయం, మంత్రివర్గ సమావేశ మందిరాలను ఆరో అంతస్తులో ఏర్పాటు చేశారు..ఇండో పర్షియన్ శైలిలో డోముల నిర్మాణం జరిగింది.ప్రస్తుతం ఉన్న 16 మంది మంత్రుల కార్యాలయాలను 2 నుంచి 5 అంతస్తుల్లో ఏర్పాటు చేశారు. ఒకటి, రెండు అంతస్తుల్లో సాధారణ పరిపాలన, ఆర్థిక శాఖల కార్యాలయాలు ఉంటాయి. 3 నుంచి 5 అంతస్తుల్లో ఇతర శాఖలకు సంబంధించిన మంత్రులు, విభాగాల కార్యాలయాలను ఏర్పాటు చేశారు.
సచివాలయంలో అద్భుతమైన, సౌకర్యవంతమైన ఫర్నిచర్‌ను ఏర్పాటు చేశారు. మొత్తం 22 వేల ఫర్నిచర్ వస్తువులు అందుబాటులో ఉంచారు. మంత్రులకు 23 చాంబర్లు ఏర్పాటు చేశారు. 26 కాన్ఫరెన్స్ రూములు ఉన్నాయి. మరో 4 కాన్ఫరెన్స్ హాళ్లు కూడా త్వరలో అందుబాటులోకి రానున్నాయి. సచివాలయంలోని ప్రతీ ఫ్లోర్‌లో ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా డైనింగ్ ఏరియాను ఏర్పాటు చేశారు.మంత్రులు, సెక్రెటరీలు, ప్రిన్సిపల్ సెక్రెటరీలు, సీఎస్‌కు ప్రత్యేకంగా జాబితాలు రూపొందించారు. 1,190 మంది సెక్షన్ ఆఫీసర్లకు, 106 మంది అసిస్టెంట్ సెక్రటరీలు, 59 మంది డిప్యూటీ సెక్రటరీలకు, 29 మంది అదనపు/జాయింట్ సెక్రటరీలకు, 58 మంది సెక్రటరీ, ఆపై స్థాయి అధికారులకు ప్రత్యేకంగా జాబితాలు రూపొందించి దాని ఆధారంగా ఎన్ని సీట్లు, ఎంత మంది విజిటర్ సీట్లు, సోఫాలు ఎన్ని, టీవీలు, ఎల్‌ఈడీ స్క్రీన్లు ఎన్ని అనేది పక్కాగా లెక్కలు వేసి ఏర్పాటు చేశారు. ఇవేకాకుండా ముఖ్యమంత్రి, మంత్రుల వాహనాలకు వేర్వేరుగా పార్కింగ్ సదుపాయం సిద్ధం చేశారు.. ఉన్నతాధికారులు, సిబ్బంది, సందర్శకులకు కూడా ప్రాంగణంలోనే పార్కింగ్ సదుపాయం కల్పించారు.