జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నా.. బంగారు భారతదేశమే లక్ష్యం: సీఎం కేసీఆర్
తెలంగాణ ఎన్నో రంగాల్లో నెంబర్ వన్ స్థాయిలో ఉంది. రాష్ట్రంలో ఇప్పుడు ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటున్నాం. ఇవి దేశవ్యాప్తంగా అమలు జరగాలని దేశప్రజలు కోరుకుంటున్నారని సీఎం అన్నారు. ఇందుకోసం దేశం బాగుచేసేందుకు జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నానని కేసీఆర్ స్పష్టం చేశారు.
Sangareddy | తెలంగాణలో జరిగే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా అమలు జరగాలని దేశం కోరుతోంది. దేశం గురించి పోరాడాల్సిన అవసరం మనకూ ఉంది. రాష్ట్రాలను మరింత అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. ఇందుకోసం జాతీయ రాజకీయాల్లోనూ క్రియాశీల పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. దేశాన్ని అమెరికా స్థాయిలో అభివృద్ధి చేసే గొప్ప సంపద, వనరులు, యువశక్తి భారతదేశానికి ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. 'మీ అందరి దీవెన ఉంటే బంగారు తెలంగాణను ఎట్ల చేసుకున్నమో బంగారు భారతదేశం అట్లనే తయారుచేసుకుంటం.' అని కేసీఆర్ అన్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ నారాయణ్ ఖేడ్ పట్టణంలో సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల ప్రాజెక్టులకు సోమవారం శంకుస్థాపన చేశారు. అనంతరం పట్టణంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి సీఎం ప్రసంగించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ 'తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ నారాయణఖేడ్ ప్రాంతానికి వస్తే పది మంది కార్యకర్తలు ఉండేవారు. ప్రజల్లో పెద్దగా ఆశలు కూడా ఉండేవి కాదు. కేసీఆర్ వస్తుండు.. పోతుండు.. తెలంగాణ వస్తదా.. రాదా? అనే అనుమానాలుండేవి కానీ పట్టుపట్టి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. తెలంగాణ వచ్చేముందు కూడా ఎన్నో బద్నాములు పెట్టిన్రు.. వీళ్లకు పరిపాలన చేత కాదు, మీకు కరెంట్ రాదు.. చీకటైపోతది, మొత్తం పరిశ్రమలన్నీ తరలిపోతయ్ అన్నారు. ఇప్పుడు ఆ అన్నవాళ్లే అంధకారంలో ఉన్నారు. తెలంగాణలో 24 గంటల నాణ్యమైన కరెంట్ ఉంటుంది, ఇది మీరు రెండోసారి తెరాసను గెలిపించి ఇచ్చిన బలమే' అని కేసీఆర్ అన్నారు.
తమ ప్రభుత్వంలోని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించిన కేసీఆర్, రైతు బంధు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.
'నిన్న మహారాష్ట్ర వెళ్లినపుడు సీఎం ఉద్ధవ్ ఠాక్రే అడుగుతున్నరు మీరు రైతు బంధు, రైతు బీమా ఇస్తున్నారట. తెలంగాణ బార్డర్ లో ఉండే మా రైతులు ఇబ్బంది పెడుతున్నారు. ఎట్ల ఇస్తున్నారో చెప్పండి.. మేమూ అదే పద్ధతిలో పోతాం' అని అడిగారని సీఎం కేసేఆర్ అన్నారు.
మత విద్వేషాలు లేని చోట, ప్రశాంతత ఉన్న చోట, లా అండ్ ఆర్డర్ సక్రమంగా పనిచేసే చోట అభివృద్ధి జరుగుతుంది. తెలంగాణ ఎన్నో రంగాల్లో నెంబర్ వన్ స్థాయిలో ఉంది. రాష్ట్రంలో ఇప్పుడు ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటున్నాం. ఇవి దేశవ్యాప్తంగా అమలు జరగాలని దేశప్రజలు కోరుకుంటున్నారని సీఎం అన్నారు. ఇందుకోసం దేశం బాగుచేసేందుకు జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నానని కేసీఆర్ స్పష్టం చేశారు.
సంబంధిత కథనం