HT తెలుగు మీకు నోటిఫికేషన్ పంపాలనుకుంటోంది. సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి సరే అని క్లిక్ చేయండి.
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Ssc Supplementary: జూన్‌ 3 నుంచి తెలంగాణ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు, టైమ్‌ టేబుల్ విడుదల

TS SSC Supplementary: జూన్‌ 3 నుంచి తెలంగాణ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు, టైమ్‌ టేబుల్ విడుదల

Sarath chandra.B HT Telugu

02 May 2024, 13:35 IST

    • TS SSC Supplementary: తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షల టైమ్‌ టేబుల్ విడుదలైంది. జూన్‌ 3నుంచి సప్లిమెంటరీ పరీక్షల్ని నిర్వహించనున్నారు. 
తెలంగాణ టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు 2024

తెలంగాణ టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు 2024

TS SSC Supplementary: తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను తెలంగాణ డైరెక్టరేట్‌ ఆఫ్ గవర్నమెంట్‌ ఎగ్జామ్స్‌ విడుదల చేసింది. జూన్‌ 3 నుంచి జూన్ 13వ తేదీ వరకు తెలంగాణ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల్ని నిర్వహించనున్నారు.

తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను డైరెక్టరేట్‌ ఆఫ్ గవర్నమెంట్‌ ఎగ్జామ్స్‌ విడుదల చేసింది. జూన్‌ 3 నుంచి 13వ తేదీ వరకు అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజుల చెల్లింపుకు మే 16వ తేదీ వరకు విద్యార్ధులు ఫీజు చెల్లించవచ్చు.

విద్యార్ధుల పరీక్ష ఫీజులను హెడ్‌మాస్టర్లు మే 17వ తేదీలోగా ట్రెజరీ కార్యాలయాల్లో జమ చేయాల్సి ఉంటుంది. మే 20వ తేదీ లోపు నామినల్ రోల్స్‌ను ప్రధానోపాధ్యాయులు డిఈఓ కార్యాలయాల్లో సమర్పించాల్సి ఉంటుంది. మే 22లోగా డిఈఓలు నామినల్ రోల్స్‌ను పరీక్షల డైరెక్టరేట్‌కు పంపించాల్సి ఉంటుంది.

రూ.50 ఆలస్య రుసముతో సప్లిమెంటరీ పరీక్షల ఫీజును సంబంధిత సబ్జెక్టు పరీక్షకు రెండు రోజుల ముందు కూడా విద్యార్ధులు ప్రధానోపాధ్యాయులకు చెల్లించవచ్చు. అలా ఆలస్య రుసుముతో పరీక్ష ఫీజుల్ని చెల్లించిన వారి నామినల్ రోల్స్ జూన్ 14వ తేదీన ప్రధానోపాధ్యాయులు డిఈఓ కార్యాలయాల్లో సమర్పించాల్సి ఉంటుంది. ఆలస్య రుసుముతో పరీక్షలకు హాజరైన విద్యార్ధుల నామినల్ రోల్స్‌ను డిఈఓలు జూన్‌18లోగా పంపాల్సి ఉంటుంది.

పరీక్ష ఫీజులు ఇలా...

అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులు మూడు సబ్జెక్టుల వరకు రూ.110 ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. మూడు సబ్జెక్టుల కంటే ఎక్కువ పరీక్షలకు హాజరైతే రూ.125 చెల్లించాలి.

పరీక్షల నిర్వహణ షెడ్యూల్‌లో ప్రకటించిన తేదీల్లో ఏవైనా పబ్లిక్ హాలీడేలు వస్తే మరుసటి రోజుకు గడువు వర్తిస్తుంది. ఫీజుల చెల్లింపుకు ఎలాంటి గడువు పొడిగింపు ఉండదని స్పష్టం చేశారు.

పరీక్షల షెడ్యూల్ ఇలా...

జూన్‌ 3వ తేదీ నుంచి సప్లిమెంటరీ పరీక్షల్ని నిర్వహించనున్నారు. ప్రతి రోజు ఉదయం 9.30 నుంచి 12.30 వరకు పరీక్షల్ని నిర్వహిస్తారు. మూడో తేదీన ఫస్ట్‌ లాంగ్వేజ్‌, కంపోజిట్‌ పేపర్ 1, కంపోజిట్ కోర్సుల పరీక్షలు జరుగుతాయి. కంపోజిట్ పరీక్షలు 9.30 నుంచి 12.50 వరకు నిర్వహిస్తారు.

జూన్‌ 5వ తేదీన సెకండ్ లాంగ్వేజ్‌, జూన్‌ 6న థర్డ్‌ లాంగ్వేజ్, జూన్‌ 7న మ్యాథ్స్‌, జూన్ 8న ఫిజికల్ సైన్స్‌, జూన్‌ 10న బయాలజీ, జూన్‌ 11న సోషల్, జూన్ 12న ఓరియంటల్‌ సబ్జెక్టుల్లో పేపర్ 1( సంస్కృతం, అరబిక్), జూన్ 13న ఓరియంటల్‌ లాంగ్వేజ్‌ పేపర్ 2 పరీక్సలు నిర్వహిస్తారు.

తదుపరి వ్యాసం
నోటిఫికేషన్ సెంటర్