తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Note For Vote Case : ఓటుకు నోటు కేసు విచారణ - వేరే కోర్టుకు బదిలీ చేసేందుకు సుప్రీం నిరాకరణ, ఏసీబీకి కీలక ఆదేశాలు

Note For Vote Case : ఓటుకు నోటు కేసు విచారణ - వేరే కోర్టుకు బదిలీ చేసేందుకు సుప్రీం నిరాకరణ, ఏసీబీకి కీలక ఆదేశాలు

20 September 2024, 21:04 IST

google News
    • ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్‌రెడ్డికి ఊరట లభించింది. కేసును వేరే కోర్టుకు బదిలీ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కేసులో ప్రతివాదిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి దర్యాప్తులో జోక్యం చేసుకోవద్దని ఆదేశించింది. ఏసీబీ ప్రత్యేక ప్రాసిక్యూషన్ కు పూర్తిస్థాయిలో సహకరించాలని సూచించింది.
‘ఓటుకు నోటు’ కేసుపై సుప్రీం కీలక నిర్ణయం
‘ఓటుకు నోటు’ కేసుపై సుప్రీం కీలక నిర్ణయం

‘ఓటుకు నోటు’ కేసుపై సుప్రీం కీలక నిర్ణయం

స్పష్టమైన ఆధారాలు లేకుండా కేవలం ఊహాజనితమైన అంశాలతో కోర్టును ఆశ్రయించారని ‘ఓటకు–నోటు’ కేసులో పిటిషనర్లను ఉద్దేశించి అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఈ కేసులో పిటిషనర్లకు ప్రాసిక్యూషన్ పై పూర్తి నమ్మకం వ్యక్తం చేసినందుకు ఈ కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది.

అలాగే సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జీతో పర్యవేక్షించాలన్న పిటిషనర్ల అభ్యర్థను తోసిపుచ్చుతున్నట్లు స్పష్టం చేసింది. ప్రస్తుత స్టేజ్‌లో ఈ పిటిషన్ పై విచారణను ముగిస్తున్నట్లు వెల్లడించింది. ఒకవేళ ప్రతివాది అయిన సిఎం ఈ కేసు విచారణలో జోక్యం చేసుకుంటే కోర్టును ఆశ్రయించే అవకాశం కల్పిస్తున్నట్లు ఆదేశాల్లో పేర్కొంది.

ఇదే సందర్భంలో ట్రయల్ కోర్టు కేసు విచారణను పారదర్శకంగా చేపట్టాలని ఆదేశించింది. ఏసీబీ డీజీ ప్రత్యేక ప్రాసిక్యూషన్‌కు పూర్తిగా సహకరించాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఓటుకు నోటు కేసును మధ్యప్రదేశ్‌కు బదిలీ చేయాలని ఈ ఏడాది జనవరి 31న బిఆర్ఎస్ నేతలు జగదీశ్ రెడ్డి, మహ్మద్ అలీ, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను సోమవారం జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ కెవి విశ్వనాథన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది.

తెలంగాణ ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయ‌వాదులు ముకుల్ రోహిత్గి, సిద్దార్థ్ లూత్రా, మేనకా గురుస్వామీలు వాదించ‌గా, పిటిషన్ల తరపున సీనియర్ న్యాయ‌వాదులు ఆర్యమా సుందరం, దామా శేషాద్రి నాయుడు, మోహిత్ రావులు వాదించారు.

ఆ శాఖలు సీఎం పరిధిలోనే ఉంటాయి - పిటిషన్ తరపు న్యాయవాది

తొలుత సుందరం వాదనలు వినిపిస్తూ నిందితుడిగా ఉన్న రేవంత్ రెడ్డి పరిధిలోనే హోం మంత్రి శాఖ ఉందని సుందరం ధ‌ర్మాస‌నం దృష్టికి తీసుకెళ్లారు. ఏసీబీ, ఏసీబీ ప్రాసిక్యూషన్, అలాగే అధికారులు ఆయనకే రిపోర్ట్ చేయాల్సి ఉంటుందన్నారు. ఏసీబీ ఎవ‌రిని ఇన్వెస్టిగేషన్ చేయాలి, వద్దు అనేది హోం మంత్రి శాఖనే నిర్ణయిస్తుందని వాదనలు వినిపించారు.

ఈ వాదనలపై జోక్యం చేసుకున్న ధర్మాసనం ‘ఒకవేళ మరోచోటుకు కేసు విచారణ మార్చితే, అప్పుడు కూడా హో మంత్రిగా అధికారులు ఆయనకు చెప్పిన తరువాతే కోర్టుకు వెళతారు కదా? అని ప్రశ్నించింది. ఒకవేళ హోం మంత్రిత్వ శాఖ ఆయన పరిధిలో లేకపోయినా, సిఎంగా అన్ని శాఖలకు ఆయన కిందే పని చేస్తాయని కోర్టు వ్యాఖ్యానించింది. ఇందుకు సుందరం బదులిస్తూ ప్రాసిక్యూషన్ అనేది స్వతంత్రగా జరగాలని కోర్టును కోరుతున్నట్లు తెలిపారు.

అలాగే రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జ్‌తో పర్యవేక్షణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులు, అధికారులను విచారించలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. విచార‌ణ‌ అధికారులు చెప్పిందే, ప్రాసిక్యూషన్ వింటుందన్నారు. అయితే ఈ వాదనలపై తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది ముకుల్ రోహిత్గి అభ్యంతరం వ్య‌క్తం చేశారు. ఈ కేసులో చాలా మందిని విచార‌ణ అధికారులు విచారించినట్లు తెలిపారు. కానీ పిటిషనర్లు కేవలం రాజ‌కీయంలో భాగంగా కోర్టును ఆశ్రయించారని అన్నారు.

ఈ అంశాలను పరిగణలోకి తీసుకొన్న ధర్మాసనం… గతంలో ఈ కేసు విచారిస్తోన్న విచార‌ణ అధికారి కొనసాగింపు సమ్మతమేనా? అని పిటిషనర్ తరపు న్యాయ‌వాది సుందరంని ధర్మాసనం అడిగింది. ఇందుకు ఆయన అభ్యంతరం తెలపకపోవడంతో.. గతంలో ఇదే ప్రాసిక్యూషన్‌పై అనుమానం ఎందుకు వ్యక్తం చేశారని అసంతృప్తి వ్యక్తం చేసింది.

కేసులో జోక్యం చేసుకోవద్దు

ఇరువైపు వాదనలు పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం ఈ కేసు విచారణను ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయలేమని స్ప‌ష్టం చేసింది. అయితే కేసు విచారణలో జోక్యం చేసుకోవద్దని ధ‌ర్మాస‌నం ప్రతివాది రేవంత్ రెడ్డిని ఆదేశించింది. ‘ఇకపై అవినీతి నిరోధక శాఖ(ఎసిబి)డీజీ కేసు విచారణను సిఎంకు నివేదించవద్దు. ప్రత్యేక ప్రాసిక్యూషన్‌కు పూర్తి స్థాయిలో సహకరించాలి. ట్రయల్ కోర్టు పారదర్శకంగా ఈ కేసు విచారణ చేపట్టాలి’ అని స్పష్టం చేసింది. ఒకవేళ సిఎంగా రేవంత్ రెడ్డి కేసు విచారణలో జోక్యం చేసుకుంటే పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించే వెసులుబాటు కల్పించింది.

క్షమాపణలను స్వీకరిస్తున్నాం

కవిత బెయిల్ ఆర్డర్ విషయంలో సిఎం రేవంత్ రెడ్డి క్షమాపణలను ద్విసభ్య ధర్మాసనం స్వీకరించింది. అయితే రాజ్యాంగ బద్ద హోదాలో ఉన్న వారు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ‘కార్య‌నిర్వ‌హ‌ణ‌, శాస‌న‌ న్యాయ వ్యవస్థ ఏదైనా తమ పరిధిలోని రాజ్యాంగ విధులు నిర్వర్తించాలి. ఇటువంటి అనవసరమైన వ్యాఖ్య‌లు ఘర్షణకు దారితీస్తాయి. క్షమాపణలు స్వాగతించినప్పటికీ... కోర్టు ఆదేశాలపై వ్యాఖ్యలు చేసేటప్పుడు తగినంత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నాం’ అని పేర్కొంది.

తదుపరి వ్యాసం