Sircilla Textile Park : సంక్షోభంలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ - నేటి నుంచి టెక్స్ టైల్ పార్క్ బంద్
06 October 2024, 7:01 IST
- నేటి నుంచి సిరిసిల్ల టెక్స్‌టైల్ పార్క్ బంద్ కానుంది. ఈ మేరకు వస్త్రోత్పత్తిదారుల సంఘం నిర్ణయం తీసుకుంది. గిట్టుబాటు ధర లేక వస్త్ర పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో ఉందని ఉత్పత్తిదారులు చెబుతున్నారు. గడిచిన 2 నెలలుగా నష్టాలను ఎదుర్కొని పరిశ్రమలు నడిపించామని.. ఇక నడిపించే పరిస్థితి లేదని వాపోతున్నారు.
నేటి నుంచి సిరిసిల్ల టెక్స్ టైల్ పార్క్ బంద్
వస్త్ర సంక్షోభంతో సిరిసిల్ల టెక్స్ టైల్ పార్క్ బాలారిష్టాలను ఎదుర్కొంటుంది. నేసిన గుడ్డకు గిట్టుబాటు ధర లేక వస్త్ర ఉత్పత్తి చేయలేక పవర్ లూమ్ పరిశ్రమను ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈనెల 6 నుంచి బద్దెనపల్లిలోని టెక్స్ టైల్ పార్క్ ను మూసివేయాలని యజమానులు నిర్ణయించారు.
వస్త్రోత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు అన్నల్స్ అనిల్ కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. టెక్స్ టైల్ పార్క్ వస్త్రోత్పత్తి అవుతున్న వస్త్రానికి మార్కెట్లో గిట్టుబాటు ధర రావడం లేదు. మూడు నెలలుగా వస్త్రనిల్వలు పేరుకుపోయాయి. వస్త్రోత్పత్తి పార్క్ లోని యూనిట్లను నిరవధికంగా బంద్ పెట్టనుండడంతో అక్కడ పనిచేసే వెయ్యి మంది కార్మికులు రోడ్డున పడనున్నారు.
ఆటుపోట్ల మధ్య వస్త్రపరిశ్రమ…!
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి శివారులోని 65 ఎకరాల్లో 2003లో ఉమ్మడి రాష్ట్రంలోనే తొలి టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేశారు. 7 వేల మంది కార్మికులకు ఉపాధి కల్పించాల్సి ఉండగా, వెయ్యి మందికే పని లభిస్తుంది. పార్క్ 56 యూనిట్లలో (695 మగ్గాలు) వస్త్రోత్పత్తి జరుగుతోంది.
గతంలో సంక్షోభానికి గురైన 25 మంది యూనిట్ల యజమానులు ఆధునిక ర్యాపియర్స్ లూమ్స్ కు అమ్మేసుకున్నారు. గతంలో టెక్స్టైల్ పార్క్ లోని యూనిట్లకు 50 శాతం విద్యుత్ రాయితీని ప్రభుత్వం అందించి నిలిపివేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పటి మంత్రి కేటీఆర్ చొరవతో విద్యుత్ రాయితీని రీయింబర్స్మెంట్ గా అందించారు. ఇప్పుడు పూర్తి స్థాయిలో పరిశ్రమల యజమానులే విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నారు.
పొరుగు రాష్ట్రాల్లో విద్యుత్ టారిఫ్ రేట్లు తక్కువగా ఉండగా, ఇక్కడ ఎక్కువగా ఉండడంతో పొరుగు రాష్ట్రాలతో సిరిసిల్ల వ్యాపారులు పోటీ పడలేకపోతున్నారు. వస్త్రోత్పత్తి వ్యయం పెరిగి, ఆ మేరకు మార్కెట్లో బట్టకు రేటు లభించక నష్టాలను చవిచూస్తున్నారు. ఫలితంగా టెక్స్టైల్ పార్క్ లో పరిశ్రమలను మూసి వేసే పరిస్థితి ఏర్పడింది.
వేములవాడకు నూలు డిపో మంజూరు…
ఓ వైపు వస్త్ర సంక్షోభంతో పవర్ లూమ్ పరిశ్రమ బంద్ పాటిస్తుండగా మరో వైపు తెలంగాణ ప్రభుత్వం వేములవాడ కేంద్రంగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు యారన్ డిపో మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం యారన్ డిపో ఏర్పాటు చేయడం వలన దాదాపు 30 ఏళ్ళుగా ఎదురుచూస్తున్న మరమగ్గాల కార్మికుల కల నెరవేరింది.
యారన్ డిపో వలన తెలంగాణ వ్యాప్తంగా ఉన్న దాదాపు 40 వేల మరమగ్గలపై పనిచేస్తున్న 30 వేల మంది నేతన్నలకు లబ్ధి చేకూరుతుంది. వేములవాడ కేంద్రంగా యారన్ (నూలు) డిపో ఏర్పాటు చేయడం వలన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలలో సుమారుగా 30 వేల మరమగ్గాల కార్మికులకు నేరుగా లబ్ధి చేకూరనుంది. యారన్ డిపో ఏర్పాటు చేయడం వలన మరమగ్గాల పరిశ్రమలోని నేతన్నలకు పెట్టుబడిదారులపై ఆధారపడకుండా నేరుగా ఉపాధి లభిస్తుంది.. ఇట్టి యారన్ డిపోకు 50 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగింది.
టెస్కో ఆద్వర్యంలో యారన్ డిపో..
యారన్ డిపో టెస్కో ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. మరమగ్గాల కార్మికులకు అవసరమగు నూలు టెస్కో క్రెడిట్ పద్ధతిలో సరఫరా చేసి వస్త్రాన్ని కొనుగోలు చేయనుంది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న యారన్ డిపో మంజూరు చేయడం పట్ల నేతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వేములవాడ కేంద్రంగా యారన్ డిపో ఏర్పాటుపై స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.