Sircilla : సంక్షోభంలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ.. ఉపాధి లేక నేతన్నల అవస్థలు-problems of sirisilla weavers due to lack of employment opportunities ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Sircilla : సంక్షోభంలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ.. ఉపాధి లేక నేతన్నల అవస్థలు

Sircilla : సంక్షోభంలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ.. ఉపాధి లేక నేతన్నల అవస్థలు

HT Telugu Desk HT Telugu
Sep 28, 2024 04:57 AM IST

Sircilla : సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో పడింది. పనిలేక పరిశ్రమ మూత పడే పరిస్థితి వచ్చింది. బతుకమ్మ చీరల ఆర్డర్స్ లేక.. చేతి నిండా పని కానరాక నేత కార్మికులు రోడ్డున పడుతున్నారు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి నెలకొంది. నేత కార్మికుల సమస్యలపై రాజకీయ విమర్శలు దుమారం రేపుతున్నాయి.

సంక్షోభంలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ
సంక్షోభంలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ

నేత కార్మికులకు నిలయమైన సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ.. ప్రస్తుతం సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. నేతన్నల ఆత్మహత్యలతో ఒకప్పుడు సిరిసిల్ల ఉరిశాలగా మారడంతో.. కార్మికులకు ఉపాధి కల్పించడానికి.. తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి శివారులో 2003లో 65 ఎకరాల్లో టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేశారు. 7 వేల మంది కార్మికులకు ఉపాధి లక్ష్యంగా వస్త్ర పరిశ్రమలు నెలకొల్పారు. 20 ఏళ్లుగా 2వేల మందికి పని కల్పించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బిఆర్ఎస్ ప్రభుత్వం 2017 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ చేపట్టింది.‌ సిరిసిల్లలోని 136 మ్యాక్స్ సొసైటీలకు, 138 చిన్న తరహా పరిశ్రమలు, టెక్స్ టైల్ లోని 70 యూనిట్లకు ఏటా ఏడు కోట్ల మీటర్ల చీరల ఆర్డర్స్ ఇచ్చింది. బతుకమ్మ చీరలతో సిరిసిల్ల నేత కార్మికులకు చేతినిండా పని కల్పించి ఉపాధిని మెరుగు పర్చింది.

2017 నుంచి 2023 వరకు ప్రతి ఏటా రూ.300 కోట్లు ఖర్చు చేసి.. రాష్ట్ర వ్యాప్తంగా కోటి మంది మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. తద్వారా నేత కార్మికులకు ఉపాధి కల్పించి రూ.2157 కోట్ల రూపాయలు వెచ్చించారు. అంతవరకు బాగానే ఉంది. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బతుకమ్మ చీరల పంపిణీలో అవకతవకలు జరిగాయని బతుకమ్మ చీరల పంపిణీ నిలిపివేసింది. దీంతో బతుకమ్మ చీరల ఆర్డర్స్ లేక.. పని కరువై సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో పడింది. గడిచిన 9 నెలల్లో 11 మంది నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు.‌

రోడ్డున పడ్డ నేతన్నల బతుకులు..

బతుకమ్మ చీరల ఆర్డర్స్ లేక.. పని దొరక్క పవర్ లూమ్ పరిశ్రమ మూగబోయింది. కార్మికులు రోడ్డున పడ్డారు. గత ఏడెనమిది మాసాలుగా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఆర్ వి ఎం ఆర్డర్స్‌తో కొత్త ఉపాధి దొరికినా.. పూర్తిస్థాయిలో ప్రభుత్వ ఆర్డర్స్ రాకపోవడంతో చేతినిండా పని లేకుండా పోయింది. దీంతో నేత కార్మికులకు ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. బతుకమ్మ చీరలు బంద్ కావడం, ఉపాధి లేమితో కార్మికులు ఇబ్బంది పడడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతుంది.‌ అధికార విపక్షాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు జరుగుతున్నాయి.

నాపై కోపం కార్మికులపై చూపద్దు..కేటిఆర్

కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే తనపై కోపంతో బతుకమ్మ చీరలను రద్దుచేసి.. కార్మికుల గోస పుచ్చుకుంటుందని.. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఆరోపించారు. తనపై కోపం ఉంటే సిరిసిల్ల నేత కార్మికులపై పగ తీర్చుకోవడం సరైన పద్దతి కాదన్నారు. బతుకమ్మ చీరల ఆర్డర్ రద్దు చేసి నేత కార్మికులను రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు సిరిసిల్ల ఉరిశాలగా మారిన నేపథ్యంలో.. కేసీఆర్ నేతృత్వంలో ఆడబిడ్డలకు బతుకమ్మ చీరల పంపిణీ చేపట్టి.. నేత కార్మికులకు ఉపాధి చూపిందన్నారు.‌ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు బతుకమ్మ చీరలను రద్దు చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు.

నేతన్నలపై బిఆర్ఎస్ మొసలి కన్నీరు..

బతుకమ్మ చీరల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన బిఆర్ఎస్ ప్రభుత్వం.. ప్రజలకు క్షమాపణలు చెపాలని.. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బతుకమ్మ చీరలపై బిఆర్ఎస్ పెట్టి వెళ్లిన రూ.197 కోట్ల బకాయిలను కాంగ్రెస్ ప్రభుత్వం తీర్చిందన్నారు. మీ మీద కోపం ప్రజలను మభ్యపెట్టినందుకు, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చినందుకే కానీ.. బతుకమ్మ చీరల విషయంలో కాదన్నారు. బిఆర్ఎస్ హయాంలో కంటే సిరిసిల్ల నేత కార్మికులకు మెరుగైన ఉపాధి కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

సంక్షోభానికి కారణాలు...

రాజకీయ విమర్శలు ఎలా ఉన్నా.. సిరిసిల్లలో వస్త్ర సంక్షోభానికి అనేక కారణాలు ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో నేసిన గుడ్డకు సరైన ధర లేక, నేసిన గుడ్డ అమ్మకాలు జరగక నిల్వలు పేరుకుపోయాయి. ముడిసరకుల ధరలు పెరగడం, పవర్ లూమ్ పరిశ్రమకు విద్యుత్ ఛార్జీలు భారంగా మారుతున్నాయి. టెక్స్ టైల్ పార్క్ పరిశ్రమల యజమానులతోపాటు.. పవర్ లూమ్ పరిశ్రమ నిర్వాహకులు పని బంద్ చేశారు. యాజమానులు పరిశ్రమ బంద్ చేయడంతో వస్త్ర పరిశ్రమపై ఆదారపడి జీవించే కార్మికుల జీవనోపాధి కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

వస్త్రోత్పత్తిదారులకు యూనిట్ కరెంట్ ధర 7 రూపాయల 50 పైసలు ఉంది. అదే మహారాష్ట్రలో యూనిట్ విద్యుత్ ఛార్జీలు మూడు రూపాయలే ఉంది. తమిళనాడులో 500 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందిస్తుండగా.. అంతకు మించి వినియోగిస్తే ప్రతి యూనిట్ కు 2 రూపాయల 50 పైసలు వసూలు చేస్తారు. పొరుగు రాష్ట్రాల్లో విద్యుత్ టారిఫ్ తక్కువగా ఉండగా, సిరిసిల్లలో ఎక్కువగా ఉంది. దీంతో పొరుగు రాష్ట్రాలతో పోటీ పడలేకపోతున్నారు.

ఇటీవల నూలు రేట్లు బాగా పెరగడం, రవాణా చార్జీలు ఎక్కువ కావడంతో.. వస్త్రోత్పత్తి వ్యయం కూడా పెరిగింది. ఒక్కో మీటరు బట్ట నాణ్యతను బట్టి.. 18 నుంచి 70 రూపాయల వరకు అమ్ముతుంటారు. అయితే.. ప్రస్తుతం బట్టకు మార్కెట్లో ధర లేక.. నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. వస్త్ర సంక్షోభం నుంచి విముక్తి కలగాలంటే.. పొరుగు రాష్ట్రాల మాదిరిగా రాయితీలు ఇచ్చి.. నేసిన గుడ్డకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

(రిపోర్టింగ్- కె వి రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రతినిధి, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)