Sircilla Power loom Workers : సిరిసిల్లలో వస్త్ర సంక్షోభం, పది రోజులుగా టెక్స్ టైల్ పార్క్ బంద్
15 October 2024, 18:24 IST
Sircilla Powerloom Workers : సిరిసిల్ల టెక్స్ టైల్ పార్క్ బంద్ అయ్యింది. ఉపాధి లేక నేతన్నలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత పది రోజులు పరిశ్రమ బంద్ అయినా పట్టించుకునే లేరని నేతన్నలు ఆందోళన చెందుతున్నారు.
సిరిసిల్లలో వస్త్ర సంక్షోభం, పది రోజులుగా టెక్స్ టైల్ పార్క్ బంద్
సిరిసిల్లలో పవర్ లూమ్ పరిశ్రమ మూగబోయింది. టెక్స్ టైల్ పార్క్ బంద్ అయింది. సాంచల చప్పుడు ఆగిపోవడంతో నేతన్నల బతుకు భారంగా మారింది. వస్త్ర సంక్షోభంతో ఉపాధి లేమి వల్ల నేత కార్మికులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆగిన ఆ'దారానికి' చేయూత కరువై సిరిసిల్ల ఉరిశాలగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వస్త్ర సంక్షోభంతో టెక్స్ టైల్ పార్క్ బాలారిష్టాలను ఎదుర్కొంటూ మూతపడడంతో నేతన్నల బతుకులు బజారునపడి పుట్టెడు కష్టాలను అనుభవిస్తున్నారు.
నేతన్నలకు నిలయమైన సిరిసిల్ల నేడు వస్త్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఏడు వేల మంది నేత కార్మికులకు ఉపాధి కల్పించేందుకు 20 ఏళ్ల క్రితం 2003లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే తొలిసారిగా సిరిసిల్ల సమీపంలోని బద్దెనపల్లి శివారులో 65 ఎకరాల్లో టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేశారు. 56 యూనిట్లలో మొదలైన టెక్స్ టైల్ పార్క్ 2009 వరకు 88 యూనిట్లకు చేరుకుని ఎంతో మందికి ఉపాధి కల్పించింది. దినదినం దిగజారిపోయి బాలారిష్టాలను ఎదుర్కొంటూ చివరకు పాతిక యూనిట్లకే పరిమితమై ప్రస్తుతం పనిచేయని పరిస్థితి ఏర్పడింది. గతంలో టెక్స్ టైల్ పార్క్ లోని యూనిట్లకు 50 శాతం సబ్సిడీపై విద్యుత్ సప్లై చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పటి మంత్రి కేటీఆర్ చొరవతో విద్యుత్ రాయితీని రీయింబర్స్మెంట్ గా అందించారు. ప్రస్తుతం సబ్సిడీ లేక పెరిగిన విద్యుత్ ఛార్జీలతో నేసిన గుడ్డకు గిరాకీ కానరాక ప్రభుత్వ ఆర్డర్స్ రాక ఆర్థిక ఇబ్బందులతో పరిశ్రమను ఈనెల 6 నుంచి బంద్ చేశారు. వస్త్ర పరిశ్రమ బంద్ కావడం ఈ సంవత్సరం ఇది రెండోసారి. ప్రస్తుతం పరిశ్రమ మూగబోయి పది రోజులు అవుతున్నా పట్టించుకునే వారు కానరాగ ఎప్పుడు తెరుచుకుంటుందో తెలియక నేతన్నలు ఆందోళన చెందుతున్నారు.
ఉపాధి కోల్పోయి ఇక్కట్ల పాలవుతున్న నేత కార్మికులు
సిరిసిల్ల టెక్స్ టైల్ పార్క్, పవర్ లూమ్ పరిశ్రమపై ఏడు వేల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. టెక్స్ టైల్ పార్క్ బంద్ తో 1500 మంది, పవర్ లూమ్ పరిశ్రమ నడవక మరో ఐదు వేల మంది ఉపాధి కోల్పోయారు. వారి బతుకులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. పని చేస్తేనే పూట గడిచే పరిస్థితిలో ప్రస్తుతం పదిరోజులుగా వస్త్ర పరిశ్రమ బంద్ కావడంతో చేసేందుకు పని లేక వేరే పని చేయలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బతుకమ్మ దసరా పండుగ రోజున నేత కార్మిక కుటుంబాలు పస్తులుండే పరిస్థితులు ఏర్పడ్డాయి. చేతినిండా పనిలేక కడుపునిండా తిండి తినలేక దీనావస్థలు ఎదుర్కొంటున్నారు. కార్మిక కుటుంబాలను కదిలిస్తే కన్నీటి పర్యంతం అవుతూ తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు.
ప్రభుత్వం ఆర్డర్ లు ఇచ్చి కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని కోరుతున్నారు. గతంలో బతుకమ్మ చీరల ఆర్డర్స్ తో చేతి నిండా పని దొరికి పండుగను ఘనంగా జరుపుకున్నామని ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులతో పండుగ కూడా సరిగ్గా జరుపుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పవర్ లూమ్ పరిశ్రమ బంద్ తో కొందరు బీడీలు చేస్తూ ఉపాధి పొందుతుండగా మరికొందరు దినసరి కూలీలుగా మరి పని చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం ఆదుకుంటేనే తమకు బతుకు దెరువు, లేకుంటే ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన చెందుతున్నారు.
వర్కర్ టు ఓనర్ సిస్టమ్ ను అమలు చేయాలి
సిరిసిల్లలో వస్త్ర సంక్షోభానికి నేత కార్మికుల ఆర్థిక ఇబ్బందులకు అనేక కారణాలు ఉన్నాయి. అమలుకు నోచుకోని పాలకుల హామీలు, అధికారుల అనాలోచిత విధానాలు నేతన్నల బతుకులను ఆగం చేస్తున్నాయి. వస్త్ర పరిశ్రమలో మూడు అంచెల విధానం నేత కార్మికుల బతుకులను దుర్బరం చేస్తుంది. యాజమాని, ఆసామి, వర్కర్ మూడంచెల విధానం ఉండడంతో ప్రభుత్వం ఏ సహాయం చేసిన యాజమాని, ఆసామికే చెందుతుంది. రోజంతా మగ్గంపై పని చేసే వర్కర్ నేత కార్మికుడికి చేరడం లేదు. ముడి సరుకులు యాజమాని కొనుగోలు చేసి ఆసామికి అప్పగిస్తాడు. ఆసామి మరమగ్గాలపై నేత కార్మికులతో గుడ్డను నేయిస్తాడు. అలా నేస్తే పాలిస్టర్ గుడ్డకు మీటర్ కు రూపాయి నుంచి రుపాయి 20 పైసలు, కాటన్ గుడ్డకు మీటర్ కు రూ. 1.60 పైసల నుంచి రెండు రుపాయల వరకు కార్మికుడికి చెల్లిస్తారు. రెక్కల కష్టం పైనే కార్మికుల బతుకులు ఆధారపడి ఉంటాయి.
ఇలాంటి పరిస్థితుల్లో వర్కర్ నే ఓనర్ చేసేలా ప్రభుత్వం చేయుతనిచ్చి నాలుగు మగ్గాలు కొనుక్కొని నడిపించుకునేలా సహకరిస్తే కార్మికుల బతుకులు బాగుపడతాయంటున్నారు కార్మిక సంఘాల ప్రతినిధులు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వం ఏ సహాయం చేసిన అది యాజమానికి, ఆసామికి చెందుతుందే తప్ప కార్మికుడికి గోరంత కూడా దక్కడం లేదంటున్నారు. ఈ పరిస్థితి పోవాలంటే వర్కర్ టూ ఓనర్ సిస్టమ్ అమలు చేసి కార్మికులు స్వంతంగా పవర్ లూమ్స్ ఏర్పాటు చేసుకునేలా వంద కోట్లు కెటాయించాలని కోరుతున్నారు.
బతుకమ్మ చీరల రద్దుతో కష్టాలు
ఏడేళ్ళుగా బతకమ్మ చీరలతో సిరిసిల్ల నేత కార్మికులకు చేతినిండా పని దొరికి ఇబ్బంది లేకపోయింది. కానీ, ఈసారి బతుకమ్మ చీరలు లేక ప్రభుత్వ ఆర్డర్స్ విరివిగా రాకపోవడంతో పవర్ లూమ్ పరిశ్రమ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. ఓ వైపు వస్త్ర సంక్షోభంతో పవర్ లూమ్ పరిశ్రమ బంద్ పాటిస్తుండగా మరో వైపు కాంగ్రెస్ ప్రభుత్వం వేములవాడ కేంద్రంగా యారన్ డిపో మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. యారన్ డిపో ఏర్పాటు చేయడం వలన మరమగ్గాల పరిశ్రమలోని నేతన్నలకు పెట్టుబడిదారులపై ఆధారపడకుండా నేరుగా ఉపాధి లభిస్తుంది. యారన్ డిపోకు 50 కోట్ల నిధులు మంజూరు చేసింది. యారన్ డిపోకు తొలి అడుగు పడడంతో దాదాపు 30 ఏళ్ళుగా ఎదురుచూస్తున్న మరమగ్గాల కార్మికుల కల నెరవేరినప్పటికి... అది ఎప్పుడు వినియోగంలోకి వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. నేతల మాటలు కోటలు దాటినా నేతన్నల బతుకులు మాత్రం మారడం లేదు. ఇలాంటి పరిస్థితిలో ఆగిన ఆ'దారం' తెగ్గిపోకుండా... నేతన్నల బ్రతుకులు చితికి పోకుండా ఉండేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆదిశగా పాలకులు, అధికారులు ఆలోచించి నేతన్నలకు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గం చూపాల్సిన అవసరం ఉంది.
రిపోర్టింగ్ : కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.