Sircilla News : నిరుద్యోగులకు సిరిసిల్ల పోలీసుల గుడ్ న్యూస్- సీసీటీవీ ఇన్ స్టాలేషన్, సాఫ్ట్ స్కిల్ పై ఉచిత శిక్షణ
15 October 2024, 19:55 IST
Sircilla News : సిరిసిల్ల జిల్లా పోలీసులు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సిద్ధమయ్యారు. సీసీటీవీ ఇన్స్టాలేషన్, సాఫ్ట్ స్కిల్స్, బేసిక్ కంప్యూటర్ పై మూడు నెలలు ఉచితంగా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. 18 నుంచి 35 సంవత్సరాల వయస్సు గల యువకులకు ఈ నెల 18లోగా పేరు నమోదు చేసుకోవాలని సూచించారు.
నిరుద్యోగులకు సిరిసిల్ల పోలీసుల గుడ్ న్యూస్- సీసీటీవీ ఇన్ స్టాలేషన్, సాఫ్ట్ స్కిల్ పై ఉచిత శిక్షణ
రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సిద్ధమయ్యారు. సీసీ టీవీ ఇన్స్టాలేషన్, సాఫ్ట్ స్కిల్స్, బేసిక్ కంప్యూటర్ పై మూడు మాసాల పాటు ఉచితంగా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. అందుకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తునట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.
జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత భోజనం, వసతి కల్పించి మూడు నెలల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రకటించారు. సీసీటీవీ ఇన్స్టాలైజేషన్ , సాఫ్ట్ స్కిల్స్, బేసిక్ కంప్యూటర్ పై ఉచిత శిక్షణ ఇచ్చి నైపుణ్యాలు పెంపొందించి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ వంటి నగరాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. 18 నుంచి 35 సంవత్సరాల వయస్సు గల నిరుద్యోగ యువకులకు 10th సర్టిఫికేట్ తో సంబంధిత పోలీస్ స్టేషన్లో ఇవాళ్టి నుంచి ఈ నెల 18 సాయంత్రంలోగా పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. నిరుద్యోగ యువత సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
రోడ్డుపై ధాన్యం ఆరబోస్తే చర్యలు
వరి కోతలు మొదలైన నేపథ్యంలో వరి ధాన్యంను రోడ్డుపై ఆరబోస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. సిరిసిల్ల జిల్లాలో పలు చోట్ల రోడ్లపై ధాన్యం ఆరబోయడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు రైతులు ఎవరు రోడ్డుపై ధాన్యం పోయవద్దని విజ్ఞప్తి చేశారు. నిబంధన ఉల్లంఘించి రోడ్డుపై ధాన్యం ఆరబోస్తే కేసులు నమోదు చేసి జైలుకు పంపక తప్పదని హెచ్చరించారు. కొందరు పండించిన ధాన్యాన్ని రోడ్లపై పోసి నూర్పిడి చేయడం, ఆరబెట్టుకోవడం వంటివి చేస్తుంటారు. అయితే నిత్యం వాహనాలు తిరిగే రోడ్లపై ధాన్యాన్ని నూర్పిడిచేయడం వల్ల రాత్రి సమయాల్లో వాటిని గ్రహించలేక ప్రమాదాలు సంభవిస్తున్నాయి. రైతులేవ్వరు రోడ్డుపై వరి ధాన్యాన్ని అరోబోసి ప్రమాదాలకు కారణం కావద్దని కోరారు. రోడ్డుపై ఆరబెట్టిన ధాన్యం కారణంగా ప్రమాధాలు జరిగి వాహనదారులు మరణించిన, గాయపడిన ధాన్యం రోడ్డుపై పోసిన యజమానిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు.
రైతుపై కేసు నమోదు చేసిన సిరిసిల్ల పోలీసులు
రైతులు రోడ్డుపై ధాన్యం ఆరబోయడంతో ఓ వ్యక్తి ప్రమాదానికి గురై ప్రాణాపాయస్థితికి చేరారు. వెంకటాపూర్ నుంచి రగుడు వరకు గల బైపాస్ రోడ్డుపై రైతులు వరి ధాన్యం కుప్పలను పోయడం వలన బైపాస్ రోడ్డు వెంట వెళ్లే వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. చంద్రపేటకు చెందిన వేముల రాజశేఖర్ బైక్ పై పెద్దూరు నుంచి బైపాస్ రోడ్డుపై చంద్రంపేటకు వస్తుండగా పెద్ద బోనాల చిన్న బోనాల మధ్యలో బైపాస్ రోడ్డుపై పోసిన వరిధాన్యం కుప్పను ఢీకొని ప్రమాదానికి గురై ప్రాణాపాయ స్థితికి చేరాడు. అతని అన్న వేముల రమేశ్ ఫిర్యాదు మేరకు రోడ్డుపై వరి ధాన్యం పోసిన చిన్నబోనాల గ్రామానికి చెందిన సరుగు భాస్కర్ పై కేసు నమోదు చేసినట్లు సిరిసిల్ల సీఐ కృష్ణ తెలిపారు.
రిపోర్టర్ : కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్, హిందూస్తాన్ టైమ్స్ తెలుగు