Siddipet Crime : వాట్సాప్, ఫేస్ బుక్ ల ద్వారా పరిచయం- తొమ్మిదో తరగతి బాలికను గర్భవతి చేసిన ముగ్గురు యువకులు
09 September 2024, 17:48 IST
- Siddipet Crime : సిద్దిపేట జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తొమ్మిదో తరగతి బాలికపై ముగ్గురు యువకుడు పలుమార్లు లైంగిక దాడి చేశారు. బాలిక గర్భవతి కావడంతో అసలు విషయం వెలుగుచూసింది. నిందితులపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
వాట్సాప్, ఫేస్ బుక్ ల ద్వారా పరిచయం- తొమ్మిదో తరగతి బాలికను గర్భవతి చేసిన ముగ్గురు యువకులు
Siddipet Crime : సిద్దిపేట జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ బాలికకు మాయమాటలు చెప్పి తల్లి ఇంట్లో లేని సమయంలో ముగ్గురు యువకులు పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. ప్రస్తుతం బాలిక గర్భవతి కావడంతో ఈ విషయం బయటపడింది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు నిందితులపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ దారుణ సంఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని ఓ గ్రామంలో వెలుగుచూసింది.
సిద్దిపేట ఏసీపీ మధు వెల్లడించిన వివరాల ప్రకారం దుబ్బాక మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురైంది. దీంతో ఆమె తల్లి చికిత్స నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ బాలికను పరీక్షించిన వైద్యులు ఐదు నెలల గర్భవతి అని నిర్ధారించారు. వెంటనే ఆ బాలికను వైద్యులు సిద్దిపేట భరోసా సెంటర్ కు అప్పగించారు. అక్కడ అధికారులు ఆ బాలిక నుంచి వివరాలు సేకరించారు.
తల్లి ఇంట్లో లేని సమయంలో
బాలిక తండ్రి గతంలో మరణించగా, తల్లి కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుంది. ఈ క్రమంలో దుబ్బాక మండలానికి చెందిన యువకుడు ప్రశాంత్, అక్బర్ పేట - భూoపల్లి మండలానికి చెందిన మరో ఇద్దరు యువకులు నవీన్, ప్రశాంత్ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరు వాట్సాప్, ఫేస్ బుక్ ద్వారా గతంలో బాలికతో పరిచయం ఏర్పరచుకుని ముగ్గురు యువకులు వేర్వేరుగా చాటింగ్ చేసేవారు. ఈ క్రమంలో ఆమె తల్లి ఇంట్లో లేని సమయాల్లో ఇంటికి వచ్చి బాలికకు మాయమాటలు చెప్పి లోబర్చుకున్నారు. గత మార్చి నుండి బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఆమె గర్భం దాల్చింది.
నెల రోజుల నుంచి అనారోగ్యంతో బాలిక పాఠశాలకు వెళ్లడం లేదు. పాఠశాల ఉపాధ్యాయులు తల్లిని పిలిపించి కుమార్తెను స్కూల్ కు పంపించాలని సూచించారు. దీంతో తల్లి బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లడంతో ఈ విషయం బయటపడింది. ఈ ఘటనపై బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురు యువకులపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్ తరలించామని ఏసీపీ వెల్లడించారు.
చెత్త కుప్పలో అప్పుడే పుట్టిన పసికందు
నవమాసాలు మోసిన బిడ్డను పుట్టగానే గుర్తు తెలియని వ్యక్తులు చెత్త కుప్పలో పడేశారు. ఈ అమానవీయ సంఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తిమ్మాపూర్ లోని బుడగ జంగాల కాలనీ వద్ద ముళ్లపొదల్లో పసికందు ఏడుపులు వినిపించాయి. దీంతో బుడగ జంగాల వారు అక్కడికి వెళ్లి చూడగా ఓ వస్త్రంలో రక్తపు మరకలతో ఉన్న మగ శిశువు కనిపించింది. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న దుబ్బాక పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ఆ పసికందును సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం మాతా శిశు సంరక్షణ కేంద్రానికి అప్పగించారు. పసికందు ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు.