Kaveri University Drone Training : తెలంగాణలో ఏటా 1000 మందికి డ్రోన్ పైలట్, రిపేర్ లో శిక్షణ- కావేరీ వర్సిటీ ప్రకటన
10 September 2024, 15:08 IST
- Kaveri University Drone Training : త్వరలో ప్రారంభం కానున్న కావేరీ యూనివర్సిటీలో డ్రోన్ శిక్షణ ఇవ్వనున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. ఇప్పటికే వర్సిటీలో డ్రోన్ల శిక్షణ ప్రత్యేక ఫ్లయింగ్ జోన్ లు ఏర్పాటు చేశామన్నారు. స్థానిక యువత, మహిళలకు డ్రోన్ పైలట్, రిపేరింగ్ లో శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
తెలంగాణలో ఏటా 1000 మందికి డ్రోన్ పైలట్, రిపేర్ లో శిక్షణ, కావేరీ వర్సిటీ ప్రకటన
Kaveri University Drone Training : కావేరి యూనివర్సిటీ డ్రోన్ శిక్షణలో ఒక నవశకానికి నాంది పలకనుంది. కావేరి సీడ్స్ లిమిటెడ్ సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ మండలంలోని మర్కూక్ మండలంలో త్వరలోనే ప్రైవేట్ యూనివెర్సిటీ ఏర్పాటు చేయనున్నది. సిద్దిపేట జిల్లాలో ఏర్పాటు చేయనున్న మొట్టమొదటి ప్రైవేట్ యూనివర్సిటీ ఇదే. అయితే విశ్వవిద్యాలయం ప్రారంభం అయినా వెంటనే తెలంగాణలో ఉన్న గ్రామీణ యువతకు, మహిళలకు పెద్ద ఎత్తున డ్రోన్ శిక్షణ ఇవ్వనున్నట్లు వర్సిటీ యాజమాన్యం ప్రకటించింది. ఆ శిక్షణ కోసం యూనివర్సిటీ పరిసరాలలో, 15,300 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నాలుగు ప్రత్యేక ఫ్లయింగ్ జోన్‌లను రెడీ చేసినట్లు తెలిపారు. ఈ శిక్షణా తరగతులు నిర్వహించడానికి కావేరీ విశ్వవిద్యాలయం, మారుట్ డ్రోన్ అకాడమీ, కేంద్రీకృత విద్య సాంకేతిక సహకారం కోసం వ్యూహాత్మక ఒప్పందం చేసుకున్నాయి. దేశంలో డ్రోన్ శిక్షణలో అత్యంత ప్రఖ్యాతి చెందిన సంస్థగా మారూట్ డ్రోన్ అకాడమీ పేరొందింది.
15,000 మహిళలకు శిక్షణ
గ్రామీణ ప్రాంతాలలో నైపుణ్యాభివృద్ధి, సాంకేతిక పురోగతి జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా, రిమోట్ పైలట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ (RPTO) టాప్-టైర్ డ్రోన్ పైలట్ శిక్షణ పరిశ్రమ-నిర్దిష్ట నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలను గ్రామీణ యువతకు డ్రోన్ నడిపే, రిపేరింగ్ ల పైన శిక్షణనిస్తుంది. నమో డ్రోన్ దీదీ పథకం కింద మహిళా స్వయం సహాయక బృందాలకు సాధికారత కల్పించడంతోపాటు, ఎరువుల విత్తనాలు, పంటల పర్యవేక్షణ, విత్తనాలు విత్తడం వంటి వ్యవసాయ అవసరాల కోసం డ్రోన్‌లను ఆపరేట్ చేయడానికి 15,000 మంది మహిళలకు శిక్షణ ఇచ్చి, తద్వారా మహిళలకు కొత్త జీవనోపాధి అవకాశాలను కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
NABARDతో కలిసి పనిచేయనున్న డ్రోన్ అకాడమీ
అకాడమీ ఏటా 1,000 మందికి పైగా డ్రోన్ పైలట్ శిక్షణను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అగ్రి స్ప్రేయింగ్, డ్రోన్ సోప్‌లు, డ్రోన్ అగ్రి అనలిటిక్స్, డ్రోన్ రిపేర్ & మెయింటెనెన్స్, ప్రెసిషన్ అగ్రికల్చర్, డిజిటల్ అగ్రికల్చర్ వంటి అగ్రి స్పెసిఫిక్ కోర్సులను అందించడానికి అకాడమీ సిద్ధంగా ఉంది. కావేరీ యూనివర్సిటీ డ్రోన్ అకాడమీ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్‌తో (NABARD) కలిసి పని చేస్తుంది. రైతు ఉత్పత్తి సంస్థలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు (CHCలు), తెలంగాణలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో డ్రోన్ సాంకేతికతను ఉపయోగించడంలో కావేరి విశ్వవిద్యాలయం తోడ్పాటు అందిస్తుందని ఆ సంస్థ యాజమాన్యం తెలిపింది.
అన్ని అనుమతులు ఉన్నాయి
కావేరీ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సులర్ డాక్టర్ వెల్చాల ప్రవీణ్ రావు మాట్లాడుతూ... కావేరీ సీడ్స్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌తో మారూట్ డ్రోన్స్ అకాడమీ అనుభవం ఉపయోగించి ప్రత్యేక వ్యవసాయ శిక్షణను అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కావేరీ యూనివర్సిటీ సిద్దిపేట గ్రామీణ, శివారు ప్రాంతాల్లో మంచి ప్రదేశంలో ఉందన్నారు. డ్రోన్ శిక్షణకు DGCA ఆమోదించిన RPTO కలిగి ఉన్న తెలంగాణ మొట్టమొదటి ప్రైవేట్ విశ్వవిద్యాలయం కావేరీ అన్నారు. కావేరీ వర్సిటీ మిషన్‌కు అనుగుణంగా, ఈ ప్రాంతంలోని స్థానిక రైతులలో డ్రోన్ అప్లికేషన్‌ల గురించి అవగాహన పెంచుతూ, విలువైన ఉద్యోగ, వ్యాపార అవకాశాలతో యువ ప్రతిభావంతులకు సాధికారత కల్పించడానికి కట్టుబడి ఉన్నామన్నారు. త్వరలో రాష్ట్ర మంత్రుల చేతుల మీదుగా యూనివర్సిటీ ప్రారంభం కానున్నట్లు తెలిపారు.