తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cyber Crime : ప్రముఖ కంపెనీలో ఉద్యోగం, సిద్దిపేట యువతికి రూ.16 లక్షలు టోకరా - ఏపీలో సైబర్ కేటుగాడు అరెస్ట్

Cyber Crime : ప్రముఖ కంపెనీలో ఉద్యోగం, సిద్దిపేట యువతికి రూ.16 లక్షలు టోకరా - ఏపీలో సైబర్ కేటుగాడు అరెస్ట్

HT Telugu Desk HT Telugu

04 May 2024, 17:26 IST

    • Cyber Crime : ప్రముఖ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తామని సిద్దిపేటకు చెందిన ఓ యువతి వద్ద రూ.16 లక్షలు దోచేశాడో కేటుగాడు. యువతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు నిందితుడ్ని పట్టుకున్నారు.
సిద్దిపేట యువతికి రూ.16 లక్షలు టోకరా
సిద్దిపేట యువతికి రూ.16 లక్షలు టోకరా (Pixabay)

సిద్దిపేట యువతికి రూ.16 లక్షలు టోకరా

Cyber Crime : ప్రముఖ కంపెనీలలో ఉద్యోగం(Job Offer) ఇప్పిస్తానని నమ్మించి ఓ యువతి వద్ద డబ్బులు తీసుకుని మోసం చేసిన సైబర్ నిందితుడిని(Cyber Crime) సిద్దిపేట సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ తెలిపిన వివరాల ప్రకారం... సిద్దిపేట పట్టణానికి చెందిన ఓ యువతి కొద్దిరోజుల క్రితం ఉద్యోగం కోసం ఒక లింకులో తన వివరాలు నమోదు చేసింది. ఈ విషయాన్ని గమనించిన ఏపీలోని చిత్తూరు (Chittoor)జిల్లా పెద్ద పంజాణి మండలం మల్లసముద్రం గ్రామానికి చెందిన సండూరు అరవింద్ అనే యువకుడు, సిద్దిపేటకు చెందిన యువతికి ఫోన్ చేసి కాగ్నిజెంట్ అనే కంపెనీలో బ్యాక్ డోర్ జాబ్స్(Back Door Jobs) ఉన్నాయని చెప్పాడు.

రూ.16 లక్షలు పోగొట్టుకున్న యువతి

అది నమ్మిన బాధితురాలు నిందితుడు చెప్పిన విధంగా జాబ్(Job) వస్తుందనే ఆశతో గూగుల్ పే, ఫోన్ పే ద్వారా ఐదారు విడతలలో రూ.16,75,750 పంపించింది. అనంతరం అతని ఫోన్ నెంబర్ కు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. అనుమానం వచ్చిన బాధితురాలు మోసపోయానని గ్రహించి వెంటనే జాతీయ సైబర్ సెల్ నెంబర్(Cyber Cell No) 1930 ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. తదుపరి సిద్దిపేట సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కు వచ్చి దరఖాస్తు ఇవ్వగా సైబర్ క్రైమ్(Cyber Crime) పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏసీపీ శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ శేఖర్ సిబ్బందితో కలిసి అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి నిందితున్ని పట్టుకుని, జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించారు.

సైబర్ నేరాల(Cyber Crimes) పట్ల అప్రమత్తంగా ఉండాలని, లోన్ యాప్, లాటరీ, పార్ట్ టైమ్ జాబ్, విదేశీ ప్రయాణం, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం, పాన్ కార్డ్ అప్డేట్స్, ఆధార్ కార్డు లింక్ తో సైబర్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అలాంటి మెసేజ్ రాగానే ఆశపడి మోసపోకుండా అప్రమత్తంగా ఉండండి. సైబర్ నేరగాళ్లు ఆశ, భయం అనే రెండు అంశాల మీద సైబర్ నేరాలు చేస్తున్నారు. ప్రజలు నిరుద్యోగులు, విద్యార్థినీ విద్యార్థులు, వ్యాపారస్తులు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అప్రమత్తతే ఆయుధమని కమిషనర్ అనురాధ తెలిపారు.

పోగొట్టుకున్న 660 సెల్ ఫోన్లు రికవరీ

ఏప్రిల్ 20 నుంచి ఇవాళ్టి వరకు వినియోగదారులు పోగొట్టుకున్న సెల్ ఫోన్లు(Cell Phones) సీఈఐఆర్(CEIR) టెక్నాలజీ ద్వారా గుర్తించి 660 ఫోన్లను స్వాధీనం చేసుకుని సంబంధిత బాధితులకు అప్పగించామని జరిగిందని సీపీ అనురాధ తెలిపారు . ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ సెల్ ఫోన్ ఎక్కడైనా పడిపోయినా, ఎవ్వరైనా దొంగలించినా వెంటనే సీఈఐఆర్ (CEIR) డాటా నమోదు చేసుకోవాలన్నారు. మీ బంధువులలో, గ్రామాలలో,స్నేహితులలో ఎవరిదైనా ఫోన్ దొంగతనం జరిగిన, ఎక్కడైనా పడిపోయిన వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయాలనే విషయంపై వారందరికీ అవగాహన కల్పించాలని సూచించారు. ఇవాళ్టి వరకు జిల్లాలో సీఈఐఆర్ పోర్టల్ లో 2210 మంది సెల్ఫోన్ పోయినట్లు నమోదు చేసుకున్నారని అందులో 660 సెల్ ఫోన్లు రికవరీ చేసి సంబంధిత బాధితులకు అప్పగించామని సీపీ తెలిపారు. మిగతా ఫోన్లు కూడా త్వరలో ట్రేస్ ఔట్ చేసి సంబంధిత బాధితులకు అప్పగిస్తామన్నారు.

తదుపరి వ్యాసం