Free Civils Coaching : ఫ్రీగా సివిల్స్ కోచింగ్ - బుక్స్ తో పాటు భోజన సౌకర్యం, నిబంధనలివే
03 June 2023, 8:28 IST
- TSSC Study Circle Free Coaching: ఈ ఏడాది షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖకు చెందిన రాష్ట్ర స్టడీసర్కిల్‌లో సివిల్స్ ప్రిలిమినరీ, మెయిన్స్ కోచింగ్ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు అధికారులు వివరాలు వెల్లడించారు.
సివిల్ సర్వీసెస్ కోచింగ్ కోసం నోటిఫికేషన్
TSSC Study Circle Free Coaching: సివిల్స్ ప్రిపేర్ అయ్యే వారికి గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ. 2023-24 సంవత్సరానికై రాష్ట్ర స్టడీసర్కిల్ నందు సివిల్స్ ప్రిలిమినరీ మరియు మెయిన్స్ కోచింగ్ కోసం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీధర్ తెలిపారు. ఈ నోటిఫికేషన్ త్వరలోనే వెలువడుతుందని తెలిపారు.
హైదరాబాద్ లో ఉన్న రాష్ట్ర స్టడీ సర్కిల్ నందు ఈ సంవత్సరం కోచింగ్ కోసం 100 మందిని రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తామన్నారు. ఎంపికైన అభ్యర్థులకు ఉచిత భోజనము వసతితో కూడిన పది నెలల కోచింగ్ ఇవ్వగలమని తెలిపారు. ప్రిలిమినరీ, మెయిన్స్ సబ్జెక్టుల (పాలిటి, ఎకానమీ, హిస్టరీ, జాగ్రఫీ, కల్చర్, సైన్స్ అండ్ టెక్నాలజీ, సోషల్ ఇష్యూస్, కరెంట్ అఫైర్స్) యందు దాదాపు వెయ్యి గంటలకు పైగా తరగతులు ఉంటాయని పేర్కొన్నారు. ఇక ఆప్షనల్ సబ్జెక్టులపై ఒక్కోదానికై 150 నుంచి 200 పైగా కోచింగ్ ఏర్పాటు చేయబడుతున్నట్లు తెలిపారు. ఏఏ సబ్జెక్టులకు ఆఫ్‌లైన్ కోచింగ్ సాధ్యపడదో వాటికి ఆన్లైన్ కోచింగ్ ఏర్పాటు చేస్తామని వివరించారు
200 మంది విద్యార్థులు కూర్చునే ఒక ఎయిర్ కండిషన్ క్లాస్‌రూమ్ (ఆడిటోరియం), 50 మంది కూర్చోగలిగిన మరో మూడు ఏసి క్లాస్ రూములు ఉన్నాయన్నారు. 80 కంప్యూటర్లతో కూడిన రెండు డిజిటల్ లైబ్రరీలు విద్యార్థుల సౌకర్యార్థం ఏర్పాటు చేశామని వెల్లడించారు. హై స్పీడ్ మరియు అన్ లిమిటెడ్ డాటా కలిగిన ఇంటర్నెట్ సౌకర్యం స్టడీ సర్కిల్ ఆవరణ అంతా అందుబాటులో ఉందని తెలిపారు. దాదాపు 12000 లకు పైగా పుస్తకాలు (ముఖ్యంగా రెఫరెన్స్ స్థాయి) కలిగిన లైబ్రరీలో ప్రతి విద్యార్థికై ఒక క్యుబికల్ ఉంటుందని, అన్ని ముఖ్యమైన తెలుగు ఇంగ్లీషు వార్తాపత్రికలు, మ్యాగజైన్లు విద్యార్థులకు అందుబాటులో ఉంటాయని చెప్పారు.
ఇక విద్యార్థులకు పుస్తకాల కొనుగోలుకు పదివేల రూపాయలు ఇవ్వబడతాయని శ్రీధర్ ప్రకటించారు. నెలనెలా పాకెట్ మనీ మరియు వైద్యము, ఔషధాల కొనుగోలుకై తగిన డబ్బులు చెల్లించబడతాయని, పురుషులకు, మహిళలకు వేరువేరు హాస్టళ్ళు ఉన్నాయని, విద్యార్థుల స్వయం నిర్వహణలోని మెస్ ద్వారా చక్కని పౌష్టికాహారం అందిస్తున్నామని తెలిపారు. 75% సీట్లు షెడ్యూల్డ్ కులాల వారికి కేటాయించబడగా, 15% సీట్లు వెనుక బడిన తరగతుల వారికీ, 10% సీట్లు షెడ్యూల్డ్ తెగల వారికి కేటాయించడం జరిగుతుందని చెప్పుకొచ్చారు. 2022-23వ సంవత్సరం లో 250 మంది కోచింగ్ పొందగా, 18 మంది ప్రిలిమ్స్ నందు ఉత్తీర్ణులై మెయిన్స్ పరీక్ష రాసారని, అందులో ముగ్గురు ఇంటర్వ్యూ కు ఎంపిక అయి ఢిల్లీకి వెళితే ఒకరికి 885 వ ర్యాంకు వచ్చిందని IRS (Income Tax) లేదా IRS (Customs) పోస్టు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. కాబట్టి సివిల్ సర్వీసెస్ ఆశావహులైన పట్టభద్రులు, రాష్ట్ర స్టడీసర్కిల్ నందు ప్రవేశం పొందే ఈ అవకాశం వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉండాలని.. ప్రవేశపరీక్షకై దరఖాస్తు చేసుకోవాలని కోరారు.